కాశ్మీరుపై రెండోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్న రాహుల్ గాంధీ

కాశ్మీరుపై రెండోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్న రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ రెండోసారి కాశ్మీర్ పై సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. మొదటిది, కాశ్మీర్ పై ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించటం. ఇది రెండువిధాలుగా రాహుల్ గాంధీ కి, కాంగ్రెస్ కి చేటు చేసింది. కాశ్మీర్ మినహా మిగతా భారతదేశం లో కాశ్మీరుపై భారత ప్రభుత్వ చర్యల్ని దాదాపు ముక్తకంఠం తో ఆమోదించారని చెప్పొచ్చు. అటువంటి సెంటిమెంటు వున్నప్పుడు దానికి వ్యతిరేకంగా వైఖరి తీసుకోవటం ఆత్మహత్యాసదృశకం. రాహుల్ గాంధీ చేసిన మొదటి సెల్ఫ్ గోల్ ఇదే. దీనివలన కాంగ్రెస్ కి వచ్చిన మేలు ఏమీ లేదు. ముఖ్యంగా ఉత్తర భారతావని లో వున్న మద్దత్తు కూడా దీనితో పోగొట్టుకుంది. పోనీ కాశ్మీర్ లోనైనా ఏమైనా లబ్ది వచ్చిందా అంటే అదీలేదు. జమ్మూ, లడఖ్ ల్లో ఒంటరి అయిపొయింది. కనీసం కాశ్మీర్ లోయ లోనైనా లబ్ది వస్తుందా అంటే అదీ అనుమానమే. ప్రస్తుతం వేర్పాటువాదుల ప్రభావం ఎక్కువగా వుంది. ఇప్పట్లో వాళ్ళు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశమే లేదు. మరి అటువంటప్పుడు ఈ కాంగ్రెస్ వైఖరి సెల్ఫ్ గోల్ కాదా? ఎవరికోసం ఈ వైఖరి? గులాం నబి ఆజాద్ లాంటి వాళ్ళను సంతృప్తి పరచటానికా?

కాంగ్రెస్ పరిస్థితి గమ్యం లేని నావ లాగా అయిపోయింది .ఏమి చేయకూడదో అదే చేస్తుంది. ఒకవేళ వ్యతిరేక వైఖరి తీసుకున్నా అంతవరకే సూత్రప్రాయంగా ఉంటే సరిపోయేది. అంతేకానీ శ్రీనగర్ వెళ్లి అక్కడ పరిస్థితుల్లో చేయిపెట్టటం దేశ ప్రజలు హర్షించరు. అక్కడ పరిస్థితులు గంభీరంగా ఉన్నాయని అందరికీ తెలుసు. అవి కుదుటపడటానికి కొన్నాళ్ళు పడుతుందని కూడా ప్రజలు మానసికంగా సిద్ధపడ్డారు. ఈ పరిస్థితుల్లో కాశ్మీర్ వెళ్లి ఏమి చేద్దామని? ప్రభుత్వాన్ని ఇరకాటం పెడతామని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ప్రభుత్వం సంగతేమో గానీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఇరకాటం లో పడ్డారని ఘంటాపధంగా చెప్పొచ్చు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం వెంట ఉండకపోగా ప్రభుత్వాన్ని ఇరకాటం లో పెట్టటం దేశాన్ని ఇరకాటం లో పెట్టటం లాంటిదని రాహుల్ గాంధీ గ్రహించలేకపోవటం తన రాజనీతిజ్ఞత కు మచ్చనే. ఈ మాత్రం అంచనా వేసుకోలేకపోవటం ఏ విధంగా అర్ధం చేసుకోవాలి?

దీనికి కారణం మోడీపై గుడ్డి వ్యతిరేకత. మోడీ ఫై వున్న వ్యతిరేకత హేతుబద్దంగా ఆలోచించనివ్వటం లేదు. అందుకే, సమస్యని కూలంకషంగా అర్ధంచేసుకుని ప్రతిస్పందించే బదులు వ్యతిరేకించటమే పనిగా పెట్టుకున్నాడు. అందుకే గత ఎన్నికల్లో మోడీ పై ' చౌకీదార్ చోర్ హయ్ ' అంటూ వ్యక్తిగత విమర్శతో ప్రచారం చేశాడు. దాన్ని ప్రజలు తిరస్కరించినా రాహుల్ గాంధీ ఆత్మా విమర్శ చేసుకోలేదు. అదే తనని కాశ్మీర్ పై సెల్ఫ్ గోల్ వేసుకొనేటట్లు చేసింది. చివరకు కాంగ్రెస్ లో ఇటువంటి గుడ్డి వ్యతిరేకతపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ వైఖరి కాంగ్రెస్ ని మరింత దూరం చేస్తుందని నమ్మే నాయకులు రోజు రోజుకీ పెరుగుతున్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ తన వైఖరి మార్చుకుంటే మంచిది. లేకపోతె తనకే నష్టమని గ్రహించే రోజు ఎంతో దూరం లో లేదు.

more updates »