లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్

లోక్‌సభ ఎన్నికలపై దృష్టి  పెట్టిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కేసీఆర్ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెలాఖరులోగా ప్రకటన రావచ్చన్న సూచనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 16 లోక్‌సభ స్థానాలపై గురిపెట్టిన గులాబీ బాస్‌ అందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇందుకు అనుగుణంగా వ్యూహరచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ వ్యవహరాలను కెటిఆర్‌కు అప్పగించిన సిఎం కెసిఆర్‌ పార్లమెంట్‌ ఎన్నికల బాధ్యతలను హరీష్‌ రావుకు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్‌.. వచ్చే పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల్లో 16 పార్లమెంటు స్థానాలు గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందుకోసం హరీశ్‌, కేటీఆర్‌ సేవలను ఉపయోగించుకోవాలని టీఆర్‌ఎస్‌ అధినేత చూస్తున్నారు. పార్టీలో సీనియర్‌ నేతలుగానే కాకుండా.. ఎన్నికల్లో అభ్యర్ధులను గెలిపించడంలో సిద్ధహస్తులైన ఈ ఇద్దరు నేతలకీ గులాబీబాస్‌ ఈ టాస్క్‌ని కూడా అప్పగించబోతున్నారని సమాచారం.

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి హరీశ్‌రావు కేసీఆర్‌కు వెన్నంటే ఉన్నారు. ఉద్యమ కాలంనుంచి పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరుంది. ఆయనకు అప్పగించిన నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధుల విజయం ఖాయమని కేసీఆర్‌ కూడా నమ్ముతారు. పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన అన్ని ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయంలో హరీశ్‌రావు కీలకపాత్ర పోషించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్‌ హరీశ్‌రావుకు, కేటీఆర్‌లకు పలు కీలక నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. అధినేత తమపైన ఉంచిన నమ్మకాన్ని వారు వమ్ము చేయలేదు. తమకి ఇచ్చిన టార్గెట్‌లను సమర్థవంతంగా పూర్తిచేశారు. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన కేటీఆర్‌ మెజారిటీ స్థానాలు గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పటివరకు పార్టీ విజయం సాధించని నియోజకవర్గాల బాధ్యతలను హరీశ్‌రావుకు అప్పగించారు. హరీశ్‌రావు కూడా లక్ష్యాన్ని సాధించి చూపారు. ముఖ్యంగా డీకే అరుణ, రేవంత్‌రెడ్డి, దామోదర రాజనర్శింహ వంటి బలమైన నేతలను ఓడించడంలో హరీశ్‌ రావు కీలకపాత్ర పోషించారు.

రెండవసారి అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ఇప్పటివరకు పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. తాజాగా చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో హరీశ్‌ రావును తీసుకోరని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నకసరత్తుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. హరీష్‌ రావుకు అతిపెద్ద బాధ్యతలను అప్పగించబోతున్నారని సమాచారం. టీఆర్‌ఎస్‌ని బలోపేతం చేయడం కోసం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించాక, ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల బాధ్యతను హరీష్‌ భుజాలపై పెట్టనున్నారని సమాచారం. దీంతో ఆయన పూర్తిగా ఆ వ్యవహారాలపైనే దృష్టి సారించనున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గులాబీపార్టీ మద్దతుదారులు పెద్దసంఖ్యలో గెలుపొందడంలో కేటీఆర్‌ తనదైన పాత్ర పోషించారు. అలాగే హరీష్‌ రావుకు పార్లమెంట్‌ బాధ్యతలు అప్పగించడం ద్వారా 16 సీట్ల టార్గెట్‌ చేరుకోవాలన్నది కేసీఆర్ అభిప్రాయంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని గమనించని కొందరు హరీష్‌ రావును దూరంగా పెడుతున్నారన్న ప్రచారంచేస్తున్నారని కొందరు అంటున్నారు.

more updates »