కెటిఆర్ వర్కింగ్ ప్రెసిడెంటు నియామకం వెనుక కెసిఆర్ రాజకీయ చాణక్యం

కెసిఆర్ రాజకీయ పరిశీలకులు ఆలోచించేదానికంటే ఓ పది అడుగులు ముందుంటాడని ఈ చర్యతో మరోసారి నిరూపించాడు. ఇంతటి జెట్ స్పీడ్ తో కెటిఆర్ ని ప్రమోట్ చేస్తాడని ఎవరూ వూహించలేదు. అందరూ మంత్రివర్గంలో ఎవరు వుండబోతున్నారనే దాని మీద దృష్టి పెడితే కెసిఆర్ అందుకు భిన్నంగా కెటిఆర్ ని తన వారసుడిగా ప్రకటించటంపై దృష్టి పెట్టాడు. అదే చాణక్యం. అందుకనే కెసిఆర్ రాజకీయం ముందు అందరూ మరుగుజ్జులేనని చెప్పాలి.

అసలు ఇంత తొందరగా , తను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ పనికి ఎందుకు పూనుకున్నాడు?. తన దృష్టిలో ఇంతకన్నా సరియైన సమయం రాదని. ఒకటి ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయంతో తను ఎవరికీ అందనంతటి ఇమేజ్ ఏర్పరచుకోగలిగాడు. ఇప్పుడైతే తను ఏంచేసినా ఎవరూ నోరు విప్పరు. రెండోది మంత్రివర్గ విస్తరణ ఇంకా జరగలేదు కాబట్టి ఎవరూ లోలోపలకూడా మాట్లాడరు. మూడు హరీష్ రావు కూడా ఈ సమయంలో ఏమీ మాట్లాడలేడు. నాలుగు రాబోయే పంచాయితీ ఎన్నికలలోపు జరగటం వలన వచ్ఛే పంచాయితీ ఎన్నికల ఫలితాలు కెటిఆర్ నాయకత్వాన్ని ఆమోదించినవని చెప్పటానికి వీలుంటుంది. ఎందుకంటే ఇంత మంచి ఫలితాలు వఛ్చిన ఊపులో పంచాయితీలో ఘనవిజయం సాధించటం ఖాయం కాబట్టి ఆ ఫలితంతో ప్రజలు కూడా కెటిఆర్ నాయకత్వాన్ని ఆమోదించినట్లు అవుతుంది. అందుకనే ఈ సమయాన్ని ఎంచుకుని తన రాజకీయ చాణక్యాన్ని మరొక్కసారి చాటి చెప్పాడు.

అందుకు కావాల్సిన భూమికను ముందుగానే తయారుచేసిపెట్టాడు. గత సంవత్సరం నుంచి కెటిఆర్ అటు పార్టీలో, ప్రభుత్వంలో నెంబరు టూ గా వ్యవహరిస్తూవస్తున్నాడు. అంటే డ్రెస్ రిహార్సల్స్ ఒకటి అయిపోయినట్లే. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు డ్రెస్ రిహార్సల్స్ రెండు అని చెప్పొచ్చు. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల తర్వాత ఏకంగా అధికార మార్పిడి జరగొచ్చు. దానికి భూమికగా తనింకా జాతీయ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించాలని నిర్ణయించుకోవటం. అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు. నిజానికి కెటిఆర్ ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో అందరినీ కలుపుకెళ్ళగలుగుతున్నాడని చెప్పొచ్చు . ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణాయాత్మక పాత్ర పోషించాడు. టికెట్లు రాని అసమ్మతి నాయకులను బుజ్జగించటం , హైదరాబాదు నగర ప్రచారం మొత్తం తన భుజస్కందాల మీద వేసుకొని నడిపించటం, హైదరాబాదులోని సీమాంధ్రుల మనసు గెలవటం , హైదరాబాదు నగరాభివృద్ధిలో తనదైన ముద్ర వేయటంలాంటి పనులతో నాయకుడిగా ఇప్పటికే నిరూపించుకున్నాడని చెప్పాలి.

ఇక మిగిలిందల్లా పగ్గాలు చేతబూనడమే . అందుకు ముందస్తు సన్నాహమే ఈ వర్కింగ్ ప్రెసిడెంటు నియామకం. ఈ చర్య తో కెసిఆర్ తన చాణక్యనీతిని అమోఘంగా ప్రదర్శించాడని చెప్పొచ్చు.

-- రామ్

Prev కలుషిత ప్రసాదం కేసులో... ఇద్దరు అరెస్ట్
Next రవిప్రకాశ్ కోసం మూడు రాష్ర్టాల్లో గాలింపు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.