ఇంటర్‌ ఫలితాల వ్యవహారంపై దృష్టిపెట్టిన కేసీఆర్‌

Article

హైదరాబాద్: ఇంటర్‌ ఫలితాల వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ దృష్టిపెట్టారు. ఇంటర్ బోర్డు వివాదంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యాశాఖా మంత్రి జగదీష్‌రెడ్డి, కార్యదర్శి అశోక్‌తో భేటీ అయ్యారు. మార్కుల వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి మనస్థాపంతో ఇప్పటి వరకు 19 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క పేపర్ రీ వాల్యూయేషన్‌కు రూ. 600 ఎక్కడినుంచి తెచ్చి కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ఎటువంటి రుసుము లేకుండానే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డులోని వ్యవస్థలు ఒక్కొక్కటిగా పతనావస్థకు చేరుకుంటున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ, ఉద్యోగుల బదిలీలు లేకపోవడంతో బోర్డులోని ప్రతి వ్యవస్థ లోపభూయిష్టంగా మారిందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఇంటర్ ఫలితాలపై సమీక్ష నిర్వహించడం ఆసక్తి నెలకొంది. సమీక్ష తర్వాత కేసీఆర్ చేసే ప్రకటనపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

Prev మోదీ బయోపిక్‌పై సుప్రీంకోర్టుకు ఈసీ నివేదిక
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.