కాశ్మీర్ మారణహోమం ఎలా పరిష్కారమవుతుంది?

కాశ్మీర్ లో గత మూడు రోజుల్లో 44 మంది సైనికులు వీర మరణం పొందారు. అటు వైపు నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. మనకు ఊహ తెలిసినప్పటినుంచి కాశ్మీర్ రగులుతూనే వుంది. దీనితో సమాంతరంగా జరిగిన ఈశాన్య భారత వేర్పాటు ఉద్యమాలు దాదాపు సమసి పోయాయి. కానీ కాశ్మీర్ మాత్రం రావాణా కాష్టంలాగా రగులుతూనే వుంది. కొంతకాలం సద్దుమణిగినట్లు వున్నా తిరిగి మొలకెత్తుతూనే వుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో సమస్య మరింత జఠిలమయ్యింది. మరి దీనికి పరిష్కారం లేదా? ఒక్కముక్కలో చెప్పాలంటే సమీప భవిష్యత్తులో ఇది పరిష్కారం కాదు. సంప్రదింపులతో పరిష్కారం అవుతుందని కొంతమంది ఉదారవాదులు, వామపక్షవాదులు చెబుతున్నా అది వాస్తవదూరమనే చెప్పాలి. సంప్రదింపులు వద్దని చెప్పటం మూర్ఖత్వమే అవుతుంది. అయితే సమస్యపై నిర్దిష్ట అభిప్రాయం, అవగాహన లేకుండా సంప్రదింపులు జరపటం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ముందుగా చర్చలు ఎవరితో జరపాలి, ఏ మేరకు జరపాలి అనేది తేలకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా, ఎప్పుడువాడే పడికట్టు పదాలతో సంప్రదింపులు జరపాలి అనటంలో అర్ధంలేదు.

