మరో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం!

మరో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం!

హైదరాబాద్‌: మహానగరం పరిధిలో అదృశ్యాల కలకలం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 1 నుంచి 10 వరకు సుమారు 540 మందికి పైగా అదృశ్యం కేసులు నమోదైన నేపథ్యంలో తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, ఇద్దరు విద్యార్థినులు జాడలేకుండా పోయారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన ఇద్దరు ఇంటర్‌ విద్యార్థినులు అదృశ్యమయ్యారు. పటాన్‌చెరుకు చెందిన ప్రశాంతి, గాయత్రి స్థానిక ఇంటర్‌ జూనియర్‌ కళాశాలలో చదువుతున్నారు. నిన్న ఉదయం ఇద్దరూ కళాశాలకు వెళ్తున్నామని చెప్పి మళ్లీ తిరిగి ఇంటికి రాలేదని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇద్దరు స్నేహితులు ఎక్కడికి వెళ్లారో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వారు పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పటాన్‌చెరులోని కృషి డిఫెన్స్‌ కాలనీకి చెందిన శివాని అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అదృశ్యమైంది. నిన్న రాత్రి ఆమెను తన స్నేహితుడు కాలనీలో దింపినట్టు సీసీఫుటేజీ దృశ్యాలు లభ్యమయ్యాయి. నిన్న రాత్రి నుంచి తన కూతురు కన్పించకుండా పోయిందని శివాని తండ్రి పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 540 మంది అదృశ్యమైన కేసుల్లో 220 మందిని మాత్రమే ఎటువెళ్లారనే అంశాన్ని పోలీసులు గుర్తించారు. ఇంకా సుమారు 318కి పైగా కేసుల్ని గుర్తించాల్సి ఉంది. అదృశ్యమైన వారిలో సుమారు 270మందికి పైగా మహిళలే ఉండటం గమనార్హం.

more updates »