జమిలీ ఎన్నికలు సాధ్యమేనా?

జమిలీ ఎన్నికలు సాధ్యమేనా?

జమిలీ ఎన్నికలకోసం మోడీ ఈసారి ఎన్నికైన వెంటనే కసరత్తు ముమ్మరం చేసాడు. దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించటమే కాకుండా దీని సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయటానికి ఓ కమిటీ ని కూడా నియమించినట్లు తెలుస్తుంది. అంటే దీనిపై మోడీ పట్టుదలతో ఉన్నట్లు అర్ధమవుతుంది. ఎన్నికల సంస్కరణలు మంచిదే కానీ అవి అరకొరగా చేసేబదులు అన్నీ కలిసి చేస్తే బావుంటుందికదా. జమిలీ ఎన్నికలకు సంబంధించి అందరూ ఊహిస్తున్నట్లు అదేమీ అసాధ్యమైనదేమీకాదు. ఇటీవలే ఇండోనేషియా ఒకేసారి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు , పార్లమెంట్ ఉభయ సభలు , రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేరోజు ఎనిమిది గంటల్లో పోలింగ్ నిర్వహించింది. 20 కోట్ల జనాభా, 17 వేల ద్వీపాలు కలిగిన దేశం నిర్వహించగలిగినప్పుడు భారతదేశం చేయగలదు . కానీ చట్టపరమైన, శాసనపరమైన మార్పులు చేయాల్సివుంది

.

ఇక దాని వలన కలిగే ప్రయోజనాలూ , నష్టాలు బేరీజు వేసుకుంటే ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా నిరంతర ఎన్నికలవలన రాజకీయ వాతావరణం ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండటం, సమాజం కులాలు, మతాలూ, వర్గాలు, కొట్లాటలు ,నేరాలతో అట్టుడికిపోవటం కొంతవరకు తగ్గుతాయి. అలాగే భారత రక్షణ దళాలను ఆంతరంగిక ఎన్నికలకు నిరంతరం వాడటం తగ్గించవచ్చు. ప్రభుత్వ ఖర్చు కూడా తగ్గుతుంది. అయితే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు చెప్పేది జమిలీ ఎన్నికలవలన అధికారంలోవున్న జాతీయపార్టీకి మేలుజరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాదిస్తున్నారు. ముఖ్యంగా ప్రాంతీయపార్టీలు , చిన్న పార్టీలు జమిలీ ఎన్నికలవలన నష్టపోతాయని వాదిస్తున్నారు. కానీ ఇటీవల జరిగిన ఒడిశా జమిలీ ఎన్నికల తీర్పు ఆ సందేహం నిజంకాదని తేలింది. పార్లమెంటులో బీజేపీ కి తగినన్ని స్థానాలు కట్టబెట్టిన వాళ్ళే అసెంబ్లీకి వచ్చేసరికి పూర్తిగా బిజూ జనతా దళ్ కే పట్టం కట్టారు. అంటే ప్రజలు అంత అమాయకులు కాదని తేలింది. ఇకపోతే ఇది ఆచరణ సాధ్యమేనా అనే సందేహం చాలామందికి వుంది.

దీనిపై ఇదివరకే నీతి ఆయోగ్ ఓ చర్చా ప్రతిని విడుదల చేసింది. దానిప్రకారం నీతి ఆయోగ్ దీన్ని రెండు దఫాలుగా జరిపేటట్లయితే ఆచరణ సాధ్యమేనని చెప్పింది. మొత్తం అసెంబ్లీలను రెండుగా విభజించి లోక్ సభ ఎన్నికలతో కొన్ని , తిరిగి రెండున్నర సంవత్సరాలలో మిగతావి నిర్వహించవచ్చని తేల్చింది. అంటే ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితిని బట్టి ఈ విభజన చేయవచ్చని చెప్పింది. అలాగే ఒకసారి ఎన్నికైన తర్వాత మధ్యలో అవిశ్వాసం పెట్టాలనుకుంటే దానితోపాటు ప్రత్యామ్నాయ విశ్వాస తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉందని చెప్పింది. అదీకాకపోతే తప్పనిపరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లాల్సివస్తే ఆ ప్రభుత్వ కాలపరిమితి మొత్తం అయిదు సంవత్సరాలలో మిగిలిన కాలానికే పరిమితం చెయ్యాలని తెలిపింది. ఈ సూచనలపై చర్చ జరిగి ఒక నిర్దిష్ట అభిప్రాయానికి రావచ్చు.

కాకపోతే సమస్యల్లా కేవలం జమిలీ ఎన్నికలవరకే సంస్కరణలు పరిమితం కావటం అంత హేతుబద్దంగా లేదు. లా కమిషన్, ఎన్నికల కమిటీ, ఇంకా అనేక సంస్థలు చేసిన ఎన్నికల సంస్కరణలు గాలికి వదిలేసి కేవలం జమిలీ ఎన్నికలకే పరిమితం కావటం ఎంతవరకు సబబు? ముఖ్యంగా ఎన్నికల కమిటీ ని స్వతంత్ర సంస్థగా మార్చటం ముఖ్యమైన సంస్కరణ. దానిపై ఇప్పటికే సిఫారసులు వున్నాయి, అలాగే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో మార్పులు కూడా అత్యవసరమని మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలే తెలియజేస్తున్నాయి. ఇంకో ముఖ్య సంస్కరణ రాజకీయపార్టీలకు ఇచ్చే డొనేషన్లకు సంబంధించింది. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నికల సంస్కరణలు అత్యవసరంగా దృష్టిసారించాల్సివుంది. వీటినికూడా జతచేసి అఖిలపక్ష సమావేశంలో చర్చించివుంటే సమగ్రంగా ఉండేది. అంతేకానీ మనకు నచ్చిన విషయానికే పరిమితమై మిగతావాటిని గాలికొదిలేయటం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. ఇప్పటికైనా సమగ్ర ఎన్నికల సంస్కరణలకు పూనుకుంటే ప్రజాస్వామ్యపరిపుష్టికి మంచిది.

more updates »