కెసిఆర్ ప్రయత్నాలు ఫలించేనా?

1. మోడీ నేతృత్వంలోని యన్.డి.ఏ. ప్రభుత్వం సాగిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక, ప్రజా వ్యతిరేక పాలనకు అంతం పలకాలనే రాజకీయ సంకల్పంతో బిజెపి వ్యతిరేక పక్షాల్లోని అత్యధిక పార్టీలు జాతీయ స్థాయిలో ఒక వేదికపైకి వస్తున్న పరిణామక్రమాన్ని గమనిస్తున్నాం.

2. తన రాజకీయ లక్ష్యం పట్ల కెసిఆర్ కు స్పష్టత ఉండవచ్చునేమో! తాను తలపెట్టిన కార్యాచరణలో ప్రాంతీయ పార్టీలను కూడగట్టి రాజకీయ ప్రత్యామ్నాయాన్ని తయారు చేయడం కాదని, యం.ఐ.యం. అధినేత అసదుద్ధీన్ ఒవైసీని వెంటబెట్టుకొని మైనారిటీ ప్రజానీకాన్ని, సంస్థలను ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నమేనని బహిరంగంగా సెలవిచ్చి, మరొక వైపు బిజెడి, తృణమూల్ కాంగ్రెస్ అధినేతలను కలిశారు. మరికొంత మందిని కూడా కలిసే ప్రయత్నంలో ఉన్నారు.

3. దాదాపు 115(తెలంగాణా మినహా) లోక్ సభ స్థానాలున్న దక్షిణాదిలోని కర్నాటకలోని జెడి(యస్) కాంగ్రెస్ భాగస్వామ్యంతో అధికారంలో ఉన్నది, తమిళనాడులోని డియంకె యుపిఏలో భాగస్వామి, ఎఐఎడియంకె బిజెపికి సన్నిహితం, కేరళలో ఉన్నది ఎల్.డి.ఎఫ్., యుడిఎఫ్., ఆంధ్రప్రదేశ్ లోని పాలక పార్టీ టిడిపి కాంగ్రెసుతో చేతులు కలిపింది, మిగిలిన వై.యస్.ఆర్.సి.పి. మరియు జనసేనలు కెసిఆర్ తో జట్టు కట్టడానికి సిద్ధంగా లేవు కదా!

4. ఈశాన్య భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలు, బీహార్, మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు యన్.డి.ఏ. లేదా యుపిఏ కూటముల్లో భాగస్వాములుగా ఉన్నాయి.

5. డిసెంబరు 10న డిల్లీలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ తదితర పార్టీల అధినేతలు హాజరయ్యారు. బి.యస్.పి. మరియు సమాజ్ వాది పార్టీల అధినేతలు కాంగ్రెసుతో అంటీముట్టనట్లు ఉంటూనే అవసరం వచ్చినప్పుడల్లా చేతులు కలుపుతూనే ఉన్నారు.

6. బిజెడి అధినేత నవీన్ పట్నాయక్ ఏనాడు జాతీయ రాజకీయల్లో పెద్దగా ఆసక్తి కనబరిచిన దాఖలాలు లేవు.

7. జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలంతా మహా ముదురులే. ఒకర్నొకరు కలుసుకొన్నప్పుడు ఆలింగనాలు చేసుకొంటారు, చేతులు కలుపుతారు, సమిష్టిగా చేతులెత్తి ఫోటోలు దిగి, తామంతా జట్టుగా ఉన్నామని ప్రజలకు సంకేతాలు ఇస్తూ ఉంటారు, మళ్ళీ విమర్శనాస్త్రాలు సంధించుకొంటూనే ఉంటారు.

8. స్వార్థం, పదవీ వ్యామోహాన్ని తలకెక్కించుకొన్న‌రాజకీయ నాయకులకు మన దేశంలో కొదవే లేదు.

9. రానున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ లోక్ సభ స్థానాల్లో గెలుపొంది, డిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రధాన మంత్రి కుర్చీ ఎక్కాలని ఉవ్విళ్ళూరే వారూ చాలా మందే ఉన్నారు. వారిలో కెసిఆర్ గారు కూడా ఒకరు.

10. నేటి జాతీయ రాజకీయ ముఖ చిత్రాన్నినిశితంగా గమనిస్తే కెసిఆర్ తో జట్టు కట్టే వారెవరన్నా ఉన్నారా! అన్న అనుమానం రాక తప్పదు. అందుకే, కెసిఆర్ ఆలోచనల్లో దాగి ఉన్న‌ ప్రత్యామ్నాయ రాజకీయాల ఆంతర్యాన్ని విమర్శకులు అనుమాన కోణంలో చూస్తున్నారు.

టి.లక్ష్మీనారాయణ
రాజకీయ విశ్లేషకులు

Prev ప్రభుత్వ బ్యాంకుల మోసాలకు ‘చెక్’‌ పెట్టేందుకు..
Next రవిప్రకాశ్ కోసం మూడు రాష్ర్టాల్లో గాలింపు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.