జగన్ పాలన తీపి, చేదుల కలబోత

జగన్ పాలన తీపి, చేదుల కలబోత

ఆంధ్రాలో ప్రభుత్వ పాలన తీపి, చేదులు గా నడుస్తుంది. ఒకవైపు ఎన్నికల్లో వాగ్దానం చేసిన నవరత్నాలపై దృష్టిపెడుతూనే రెండోవైపు చంద్రబాబు నాయుడు పాత పాలనలో జరిగిన ' అవినీతి ' పై దృష్టిపెట్టింది. ఇంతవరకు ఆంధ్రరాష్ట్ర ప్రజలకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ప్రభుత్వ పాలనలో అవినీతి ని వెలికి తీయటం వరకు ఆహ్వానించదగ్గపరిణామమే. కానీ ఆపేరుతో అపరిపక్వ నిర్ణయాలు తీసుకోవటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నష్టం చేస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు ప్రతిదాన్ని రాజకీయంచేయటం కూడా సరికాదు. ఉదాహరణకు వరదల్లో చంద్రబాబునాయుడు వుండే ఇంటికి నీళ్లు రావటాన్ని రాజకీయంచేయటం ప్రజలు హర్షించరు. అసలు కరకట్టలోపల వున్న ఇంట్లోవుండటమే పెద్ద తప్పు. అయిపోయినదేదో అయిపొయింది ఇప్పటికైనా ఆ ఇల్లు ఖాళి చేస్తే చంద్రబాబునాయుడు కి హుందాగా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి గా వుండి అక్రమ నిర్మాణం జరిగిన భవనం లో ఉండటమే కాకుండా ఇంకా దానిపై రభస చేయటం తన ఇమేజ్ కి దెబ్బగా భావించాలి.

ఇక జగన్ విషయానికొస్తే మద్య విధానం బాగుంది. క్రమంగా మద్యం షాపులు తగ్గించాలని నిర్ణయించటం అందరూ హర్షించాలి. కానీ అంతిమంగా నిషేదిస్తామనేది ఆచరణ సాధ్యమూ కాదు, అది వ్యక్తి స్వాతంత్య్రాన్ని హరించినట్లే అవుతుంది. ప్రపంచంలో నిషేదించిన దేశాల్లో ఎక్కడా విజయవంతం కాలేదు. అలాగే మనదేశంలోని రాష్ట్రాల్లో కూడా. రెండోది, ముఖ్యమైన విషయం మద్యం నిషేదించాల్సిన జాబితా కాదు. సిగరెట్లు, బీడీలు నిషేధిస్తే అర్థముంది కానీ మద్యం నిషేధం సరికాదు. మద్యపాన నిషేధం నైతిక మార్గంగా గాంధీజీ ప్రచారం చేసినా ఈ 21 వ శతాబ్దం లో అది ప్రాముఖ్యత కోల్పోయింది. అయితే మనదేశం లో పేదరికం లో మగ్గుతున్న పేదప్రజానీకం మద్యానికి బానిసలై కుటుంబాలని ఇబ్బందుల పాలుచేయటం తెలిసిందే. అందుకే మొదట్లో మద్యపాన నిషేదానికి అందరూ స్వాగతించారు. కానీ గత 70 సంవత్సరాల పరిణామ క్రమంలో వచ్చిన మార్పుల్ని పరిగణన లోకి తీసుకోవాలి. అనుభవం లో నిషేధం పేరుకుమాత్రమే నని , చీకటి వ్యాపారం విచ్చలివిడిగా జరిగి విపరీతమైన అవినీతి జరిగిందని అందరికీ తెలుసు. దానితోపాటు కల్తీ మద్యం తాగి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఇంకో ముఖ్యపరిణామం పేదరికం దిగువన వున్న ప్రజానీకం గణనీయంగా తగ్గింది. అంతమాత్రాన మద్యాన్ని విచ్చలవిడిగా అందుబాటులో ఉంచటం తప్పే. సామాజిక మార్పుల్ని పరిగణనలోకి తీసుకొని మద్యాన్ని పూర్తిగా నిషేదించేబదులు నియంత్రించటం మంచిది. అంటే మద్యం షాపులు తగ్గించటం, తెరిచివుంచే సమయం తగ్గించటం లాంటి చర్యలు ఉపయోగపడతాయి. అంతేగాని పూర్తిగా నిషేదించటం ఆచరణాత్మక ఆలోచనకాదు.

జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రజలకు నష్టం కలిగించేవిగా వున్నాయి. ఉదాహరణకు పోలవరం పనులు ఆపేయటం, పీపీఏ లను పునఃసమీక్షించాలని నిర్ణయించటం అపరిపక్వ ఆలోచన. వీటిల్లో అవినీతి ఉంటే బయటపెట్టటం వరకు అభ్యంతరం లేదు, కానీ వాటిని రద్దు చేయటం వలన ప్రజలు నష్టపోతారు. ఈ రోజు జల విద్యుత్తు ప్రాజెక్టు పై హైకోర్టు బ్రేకులెయ్యటం చూసాము. పిపిఏలపై త్వరలో నిర్ణయం వెలువడుతుంది. ఇవి దుందుడుకు నిర్ణయాలనే చెప్పాలి. ఇకపోతే రాజధానిపై కూడా ఇంత గందరగోళం సృష్టించాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ స్థలం కరెక్టా కాదా అనే చర్చ అనవసరం. కాకపొతే నిధులకొరత ఉంటే మెల్లిగా చేయాలనుకోవడం వరకు ఓకే . అంతేకాని దీనిపై గందరగోళం సృష్టించటం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. పూర్తి మెజారిటీ వుంది కదా అని ఎలాబడితే అలా ప్రవర్తిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని మరిచిపోవద్దు. ప్రజల స్ఫుర ద్రూప్తి ని తక్కువ అంచనా వేయొద్దు. అలా అంచనా వేసే చంద్రబాబు నాయుడు పప్పులో కలిశాడు. తిరిగి అదే తప్పు జగన్ చేయొద్దు. ప్రజలు పూర్తీ మెజారిటీ తో అధికారమిచ్చింది సుపరిపాలన అందించాలని మరిచిపోవద్దు. జగన్ ఈ మూడు నెలల అనుభవంతో పునఃసమీక్షించుకొని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన అందిస్తాడని ఆశిద్దాం.

more updates »