సహజీవనం చేస్తున్న ప్రేమికుల మధ్య చిచ్చురేపిన ఎస్‌ఎంఎస్‌

Article

హైదరాబాద్‌: సహజీవనం చేస్తున్న ప్రేమికుల మధ్య ఎస్‌ఎంఎస్‌ చిచ్చురేపింది. దీనిపై ప్రశ్నించడంతో అలిగిన యువతి కుమారుడు, భర్తను వదిలి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికిలోనైన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..కడప జిల్లా, పులివెందులకు చెందిన ఎర్రగొండు చరణ్‌ తేజరెడ్డి నగరానికి వలసవచ్చాడు. కుత్బుల్లాపూర్‌లోని వాజ్‌పేయి నగర్‌లో ఉంటూ స్థానిక నర్సరీలో పని చేసేవాడు. ఈ క్రమంలో నర్సరీకి వస్తున్న పావని అనే యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వీరిద్దరూ వాజ్‌పేయినగర్‌లోని ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. వీరికి కుమారుడు ధనుష్‌రెడ్డి(13 నెలలు) ఉన్నాడు.

చిచ్చు రేపిన ఎస్‌ఎంఎస్‌..
వారం రోజుల క్రితం పావని ఫోన్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ‘ఐలవ్‌ యూ’ పావని అంటూ మెసేజ్‌ వచ్చింది. దీనిని చూసిన చరణ్‌తేజ ఆమెను వివరణ కోరగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికిలోనైన పావని మూడు రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా చిన్నారిని సైతం వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఆందోళనకు గురైన చరణ్‌ ఆమె కోసం గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో మనస్తాపానికిలోనైన అతను గురువారం రాత్రి ఇంట్లో చీరతో సీలింగ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బాబు ఏడుపుతో వెలుగులోకి..
అర్ధరాత్రి నుంచి బాబు ఏడుపులు విన్న స్థానికులు శుక్రవారం తెల్లవారు జామున చరణ్‌తేజ ఇంటి తలుపు తట్టారు. తలుపులు తెరవకపోవడంతో బద్దలకొట్టి లోపలికి వెళ్లి చూడగా నేలపై బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. సీలింగ్‌కు చరణ్‌ ఉరివేసుకుని కనిపించాడు. పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.

పట్టించుకోని పావని..
చరణ్‌తేజ్‌ రెడ్డి ఆత్మహత్యపై స్థానికులు, చరణ్‌ స్నేహితులు పావనికి ఫోన్‌ చేసి సమాచారం అందించారు. దీనిని తేలిగ్గా తీసుకున్న ఆమె ‘అవునా.. నిజమా? అంటూ ఫొటోలు పంపండి చూస్తానంటూ చులకనగా మాట్లాడిందని చరణ్‌ స్నేహితులు పేర్కొన్నారు. విజయవాడకు చెందిన పావని, కడప జిల్లాకు చెందిన చరణ్‌తేజ రెడ్డి పెళ్లి చేసుకున్నారా..లేదా అన్నది తెలియరాలేదు. వారిద్దరికీ సంబంధించిన ఒక్క ఫొటో కూడా ఇంట్లో లభ్యం కాకపోవడం గమనార్హం.

Prev ట్రాఫిక్ చలానా కూడా కట్టని పవన్ కల్యాణ్ ఆదర్శ నాయకుడేనా?
Next పైసా ఖర్చు లేకుండా వైద్యఖర్చులు భరిస్తాం.. చంద్రబాబు హామీ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.