రవిప్రకాశ్ కోసం మూడు రాష్ర్టాల్లో గాలింపు

హైదరాబాద్: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం సైబరాబాద్ పోలీస్ బృందాలు మూడు రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఆయన కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్‌రావు ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రవిప్రకాశ్‌కు రెండు 160 సీఆర్పీసీ నోటీసులు, ఒక 41-ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేశా రు. వాటికి స్పందించకుండా అజ్ఞాతంలో ఉం డటంతో అతడి అరెస్టు కు పోలీసులు రంగం సిద్ధంచేశారు. మూడు ప్రత్యేక బృందాలు రవిప్రకాశ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా యి. సాంకేతికపరంగా రవిప్రకాశ్ మొబైల్‌నంబర్లపై ఆరాతీయగా ఈ నెల పదిన బంజారాహిల్స్‌లో స్విచాఫ్ అయినట్లు చూపిస్తున్నాయి.

అతడు తన సిమ్‌కార్డులను తీసేసి ఇతరుల ఐడీపేరుతో ఇంటర్నెట్ ద్వారా వాట్సప్ కాల్స్ వాడుతున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రవిప్రకాశ్ దాదాపు 25 నుంచి 30 సిమ్‌లను వాడినట్టు పోలీసులు గుర్తించారు. వాటికి సంబంధించిన గుర్తింపు ఆధారాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ నంబర్లన్నీ ఇతరుల పేరుమీద ఉన్నప్పటికీ వాటిని రవిప్రకాశే ఉపయోగించాడని పోలీసులు గుర్తించారు. ఇందులో చాలానంబర్లు స్విచాఫ్‌లో ఉండగా ప్రస్తుతం కొన్ని నం బర్లు ఇతరులు వాడుతున్నట్లు తెలిసింది. పోలీసులు వారిని కూడా ప్రశ్నించారని సమాచారం. ఈ నంబర్ల కాల్‌డాటాపై పోలీసులు దృషిపెట్టారు. దీనికోసం పోలీసులు ఆయా నెట్‌వర్క్ సంస్థలకు లేఖలు రాసి డాటాను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు శివాజీ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. శివాజీ వీడియోలో మాట్లాడటం కన్నా 160 సీఆర్పీసీ నోటీసు కింద హాజరై విచారణకు సహకరిస్తే గౌరవంగా ఉండేదని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. చట్టపరంగా వారికి అవ కాశాలు ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా అజ్ఞాతంలో ఉండటం సరికాదని అంటున్నారు. ఇప్పటికే ఫోర్జరీ, రవిప్రకాశ్-శివాజీల మధ్య జరిగిన షేర్ల కొనుగోలు, మళ్లింపుల డ్రామా కోసం రూపొందించిన స్క్రిప్ట్‌కు సంబంధించిన కంప్యూటర్లను న్యాయవాది జే కనకారాజు ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. హార్డ్‌డిస్కులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి రవిప్రకాశ్ ఫోర్జరీ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. 2794

Prev డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.