ముందుగా కావాల్సింది కాశ్మీర్ సమస్యపై ఓ జాతీయ అవగాహన. దురదృష్టవశాత్తు గత 71 సంవత్సరాలలో కాశ్మీర్ రగులుతున్నా అన్ని ప్రభుత్వాలు తాత్కాలిక చర్యలతోనే కాలం వెళ్లబుచ్చుతూ వచ్చాయి. అలాగే పాకిస్తాన్ విషయంలో కూడా ఓ జాతీయ అవగాహన ఉండాలి. ఈ రెండూ కలిపే ఒక జాతీయ విధానం తీసుకురావాలి. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 , 35 A ఫై కూడా ఒక స్థూల అవగాహన కు రావాలి. కాశ్మీర్ భూభాగంలో ప్రస్తుతం 43 శాతమే భారత అధీనంలో ఉందని మరవొద్దు. 37 శాతం పాకిస్తాన్ ఆదీనంలో, మిగతా 20 శాతం చైనా అధీనంలో వుంది. ఇది వాస్తవ పరిస్థితి. దీనిపైకూడా అరమరికలు లేకుండా చర్చించుకోవాలి. సిమ్లా ఒప్పందం నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ అంశం కాలం చెల్లిందనే విషయం ఫై అవగాహన లేకుండా ప్రకటనలు ఇవ్వటం మన రాజకీయ నాయకుల దివాళాకోరుతనానికి నిదర్శనం. ముందుగా మన రాజకీయ పార్టీలకు, వారి నాయకులకు కాశ్మీర్ సమస్య పూర్వాపరాలపై అవగాహనా సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఎంతయినా వుంది. ముందు సమస్యపై అవగాహనా వుంటే పరిష్కారమార్గాలను చర్చించవచ్చు. నా అంచనా ప్రకారం ఇప్పటి రాజకీయ నాయకుల్లో సగం మందికి పైగా ఈ సమస్య పై కొరకొర అవగాహన వున్న వాళ్ళే. ఇది చాలా ప్రమాదం. అర్ధంకాని వాళ్లకు చెప్పొచ్చు, అర్ధం అయిన వాళ్లతో చర్చించవచ్చు కాని అర్ధం అయ్యి,అర్ధం కాని వాళ్లకు ఎలా చెప్పాలి. ప్రజాభిప్రాయసేకరణ కోరింది భారత ప్రభుత్వమని, నిరాకరించింది పాకిస్తాన్ ప్రభుత్వమని ఎంతమందికి తెలుసు. భారత విభజన మతప్రాతిపదికన జరిగినా అది బ్రిటిష్ ఇండియా ప్రాంతానికే పరిమితమని కాశ్మీర్ కి వర్తించదని ఇప్పటికీ తెలియని వాళ్ళు గణనీయంగానే వున్నారు. కాశ్మీర్ మహారాజుతో జరిగిన ఒప్పందంలాంటి ఒప్పందాలు మిగతా 554 సంస్థానాలతో చేసుకున్నామని అవగాహన లేని వాళ్ళే కాశ్మీర్ ఒప్పంద ఉల్లంఘన గురించి మాట్లాడుతున్నారు. మిగతా సంస్థానాలతో కూడా విదేశీ వ్యవహారాలూ, రక్షణ వ్యవహారాలూ, కమ్యూనికేషన్ రంగం తప్పించి మిగతావన్నీ ఆయా రాజ్యాలే నిర్వహించుకుంటాయని భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని మరచిపోవద్దు. మరి ఆ రాజ్యాలన్నీ ఈ రోజు మీరు ఒప్పంద ఉల్లంఘన చేసారంటే భారత దేశమే లేదు. ఇందులో కొన్ని స్వతంత్ర దేశాలు గా ప్రకటించుకోవటానికి సిద్దపడ్డాయని ఎంతమందికి తెలుసు. అందరూ అనుకుంటున్నట్లు హైదరాబాద్ నిజాం నవాబు మాత్రమే కాదు, ట్రావంకోర్ లాంటి హిందూ రాజ్యాలు కూడా స్వతంత్రదేశాలుగా ఉండాలనే కోరుకున్నాయి. అయితే వాటిని నయానా భయానా ఒప్పించి ఒప్పందాలు చేసుకున్నాం. కాశ్మీర్ మహారాజు కూడా అలాగే స్వార్ధంతో స్వతంత్రంగా వుండాలని కోరుకున్నాడు. తప్పనిపరిస్థితుల్లో పాకిస్థాన్ కి భయపడి భారత్ తో ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో మతం సమస్య ఎక్కడుంది? ఓ విధంగా మతాన్ని ఇందులోకి చొప్పించి అనవసరమైన తాయిలాలు ప్రకటించి అదే సెక్యూలరిజమని కొత్త భాష్యాలు చెప్పబట్టే సమస్య ఇక్కడిదాకా వచ్చింది. ఓ విధంగా పాకిస్థాన్ కి ఈ తప్పులే కలిసి వచ్చాయి. ఇలా చరిత్రలో చెప్పాలంటే ఎన్నో తప్పులు జరిగాయి. వాటన్నింటిలోకి వెళ్లాలంటే ఒక వ్యాసం సరిపోదు. మరి ఇప్పుడు సమస్య ఏంటి?

ఈ రోజు సమస్యను వర్తమానంలోంచి చూద్దాం. కాశ్మీర్ లో అశాంతికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి గత దశాబ్దంలో ఇస్లాం ప్రపంచంలో పెను ప్రభావం చూపిన తీవ్రవాద ఇస్లాం. అది క్రమక్రమేణా కాశ్మీర్ లోకి ప్రవేశించింది. ఆజాద్ కాశ్మీర్ కల నెరవేరాలంటే ఇస్లామిక్ రాజ్య స్థాపన ద్వారానే సాధ్యమవుతుందని కాశ్మీర్ యువతలో నూరిపోశారు. కొంతమేరకు అందులో విజయవంతమయ్యారని చెప్పొచ్చు. దీనికి పాకిస్థాన్ లో తిష్టవేసిన ఉగ్రవాదసంస్థలు ప్రధాన కారణం. ముఖ్యంగా జైష్-ఏ-మొహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా, హిజబుల్ ముదాహిన్ లాంటి సంస్థలు పాకిస్థాన్-ఆఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లో శిక్షణ తీసుకుని తీవ్రవాద ఇస్లాం ప్రభావానికి లోనయ్యాయి. వీటి ప్రభావం కాశ్మీర్ యువత పై పడింది. ఇక రెండోది, ఎప్పటిలాగే పాకిస్థాన్ కాశ్మీర్ లోని తన అనుకూల సంస్థలూ, వ్యక్తుల ద్వారా తిరుగుబాటుని ప్రోత్సహించటం. ఈ రెండూ చర్చల ద్వారా పరిష్కారమయ్యేవి కావు. ఇవి రెంటికీ దీర్ఘకాలం లోనే పరిష్కారాలు దొరుకుతాయి.

