జగన్ లో ఇంకా పరిణితి రావాలి

జగన్ లో ఇంకా పరిణితి రావాలి

జగన్ రెండు రోజులు ఢిల్లీలో పర్యటించివచ్చారు. ప్రధానమంత్రి ముందు పెద్ద లిస్టునే ఉంచారు. అందులో మొదటిది ప్రత్యేక హోదా . జగన్ చెప్పినట్లు వాళ్ళు ఇచ్చిందాకా అడుగుతానే వుంటాను అని చెప్పటంవరకు వినటానికి బాగున్నా కొన్నాళ్ళకు నవ్వులాటగా మారుతుంది. ఇంకొన్నాళ్ళకి ప్రధానికి విసుగు, చిరాకు వస్తుంది. ఎందుకంటే అడిగే వాళ్లకు , వినేవాళ్లకు ఇది రాదనీ తెలుసు. ఎదో ఫార్మాలిటీ కోసం ఒకసారి అడిగితె పర్వాలేదు. ప్రతిసారి రాని దాన్ని సాగదీయడం అర్ధంలేదు. ఆంధ్రా ప్రజలకు రాజకీయనాయకులు చెవులో పువ్వులు పెట్టటం మానుకోవాలి.

ఇకపోతే ఈ రెండురోజుల పర్యటనలో సాధించిందేమిటి? ఇంతకుముందు చంద్రబాబునాయుడు కూడా ఇలానే కాళ్లకు బలపం కట్టుకొని ఢిల్లీ చుట్టూ తిరిగిన సంగతి తెలిసిందే. దానివలన పెద్దగా ప్రయోజనం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం మార్చుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సాధ్యమైనవరకు ఢిల్లీ పర్యటనలు తగ్గించుకొని ఆ బాధ్యత అక్కడ ఎంపీ లు, ప్రభుత్వప్రతినిధిపై పెట్టారు. వాళ్ళు కేంద్రంలోని అధికారయంత్రాంగంతో లాబీలు చేస్తూ కావలసినవి సాధించుకుంటున్నారు. అసలు తెలుసుకోవాల్సిన విషయమేమంటే పన్నుల్లో వాటా ద్వారా, గ్రాంట్లరూపంలో రావాల్సిన సొమ్ముకి మించి రాష్ట్రాలకు విరివిగా కేటాయించే పరిస్థితి కేంద్రానికి లేదు. రోడ్ల విషయం లో ప్రైవేట్ పబ్లిక్ పద్దతిలో అనుమతులు మంజూరు చేయటానికి అవకాశాలు వున్నాయి. కావాల్సిందల్లా భూమిని అందుబాటులో రాష్ట్ర ప్రభుత్వం వుంచగలగాలి. అది చేయకుండా , డిపిఆర్ సిద్ధంచేయకుండా కేంద్రం ఏమీ చేయదు. వాస్తవానికి పైకి చెప్పేదొకటి, అక్కడ మాట్లాడేది ఇంకొకటి ఉంటుంది. ఇది గతంలో చంద్రబాబు చేశాడు, ఇప్పుడు జగన్ కూడా చేస్తున్నాడు.

కావాల్సింది రాష్ట్రంలో వున్న వనరులపై దృష్టి పెట్టి వాటిని ఎలా పెంచుకోవాలి, ఎలా సద్వినియోగం చేయాలి అనే విషయాలపై ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది. దాన్ని వదిలిపెట్టి కేంద్రం చుట్టూ తిరిగితే ప్రయోజనం లేదు. ఈరోజు కియా మోటరుకార్ల పరిశ్రమ మొట్టమొదటి కారుని మన రాష్ట్రంలో విధుల చేసింది. అది చాలా ముఖ్యమైన ఘటన. దానికి జగన్ హాజరు కాకపోవటం కరెక్ట్ కాదు. ఆర్ధికమంత్రి ని అంతటి ముఖ్యమైన ఈవెంట్ కి పంపించటం ఏ విధంగా అర్ధం చేసుకోవాలి. చంద్రబాబు హయాంలో వచ్చింది కాబట్టి వెళ్లలేదని ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత పరిణితిగా ప్రవర్తించాలి. నీపై ప్రజల్లో ఆదరణ ఉండొచ్చు. రేపు స్థానిక సంస్థల ఎన్నిక ల్లో పూర్తీ మెజారిటీ రావచ్చు. కానీ ప్రజలు పబ్లిక్ లోఉన్న వ్యక్తులను చాలా సునిశితంగా పరిగణిస్తారు. అందుకని ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. జగన్ చర్యల్లో ఇంకా పరిణితి వస్తే అది ఆంధ్ర ప్రజలకు ఉపయోగపడటమే కాకుండా తనపై కూడా మధ్యతరగతి వర్గంలో ఇప్పటికన్నా మెరుగ్గా ఆదరణ పెరుగుతుంది. ముందు ముందు ఆ దిశలో పయనిస్తాడని ఆశిద్దాం.

more updates »