పోలవరం ప్రాజెక్టు ఆమోదంలో నిజమెంత?

పోలవరం ప్రాజెక్టు ఆమోదంలో నిజమెంత?

పోలవరం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి రెండువారాలక్రితం తిరుపతిలో మోడీని కలిసిన తర్వాత పోలవరం సవరించిన అంచనాల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారని ఈరోజు టైమ్స్ అఫ్ ఇండియా లో ప్రముఖంగా ప్రచురించారు. కానీ ఈ వార్తలో నిజమెంతో తెలియటంలేదు. ఈ ఆమోదం 2019 ఫిబ్రవరి 11 నే కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపినట్లు గా ఆ మరుసటి రోజే హిందూ పత్రికలో ప్రచురించారు. మరి తిరిగి సలహా కమిటీ ఆమోదం తెలిపేదేమీలేదు. పాత వార్తనే తిరిగి రాజ్య సభ లో ఆ శాఖ సహాయ మంత్రి విజయ సాయిరెడ్డి కి జవాబు రూపంలో ఇచ్చాడు. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. వాస్తవానికి ఈ నివేదికను ఆర్ధిక మంత్రి ఆమోదించాల్సి వుంది. ఆ తర్వాత కాబినెట్ ఆమోదం కోసం వెళుతుంది. ఇది ఫిబ్రవరి 11 వ తేదీ రోజు పరిస్థితి.

ఫిబ్రవరికి ఇంకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నాడు. కేంద్రం సవరించిన ప్రాజెక్ట్ నివేదికను ఆమోదించలేదని ఫిబ్రవరి 11 వ తేదీ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్నాకు సిద్దమయ్యాడు. అదేరోజు కేంద్ర జల కమిషన్ యొక్క సాంకేతిక సలహా కమిటీ దీన్ని ఆమోదించింది. నిజానికి ఈ క్రెడిట్ చంద్రబాబు ఖాతా లోనే వేయాల్సి ఉంటుంది . చివరకు అతి పెద్ద ప్రచురణ సంస్థ టైమ్స్ అఫ్ ఇండియా కూడా తనిఖీ చేసుకోకుండా ఇలా వార్త ప్రచురించటం ఆశ్చర్యంగా వుంది. ఇప్పటికైనా ఆంధ్రా రాష్ట్ర కోడలైన ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ ఈ సలహా సంఘ నివేదికను తక్షణం ఆమోదించి ఆంధ్రా ప్రజలకు న్యాయం చేయాలి. ఇంతకీ ఈ సవరించిన అంచనాల వివరేలేంటి.

దీని పాత విలువ 2010-11 ధరల ప్రకారం 16010 కోట్లు. అయితే తర్వాత జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించటం , 2013 భూసేకరణ చట్టం ప్రకారం సహాయ పునరావాస ఖర్చులు విపరీతంగా పెరగటం , తర్వాత పెరిగిన ఖర్చులు కలిపి రాష్ట్ర ప్రభుత్వం 2013-14 ధరల ప్రకారం 57941 కోట్ల రూపాయల అంచనాగా ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. కానీ దాన్ని ఆమోదించకుండా కేంద్రం నానుస్తుంటే ఫిబ్రవరి 11 వ తేదీన చంద్రబాబునాయుడు ఢిల్లీలో ధర్నాకు దిగాడు. అదే రోజు కీలకమైన సాంకేతిక సలహా సంఘం 2017-18 ధరల ప్రకారం 55548 కోట్ల రూపాయల తో ప్రాజెక్టును ఆమోదించింది. ఇందులో ప్రధానమైన ఖర్చు సహాయ పునరావాస లకే . మొత్తం ప్రాజెక్టులో 33168 కోట్లు సహాయ పునరావాసాలకు, ప్రధాన ప్రాజెక్టుకు 7734 కోట్లు, కుడి కాలువకు 4319 కోట్లు, ఎడమ కాలువకు 4203 కోట్లు, విద్యుత్తు ప్రాజెక్టుకు 4125 కోట్లు గా చూపించారు. ఇందులో విద్యుత్ ప్రాజెక్టు కు కేంద్రం ఇవ్వదు. కేవలం సాగునీటి ప్రాజెక్టుకు మాత్రమే ఇస్తుంది. ఇప్పటికీ సందేహమేమిటంటే సహాయ పునరావాసానికి కేంద్ర ఇస్తుందా? ఇస్తామని ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. సవరించిన ప్రాజెక్టు ఖర్చు అంచనాలను 55548 కోట్లుగా చెపుతుంది తప్పిస్తే అందులో విద్యుత్తు మినహాయించి మిగతా మొత్తం చెల్లిస్తామని చెప్పలేదు. కేంద్ర ఆర్ధిక మంత్రి ఆమోదించినప్పుడే మనకు పూర్తి వివరణ వస్తుంది. ఈ సందేహానికి కారణం లేకపోలేదు. సహాయ పునరావాసం భూమికి సంబంధించింది. దానిపై కేంద్ర మార్గదర్శకాలు ఎలా ఉన్నాయో తెలియదు. విద్యుత్తు కి సంబందించిన 4561 కోట్లు మాత్రం ఖాయంగా రాదు. ఇదంతా పరిశీలిస్తే సమస్య ఎక్కడి వేసిన గొంగళి అక్కడిలాగానే వుంది. మరి ఇదేదో జగన్ మోహన్ రెడ్డి మోడీ ని కలిసిన ఆమోదం పొందిందని తెలపటం మసి పూసి మారేడు కాయ చేయటమే.

more updates »