దేశఆర్ధికవ్యవస్థతో ఆటలాడుకుంటున్న రాహుల్ గాంధీ

రుణమాఫీ ఫై రాహుల్ గాంధీ ప్రచారాన్ని ప్రారంభించాడు. నిన్న మాట్లాడుతూ మొత్తం దేశానికి రుణమాఫీ వర్తింపచేసేదాకా మోడీకి నిద్రలేకుండా చేస్తానని చెప్పాడు. మోడీకేమోగాని దేశంలోని ఆర్ధికవేత్తలెవరికి ఈమాటతో ఆందోళనకు గురయి నిద్రరావటంలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీపడి దీనితో రాజకీయపార్టీలు వాగ్ధానాలమీద వాగ్దానాలు చేస్తారని ఆర్ధికవేత్తలంతా ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ జనాకర్షక కార్యక్రమంలో భాగంగా రుణమాఫీనే ప్రధానంగా ఎంచుకున్నట్లు అర్ధమవుతుంది. దీనితో అన్ని రాజకీయపార్టీలు ఇష్టమున్నా లేకున్నా అదే బాట పడతాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఈ బాటలో పయనించటం చూస్తూనే వున్నాం. ఇది అత్యంత శోచనీయమయిన విషయం.

ఈరుణమాఫీ నిజంగారైతుల పాలిట వరప్రదాయినియేనా? ఇంతకుముందు రుణమాఫీ చేసిన రాష్ట్రాలలో రైతులు దీనితో సుఖంగా వున్నారా? ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో 2014 ఎన్నికల్లో రుణమాఫీ వాగ్ధానంతోనే టీడీపీ , తెరాస అధికారంలోకి వచ్చాయి. కానీ రుణమాఫీ ఒక్కసారిచేసే పరిస్థితి లో రాష్ట్రప్రభుత్వాలు లేకపోవటం వలన రైతులు ఇబ్బందిపడటం చూసాము. దీనితో తిరిగి బ్యాంకులనుంచి ఋణం పొందటం కష్టమయిపోయింది. అలాగే నిజంగా వ్యవసాయంచేసే కౌలురైతులకు ఏవిధంగానూ ఉపయోగపడలేదు. రెండోవైపు ఈ అరకొర సదుపాయాన్ని అందించాటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నానా కష్టాలు పడినసంగతి చూసాము. దీనివలన మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడటం కూడా చూసాము.

అన్నింటికన్నా ముఖ్యమైంది దీని ప్రభావం మన ఆర్ధికవ్యవస్థపై ఏమేరకు పడుతుందనేది? ముందుగా చర్చించుకున్నట్లు పరిమిత వనరులతో దీని వలన పడే ఆర్థికభారం రాష్ట్రాలు భరించలేకపోవటం. అయితే ఎన్నికయిన ప్రభుత్వాలు వాటి ప్రాధామ్యాలను ఎంచుకునే స్వేచ్చవుంది కాబట్టి దానిపై పూర్తిగా తప్పు అనే వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు. అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల, ఆయా రాష్ట్రాల ప్రజల విచక్షణకే వదిలేస్తున్నాను. ప్రభుత్వ వనరులను ఏవిధంగా ఖర్చుపెట్టాలనేది ప్రభుత్వ విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ప్రపంచం మొత్తం మీద అందరూ అంగీకరించే విధానమంటూ ఏమీలేదు. అది పార్టీ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుంది. అంతవరకూ అర్ధం చేసుకోవచ్చు. కానీ వచ్చిన తంటాఅల్లా ఈ రుణమాఫీ ప్రభావం బ్యాంకులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అసలే నిరర్ధక ఆస్తులతో కునారిల్లుతున్న బ్యాంకింగ్ వ్యవస్థకి ఇది కోలుకోలేని దెబ్బ. ఆర్ధిక క్రమశిక్షణకు పెద్ద విఘాతం. వెంటనే కొంతమంది మేధావులు విజయ మాల్ల్య, నీరవ్ మోడీలను రంగంలోకి తీసుకొచ్చి ప్రతివాదనలను తెరమీదకు తీసుకొస్తారు. ఈ వాదనలు ఎంతవరకు సహేతుకమో అందరూ ఆలోచించాల్సిన అవసరం వుంది. విజయ్ మాల్యాకు, నీరవ్ మోడీ లాంటి వాళ్లకు సహాయం చేసిన వాళ్ళను ఎండకట్టటం వరకు ఎటువంటి ఇబ్బందిలేదు. అందులో అందరూ గొంతు కలుపుదాం. కానీ ఆ బూచి చూపించి రుణ మాఫీలను సమర్ధించటం ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? రైతులు ఋణం తీసుకునేదే రద్దుచేయటానికనే భావనను కలిగించటం ఎంతవరకు సబబు? ఇలా అయితే బ్యాంకులు ఏవిధంగా పనిచేయాలి? బ్యాంకులు ఇచ్చే అప్పులు ప్రభుత్వం ఇచ్చే నిధులతో కాదు. మధ్యతరగతి వాళ్ళు దాచుకున్న డిపాజిట్లనుంచి అని మరవద్దు. అంత ప్రేమ ఉంటే నేరుగా ప్రభుత్వమే రైతులకు సహాయం చేయొచ్చుగదా. ఆ పేరుతో రుణవిధానానికి తూట్లుపొడవడటం దారుణం. ఎక్కిన కొమ్మనే నరుక్కోవటం లాంటిదే ఇది. ఈ చర్య బ్యాంకులపై కోలుకోలేని దెబ్బ తగులుతుందని మరచిపోవద్దు.

