తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయ పథకాలపై నికోల్ గిరార్డ్ ప్రశంస

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయ పథకాలపై నికోల్ గిరార్డ్ ప్రశంస

హైదరాబాద్: రైతులకు భరోసాగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయ పథకాలైన రైతుబంధు, రైతుబీమాపై కెనడా కాన్సులేట్ జనరల్ నికోల్ గిరార్డ్ ప్రశంసలు కురిపించారు. సబ్బండవర్ణాల కోసం అమలుచేస్తున్న సంక్షే మ పథకాలు బాగున్నాయని కొనియాడారు. సోమవారం హైదరాబాద్‌లో బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతో నికోల్ గిరార్డ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నాలుగున్నరేండ్లలో అనేకరంగాల్లో సాధించిన అభివృద్ధిని ఆమెకు కేటీఆర్ వివరించారు. గతంలో మాదిరిగానే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదని, ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధితోపాటు వ్యవసాయరంగ ప్రగతికోసం వినూత్నమైన ప్రణాళికలను, పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తున్నదని వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి అమలుచేస్తున్న పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై నికోల్ గిరార్డ్ ప్రశంసల జల్లు కురిపించారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రాథమ్యాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించడంపట్ల గిరార్డ్ శుభాకాంక్షలు తెలిపారు. కెనడా, భారత్‌కు సంబంధించిన వ్యాపార వాణిజ్య సహకారానికి సంబంధించి ఇరువురి మధ్య చర్చకు రాగా.. కెనడా ప్రభుత్వం, ఇక్కడి రాష్ట్రాలతో నేరుగా చర్చలు జరిపితే వాణిజ్య సంబంధాలు మరింత బలపడుతాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని కేటీఆర్ వివరించారు. కెనడా పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం సాదరస్వాగతం పలుకుతుందని పేర్కొన్నారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో సచివాలయంలో నికోల్ గిరార్డ్ సమావేశమయ్యారు. ఆమె వెంట కెనడా హైకమిషన్ సీనియర్ రాజకీయ విశ్లేషకులు మధుశ్రీదాస్, ట్రేడ్ కమిషనర్ విక్రంజైన్ ఉన్నారు.

more updates »