ఇంటర్ పరీక్షల కుంభకోణంలో తెరవెనుక సూత్రధారులు ఎవరు?

Article
ఇంటర్మీడియట్ ఫలితాల కుంభకోణంలో అసలు భాద్యులు, నిజాలు దాస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. కీలకమైన ఒప్పందాలు లేకుండానే గ్లోబరేనా టెక్నాలజీస్ సంస్థ కు పని ఎందుకు అప్పగించారు? పైనుంచి ఒత్తిడి లేకుండా కేవలం ఇంటర్మీడియట్ బోర్డు మాత్రమే ఈ ఉల్లంఘనలకు పాల్పడిందంటే ప్రజలు నమ్మటంలేదు. దీనివెనుక రాజకీయ పెద్దల హస్తం ఉందనేది జనం ఉవాచ.టెస్ట్ రన్ లో తప్పులు చోటు చేసుకున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్లారంటేనే అర్ధమవుతుంది దీనివెనుక ఎంత ఒత్తిడి ఉందనేది. గ్లోబరేనా టెక్నాలజీస్ సంస్థ వివిధ రకాల పనులు చేపట్టింది.అందులో ఈ ఇంటర్ పరీక్షా ప్రక్రియ ఒకటి. అయితే ఈ ఫీల్డ్ లో ఇదే అతి పెద్ద ప్రాజెక్ట్. కాంట్రాక్టు బిడ్డింగ్ ద్వారా వచ్చినా కొన్ని షరతులునుంచి మినహాయింపులు ఎవరిచ్చారో తేలాల్సివుంది. దీని సిఇవో వి ఎస్ యెన్ రాజు మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. తన ట్రాక్ రికార్డు బాగానే వున్నా , ఈ ఫీల్డ్ లో ఇంతకుముందు ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్ చేపట్టలేదు. ఈ రాజు గారికి ఏ రాజకీయ నేపధ్యము లేకుండా కాంట్రాక్టు దక్కిందా అంటే ఖచ్చితంగా నో అని చెప్పలేకపోతున్నారు. దీనివెనుక ఎవరున్నారో తెలిస్తేనే అసలు బాధ్యులను కనిపెట్టగలరు. ఇంతపెద్దఎత్తున గొడవలు జరుగుతున్నా, 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ఎప్పుడూ ఆక్టివ్ గా వుండే కెటి రామారావు ఎక్కడా కనిపించక పోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. సహజంగా హైద్రాబాదులో రాజు లాబీ కేటీఆర్ కు అతి సన్నిహితమని అందరూ చెప్పుకుంటుంటారు. మరి ఈ కేసులో ఆ లాబీ పాత్ర వుందా? ఇవన్నీ ప్రజలకున్న సందేహాలు. ఇందులో నిజమెంతో లేక కేవలం వదంతులేనా అనేది తేలాల్సివుంది. ప్రజల అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఎప్పుడూ ఆక్టివ్ గా వుండే కేటీఆర్ మిన్నకుండటం, కేసీఆర్ నిన్న జరిగిన పత్రికా సమావేశంలో ఈ సమస్యను పక్కదారిమళ్లించాలని ప్రయత్నం చేయటం చూస్తుంటే ప్రజల సందేహాలు నిజమేనా అని పరిశీలకులు ఆలోచిస్తున్నారు. సమస్యల్లా తెలంగాణ లో పత్రికలూ, టీవీ లు ఇప్పుడున్న రాజకీయ నాయకత్వంపై ఏదన్నా రాయాలంటే భయపడే పరిస్థితి వుంది.అందువల్లనే స్వతంత్ర దర్యాప్తు చేయటానికి పత్రికలూ,చానళ్ళు వెనకాడుతున్నాయని జనం నోట్లో నానుతుంది. మొత్తం దేశంలో పత్రికలూ, ఛానళ్లూ ఇంతగా భయపడే వాతావరణం తెలంగాణలోనే వుంది. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు విన్నూత్నంగా రికార్డు నెలకొల్పాయి. ఆంధ్ర లో చానళ్ళు పత్రికలూ చంద్రబాబునాయుడుకి స్వచ్చందంగా అనుకూల మీడియాలుగా పనిచేస్తుంటే తెలంగాణ లో భయంతో అనుకూలంగా పనిచేస్తున్నాయి.వెరసి పత్రికా స్వేచ్ఛ రెండుచోట్ల కరువయ్యింది. ఈ నేపథ్యంలో దీని తెరవెనుక సూత్రధారులు ఎప్పటికైనా బయకు వస్తారా అనేది వంద డాల్లర్ల ప్రశ్న. వేచి చూద్దాం మరి.
Prev తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.