లగడపాటి ముందస్తు ప్రకటనపై విశ్లేషణ

లగడపాటి రాజగోపాల్ పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో లేరు. మొదటి నుంచి సంచలనాలకు పెట్టింది పేరు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నంతకాలం దుర్గగుడిపై రోడ్ వంతెన రాకుండా అడ్డుపడ్డాడు, హైదరాబాద్ - విజయవాడ రహదారిలో విజయవాడకు చేరాలన్నా, బయటకు వెళ్లాలన్నా, ఉన్న ఒకేఒక మార్గం దుర్గ గుడి మార్గం. దుర్గ గుడి వద్ద ఇరుకు రహదారితో ట్రాఫిక్ కష్టాలు నిరంతరం కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ రోడ్ వంతెన కావాలన్నా తన మంకు పట్టు వలన ప్రజలు అష్టకష్టాలు పడ్డ సంగతి తెలిసిందే.

ఇక రాష్ట్ర విభజన సమయంలో తన పాత్ర పెద్ద సంచలనమే. రాష్ట్రం విభజన కాదు అని చివరిదాకా చెబుతూ వచ్చాడు. చివరకు పెప్పర్ స్ప్రే తో దేశం మొత్తం సంచలనం కలిగించాడు. దానితో పెప్పర్ స్ప్రే రాజగోపాల్ గా పేరుగాంచాడు.

ఈ వ్యతిరేక కార్యకలాపాలు ఎట్లా ఉన్నా తనకు దేశవ్యాప్తంగా పేరు తెచ్చింది ఎన్నికల సర్వేలు. గతంలో తాను ప్రకటించిన ఎన్నో ఎన్నికల సర్వేలు ఫలితాలకు దగ్గరగా ఉండటంతో తన సర్వేలపై ప్రజలకు క్రేజ్ పెరిగింది. చివరకు రాజకీయ పార్టీలకు కూడా అనుమానం వస్తే లగడపాటి ఫ్లాష్ సర్వే టీమ్ నే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమం లోనే కేటీఆర్ కూడా లగడపాటి ద్వారా సర్వే చేయించుకున్నాడు. గత నెలల్లో TV5 ఫ్లాష్ టీమ్ తో సర్వే చేయించి తెరాస ఈ ఎన్నికలల్లో అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని వెల్లడించింది. ఇదంతా గతం.

ఎన్నికలు దగ్గర పడేకొద్దీ లగడపాటి స్వయంగా రంగంలోకి దిగాడు. పత్రికలు ,ఛానల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ముందుగా తన సర్వే ఫలితాలు డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం 5గంటలకు ప్రకటిస్తానని చెప్పాడు, తర్వాత తిరుపతి దైవసన్నిధానంలో ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుస్తారని ప్రకటించాడు, ఆ తరువాత ABN ఆంధ్రజ్యోతి MD వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేటులో ఎంత గుచ్చిగుచ్చి అడిగినా 7 వ తేదీనే ఫలితాలు ప్రకటిస్తానన్నాడు.

మరి ఆ తర్వాత ఏమైంది?

అంత ఖఛ్చితంగా ఫలితాలు వెల్లడించనని చెప్పిన పెద్దమనిషి అంతలోనే మనసుమార్చుకొని ప్రజాఫ్రంట్ కు ఆధిక్యత ఉన్నదని చెప్పటంలో ఆంతర్యమేంటి? ఒక్కరోజులోనే యూటర్న్ ఎందుకు తీసుకోవలసి వచ్చింది.

సర్వే ఫలితాలు ఎంతవరకు కరెక్టనేది 11 వ తేదీ దాక వేచి చూడాల్సిందే, అయితే గత ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే తన సర్వేకు విశ్వశనీయత ఉందనే చెప్పాలి. ఇప్పుడు టాపిక్ సర్వే గురించి కాదు అది కేవలం ఎన్నికలకు మూడు రోజులముందు ప్రకటించడంపైనే. తన సర్వే ఫలితం తెరాస కు అనుకూలంగా వుంటే ఇలాగే ప్రకటించేవాడా? ఏ పార్టీకి చెందని విశ్లేషకులు , మేధావులు దీనిపై చర్చించుకుంటున్నారు. ఆయనకు అతి సన్నిహితంగా ఉండే రాధాకృష్ణ గుచ్చిగుచ్చి అడిగినా చెప్పనివాడు అంత త్వరగా నిర్ణయం మార్చుకోవాల్సిన అవసరమేమొచ్చింది? ఇందులోనే మతలబుంది.

సర్వేలో ప్రజాఫ్రంట్ కు ఆధిక్యత వుందనేది ముందుగా వెల్లడించటం వలన తటస్థంగా వుండే ఓటర్లను ప్రభావితం చెయ్యటానికే ముందస్తుగా విడుదల చేసాడనేది విశ్లేషకుల అంచనా. పూర్వాశ్రమంలో వున్న కాంగ్రెస్ వాసులతో పాటు , తన కులంకి చెందిన లాబీ కూడా బలంగా పనిచేసి తన మనసు మార్చారనేది అందరూ అనుకుంటున్న గుసగుసలు. మరి సర్వే ఫలితం తెరాస కు అనుకూలంగా వచ్చివుంటే ఇదేపని చేసివుండేవాడు కాదనేది జనం మాట. అంటే పైకి ఎంత తటస్థమని చెప్పినా లోపల తన తపనే ఈ పని చేయించిందని అందరూ అనుకుంటున్నారు. మరి దీనివలన పోటాపోటీగా వున్న నియోజకవర్గాలలో తటస్థులు ప్రజాకూటమి వైపే మొగ్గుచూపే అవకాశమే ఎక్కువ. తన ముందస్తు ప్రకటన ఉద్దేశం కూడా ప్రజాఫ్రంట్ కు సాయం చేయాలనే, కాబట్టి ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ గెలిస్తే అందులో చివర ముక్తాయింపు లగడపాటిదేనని చెప్పాలి.

ఎన్నికల తర్వాత లగడపాటికి ప్రజాఫ్రంట్ ఏవిధంగా ఋణం తీర్చుకుంటుందో చూడాలిమరి.

-అన్వేషి

Prev ఆపరేషన్‌ సక్సెస్‌.. చనిపోయిన మహిళ గర్భసంచి మార్పిడి..
Next బీజేపీపై నిప్పులు చెరిగిన కేసీఆర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.