త్వరలో సిద్దిపేట ఉపఎన్నిక.. రాజకీయాల్లోకి హరీశ్ సతీమణి

Article

సీఎం కేసీఆర్ అన్న కూతురు, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్‌. రమ్యారావు చేసిన ఓ వాట్సాప్ పోస్టింగ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 'తాజా తెలంగాణ' హెడ్‌లైన్‌తో కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్‌లో రమ్యారావు ఈ మెసేజ్ పోస్ట్ చేశారు.'మరో 4 నెలల్లో సిద్దిపేటకు బై ఎలక్షన్‌. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న తన్నీరు శ్రీనిత' అని అందులో పేర్కొన్నారు. హరీశ్‌రావు సతీమణి పొలిటికల్ ఎంట్రీ అంటూ రమ్యారావు చేసిన పోస్టింగ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేచింది.

త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో హరీశ్ రావును కేసీఆర్ పార్లమెంటుకు పోటీ చేయిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా హరీశ్ రావును తనతో పాటు ఢిల్లీ రాజకీయాలకు తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో సిద్దిపేటకు ఉపఎన్నిక.. శ్రీనిత పొలిటికల్ ఎంట్రీ అన్న వార్త తెరపైకి రావడం.. హరీశ్ లోక్‌సభకు పోటీ చేయించడం ఖాయమే అన్న వాదనకు బలం చేకూర్చేలా మారింది.

హరీశ్ రావు రాజకీయ భవితవ్యంపై ఇంటా బయటా ఆసక్తికర చర్చ జరుగుతున్నవేళ.. రమ్యారావు చేసిన వాట్సాప్ పోస్ట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. టీఆర్ఎస్ అంతర్గత వర్గాల నుంచి ఆమెకు సమాచారం అందిందా?.. లేక ఇది కేవలం ఊహాగానమే అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఈ ప్రచారంపై హరీశ్ రావు స్పందిస్తారా?.. లేక చూసీ చూడనట్టు వదిలేస్తారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

Prev ఎడమకాలికి గాయం.. కుడి కాలికి ఆపరేషన్‌!
Next ఇంటర్‌ బోర్డు ఎదుట రేవంత్‌, సంపత్‌ల ధర్నా, అరెస్టు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.