స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Article

హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. తొలి విడత మే 6న, రెండో విడత మే 10న, మూడో విడత మే 14వ తేదీల్లో పోలింగ్ నిర్వహణ జరగనున్నట్లు వెల్లడించారు. మే 27న తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలిపారు.

ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను మీడియా ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలియజేస్తూ.. ఈ నెల 22న(రేపు) మొదటి విడత ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలిపారు. నామినేషన్ల దాఖలుకు మూడు రోజుల గడువు ఇస్తున్నట్లు చెప్పారు. మే నెల 6వ తేదీన మొదటి విడత ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో 212 జడ్పీటీసీలు, 2,365 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 10న రెండో విడత పోలింగ్ నిర్వహణ. రెండో విడతలో 199 జెడ్పీటీసీ, 2,109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ. ఏప్రిల్ 30న మూడోదశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. మే 14న మూడో విడత పోలింగ్ నిర్వహణ. మూడో విడతలో 127 జెడ్పీటీసీ, 1,343 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ. మంగపేట రిజర్వేషన్ల వివాదం కోర్టు పరిధిలో ఉ న్నందున ఇక్కడ ఎన్నికలను వాయిదా వేశారు. మంగపేట జడ్పీటీసీ స్థానంతో పాటు 40 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించట్లేదని నాగిరెడ్డి తెలిపారు.

జడ్పీటీసీ అభ్యర్థులు రూ. 4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులు రూ. లక్షా 50 వేల వరకు గరిష్టంగా వ్యయం చేయొచ్చన్నారు. మొత్తం ఓటర్లు 1,56,11,474 మంది. వీరిలో పురుష ఓటర్లు 77,34,800. మహిళా ఓటర్లు 78,76,361. ఇతరులు 313 మంది. మొత్తం 32,042 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు 1,47,000 మంది సిబ్బంది వినియోగం. అదేవిధంగా 54 వేల మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.

Prev గాంధీ ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.