మోడీ పర్యటనను అడ్డుకుంటే... టీడీపి పార్టీ ఉండదు: జీవీఎల్

మోడీ పర్యటనను అడ్డుకుంటే... టీడీపి పార్టీ ఉండదు: జీవీఎల్

ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఏపీ పర్యటనకి వస్తున్నారు. గుంటూరులో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. ‘మోదీ గో బ్యాక్‌’ అంటూ నినాదాలతో నల్ల జెండాలతో పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ ఏపీలో అడుగు పెట్టవద్దని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. మోడీ పర్యటనను ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీ పర్యటనపై శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి, టీడీపీ పార్టీ శ్రేణులకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు వార్నింగ్ ఇచ్చారు.

మోడీ పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే రాష్ట్రంలో టీడీపి ప్రభుత్వం ఉండదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల లెక్కలను తేల్చేందుకే మోడీ ఏపీకి వస్తున్నారని అన్నారు. మోడీ పర్యటనపై ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. టీడీపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటే తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి - పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి జరిగిన అవమానం కంటే కూడా ఘోరాతిఘోరంగా చంద్రబాబుకు పరాభవం తప్పదని కూడా జీవీఎల్ హెచ్చరికలు జారీ చేశారు.

more updates »