జైట్లీ ప్రస్థానంలో మలుపులు,మైలురాళ్ళు

జైట్లీ ప్రస్థానంలో మలుపులు,మైలురాళ్ళు

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు సమస్య మరియు క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. మరి ఆయన తన జీవితం లో ఎన్నో మైలురాళ్ళు దాటారు, రాజకీయంగా ఎన్నో మలుపులు తిరిగారు అవన్నీ సంక్షిప్తంగా మీ కోసం..

అరుణ్ జైట్లీ డిసెంబర్ 28, 1952న ఢిల్లీలో మహారాజ్‌ కిషన్‌ జైట్లీ, రత్నప్రభ దంపతులకు జన్మించారు. తండ్రి ప్రముఖ న్యాయవాది. 1960 నుంచి 1969 మధ్య కాలంలో అరుణ్ జైట్లీ పాఠశాల చదువంతా ఢిల్లీలోని సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌లో సాగింది. 1973లో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్న సమయంలో అఖిల భారత విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేసారు. 1974లో విశ్వవిద్యాలయ విద్యార్థి యూనియన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. న్యాయ విద్య పూర్తయ్యాక 1977 నుంచి జైట్లీ సుప్రీంకోర్టు సహా, కొన్ని హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 1990లో ఢిల్లీ హైకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌ హోదా లభించింది.

అరుణ్ జైట్లీ ఒక వైపు న్యాయవాదిగా పనిచేస్తూనే.. మరోవైపు న్యాయపోరాటాలు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. విద్యార్థి దశలోనే ఏబీవీపీ నాయకుడుగా పనిచేసిన అరుణ్ జైట్లీ.. ఎమర్జెన్సీ టైమ్‌లో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీలో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ హోదా మంత్రిగా పనిచేశారు. 1999 లో వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2000 జులై 23న సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాది నవంబరులో అరుణ్ జైట్లీకి కేబినెట్‌ హోదా దక్కింది. 2009 జూన్‌ 3న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.

పలు రాష్ట్రాలలో బీజేపీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి.. కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడంతో అరుణ్ జైట్లీని రాజ్యసభ సభ్యుడిని చేసి ఆర్థికమంత్రి పదవిని అప్పగించారు. 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ గోవా సీఎంగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించారు.

2016 నవంబర్ 8న రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేశారు. ఆ సమయంలో అరుణ్ జైట్లీనే ఆర్థికమంత్రి. దీని వల్ల దేశానికి జరిగే మేలు గురించి, డిజిటల్ ఎకానమీ వైపు దేశం పరుగులు పెడుతుందని ఆయన విశ్వసించారు. దీంతో పాటు జీఎస్టీ కూడా ఆయన ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడే అమల్లోకి వచ్చింది. 2017 జూలై 1న అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రాలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి వాటిని ఒక్కతాటి మీదకు తీసుకురావడంలో అరుణ్ జైట్లీ కీలకపాత్ర పోషించారు.

అయితే అనారోగ్యం కారణంగా 2019 ఎన్నికల్లో అరుణ్ జైట్లీ పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ ఏడాది కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలోకి ఆయన చేరలేదు. అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్న ఆయన కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనను ఈ నెల 9న కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమించడంతో ఆగస్టు 24 న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

more updates »