ఒకనాటిలాగా కాశ్మీర్ సమస్య కేవలం కాశ్మీరీ అస్తిత్వం పోరాటమనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆ స్ఫూర్తి ఎప్పుడో పోయింది. అదే వుంటే ఈ రోజు గిల్గిట్-బాల్తిస్తాన్ ని 5 వ ప్రావిన్స్ గా ప్రకటించటానికి పాకిస్థాన్ పూనుకుంటుంటే ఒక్క హురియత్ నాయకుడైనా ఖండించాడా? చైనా కాశ్మీర్లో భాగమైన ఆక్సాయి-చిన్ ని అక్రమంగా ఆక్రమిస్తే నిరసన తెలిపారా? 1963 లో పాకిస్థాన్ బాల్తిస్తాన్ లో భాగమైన సాక్సాగం ప్రాంతాన్ని చైనాకు ధారాదత్తం చేస్తే నోరువిప్పి తప్పు అని అన్నారా? మరి కాశ్మీర్ స్వతంత్ర పోరాటం ఎక్కడుంది? కేవలం పాకిస్థాన్ కనుసన్నలలో భారత్ పై అబద్దాలు ప్రచారం చేయటానికే పరిమితమయింది. సమస్యను మారిన రాజకీయపరిస్థితుల నుంచి చూడకుండా పాత పడికట్టు పదాలతో, ఆలోచనలతో పరిష్కారమార్గాలు వెదకటం దుస్సాహసమనే చెప్పాలి. ఈ ఆలోచనలు ఓ విధంగా పరోక్షంగా పాకిస్థాన్ కే మేలుచేస్తాయి. పాకిస్థాన్ పొరుగుదేశాలైన ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్ లు కూడా వాళ్ళ దేశాల్లో ఉగ్రవాద సమస్యకు మూలాలు పాకిస్థాన్ లో ఉన్నాయని చెబుతుంటే ఇక్కడ ఉదారవాద మేధావులు నీళ్లు నములుతుంటే ఏంచేయాలి? ఒక రాజకీయ నాయకుడు ప్రజాభిప్రాయ సేకరణ పై మాట్లాడితే, ఇంకో రాజకీయ నాయకుడు పాకిస్థాన్ దేశాన్ని తప్పు పెట్టొద్దని మాట్లాడుతాడు. ఇంతలో ప్రసిద్దిగాంచిన మమతా బెనర్జీ సిగ్గులేకుండా అసలు పుల్వామా సంఘటన ఇప్పుడే ఎందుకు జరిగిందని అనుమానాలు లేవనెత్తుతుంది. ఓ దేశమా నీకేమయింది? ఈ రాజకీయ నాయకులకు , మేధావులకు ఎప్పుడు జ్ఞానోదయమవుతుంది? ఇప్పుడైనా అందరూ ఒకటి కాలేరా? ఈ ప్రకటనలు చూసి ప్రజలకు రక్తం ఉడుకుతుంది. దయచేసి కొద్దిరోజులైనా మీ స్వార్ధాన్ని, 'అతి తెలివితేటల్ని' పక్కన పెట్టి దేశాన్ని గురించి ఆలోచించండి. మనం యుద్ధాలుచేయకపోయినా పర్వాలేదుకాని చేసే వారి మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా వుంటే అదేపదివేలు.

Prev చంద్రబాబుతో పోటీపడే సత్తా జగన్‌కు లేదు: రామ్మోహన్
Next రవిప్రకాశ్ కోసం మూడు రాష్ర్టాల్లో గాలింపు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.