తెదేపాకు మద్దతు ఓ ప్రయోగం: పవన్ కళ్యాణ్

Article

అమరావతి: ‘‘2014 ఎన్నికల్లో తెదేపాకు మద్దతిచ్చి ఒక సామాజిక ప్రయోగం చేశా. ఆ ప్రయోగం విజయవంతం కావడం వల్లే జనసేన బలంగా దూసుకుపోయింది. ఎదుటివారిని బలంగా ప్రశ్నించాలంటే నైతిక బలం కావాలి. అందుకే అప్పుడు తెదేపా, భాజపాలకు మద్దతు ఇచ్చి విజయం చేకూరేలా చేశా. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే కనీసం 30 ఏళ్లు పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలన్నా, అమరావతి ముందుకు వెళ్లాలన్నా జనసేన పార్టీ అవసరం ఉంది’’ అని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. 2019 ఎన్నికల్లో అద్భుతాలు సాధిస్తామో లేదో తెలియదు కానీ, జనసేన బలంగా అయితే నిలబడుతుందని చెప్పారు. విజయవాడలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం కడప, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై మాట్లాడారు.

తెదేపా నేతలను వ్యక్తిగతంగా విమర్శించలేదు
‘తెదేపా నాయకులను నేనెప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదు. జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఒక పరిధిలో మాత్రమే విమర్శలు చేశా. ప్రతిపక్ష నాయకుడిలా చంపేయండి, చింపేయండి అనలేదు. 2014లో జగన్‌ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు.. ఏం చేయగలవంటూ అంతా నన్ను ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రి కావడానికి రాజకీయాల్లోకి రాలేదు. సగటు మనిషి ఏం కోరుకుంటున్నాడో అది ఇవ్వడానికే వచ్చానని వారితో చెప్పా. 2014లో పరిమిత స్థానాల్లో పోటీ చేయాలని తొలుత భావించా. అయితే, అలా చేస్తే పార్టీ బలపడదన్న ఉద్దేశంతోనే పోటీకి దూరంగా ఉండి ఆ పార్టీలకు మద్దతు పలికి విజయం చేకూరేలా చేశా. మోదీ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేస్తారనే గట్టి నమ్మకంతోనే మద్దతిచ్చా. చంద్రబాబు మరో పదేళ్లు అధికారంలో ఉండాలంటారు.. ప్రతిపక్ష నేత జగన్‌ 30 ఏళ్లు అధికారం కావాలంటారు. పదవి కాదు.. మూడు తరాలు బాగుండాలనే ఆకాంక్ష ముఖ్యమని’ పవన్‌ అన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందన్నారు.

పవన్‌కల్యాణ్‌ ఈ నెల 13న భోగి రోజున సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ‘గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెదరావూరులోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఈ సంబరాలు జరగనున్నాయి.

Prev కదిలే రైళ్లలోనూ ఖాళీ బెర్తుల వివరాలు తెలుసుకోవచ్చు
Next పైసా ఖర్చు లేకుండా వైద్యఖర్చులు భరిస్తాం.. చంద్రబాబు హామీ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.