ఇక కేవలం చర్చకోసం మేధావులు, రాజకీయనాయకులు పోలుస్తున్న పరిశ్రమల కు ఇచ్చే రుణాలను పరిశీలిద్దాం. పంటరుణాలపై రుణమాఫీని ప్రకటించినట్లు గంపగుత్తగా పారిశ్రామికరుణాలను మాఫీ చేయటం జరగదు. ప్రపంచ మార్కెట్ల వలనగాని, ప్రభుత్వ విధానాలవలనగాని, ఆర్ధిక మాంద్యం వలనగాని కొన్ని రాయితీలు మాత్రమే ప్రకటించటం జరుగుతుంది. అయితే వ్యవస్థలో వున్న లోపాలను ఆసరా చేసుకొని ఆశ్రీతపెట్టుబడివిధానంలో రాజకీయనాయకులతో, అధికారులతో కుమ్మక్కయి రుణాలను ఎగవేయటం పరిపాటయింది. వీళ్లపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఇటీవల ప్రవేశపెట్టిన దివాలాకోరు చట్టం కొంతమేరకు ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపింది. దానితోపాటు కావాలని బ్యాంకులను మోసం చేసినవాళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. కాని దీన్ని గంపగుత్తగా చేసే రుణమాఫీతో పోల్చటం కరెక్ట్ కాదు. ప్రతి ఎన్నికల్లో రుణమాఫీ చేస్తారని నమ్మకం వున్న తర్వాత బ్యాంకు రుణాలను ఎవరు కడతారు? ఇది రుణ క్రమశిక్షణను దెబ్బతీసి బ్యాంకుల ఆర్ధికపరిస్థితిని పూర్తిగా దెబ్బతీస్తుందని చెప్పాలి. ముఖ్యంగా జాతీయపార్టీలు ఈవిషయంలో బాధ్యతగా వ్యవహరించకపోతే దేశభవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని మరవద్దు. ఈ విషయంలో అన్ని రాజకీయపార్టీలు పోటీపడుతున్నా రాహుల్ గాంధీ పనిగట్టుకొని ప్రచారం చేయటం బాధ్యతారాహిత్యమనే చెప్పాలి. మరి రైతులకు ఉపశమనమెట్లా అనే ప్రశ్న తలెత్తుంది.

వ్యవసాయరంగం సంక్షోభంలో ఉన్నమాట వాస్తవం. రైతుకు ఖచ్చితంగా ఉపశమన చర్యలు చేపట్టాల్సిందే. ముఖ్యంగా రైతుకి ఆదాయం పెరిగే మార్గాలు అన్వేషించాలి. ఈనెల ఆహార ధరలసూచి చూస్తే అతితక్కువగా నమోదయ్యింది. దానివలన నగరప్రజలు సంతోషంగావున్నాగ్రామీణరంగంలో రాబోయే సంక్షోభానికి చిహ్నంగా చెప్పొచ్చు. పరిస్థితులు ఇలావుంటే 2022 కల్లా రైతు ఆదాయం రెట్టింపు ఎలా అవుతుందో పాలకులు చెప్పాల్సివుంది. ఇటీవల పంటలకు కనీస మద్దతుధర 150 శాతం పెంచినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఈ సమస్యపై విపులంగా ఇంకో వ్యాసంలో చర్చిద్దాము. తాత్కాలిక ఉపశమనం గా రైతు బంధు పధకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయడం కొంత వరకు తక్షణ చర్యగా ఉపయోగపడొచ్చు. అలాగే కౌలు రైతులు, వ్యవసాయకూలీలకు కూడా తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించాల్సి వుంది. సాగునీటి సౌకర్యాలను మెరుగు పరచటం, పంటదిగుబడిని పెంచే చర్యలను చేపట్టటం, దేశవ్యాప్త సమీకృత మార్కెట్టుని విస్తరించటం, పంటలకు గిట్టుబాటు ధరను కలిగించటం, కరువు - వరదలనుంచి ఉపశమనం కలిగించటం, వ్యవసాయేతర ఆదాయాన్ని పెంపొందించటం లాంటి చర్యలను చిత్తశుద్ధితో అమలుచేయాల్సి వుంది. అంతేగాని రుణమాఫీ చేయటం వలన వ్యవసాయరంగం బాగుపడినట్లు ఎక్కడా దాఖలాలు లేవు. ఇది ఎట్లావుందంటే కొండనాలుకకు మందేస్తే వున్ననాలుక ఊడిపోయినట్లుంది. దయచేసి ఇప్పటికయినా ఈ ఓటు రాజకీయాలు మానుకొని నిజమయిన ప్రత్యామ్నాయాలతో ఎన్నికలకు వెళ్తారని ఆశిద్దాం.

- రామ్
Prev ప్రభాస్‌ పిటిషన్‌ ధర్మాసనానికి బదిలీ
Next తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం ఏకగ్రీవ ఎన్నిక
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.