శబరిమల సమస్య సీపీఎంకి ఆత్మహత్యాసదృశమవుతుందా!

శబరిమల రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. ఇది భక్తికి , హేతువాదనకు మధ్య జరుగుతున్న పోరాటంగా చూడాల్సి వుంది. కొంతమంది దీన్ని సామాజిక సమస్యగా, లింగవివక్షతగా అభివర్ణిస్తున్నారు. సమస్య సున్నితంగా మారింది. శబరిమలలో మహిళల ప్రవేశంపై కొంతమంది సుప్రీం కోర్టుకు వెళ్ళటం, కోర్టు మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేయటం మనందరికీ తెలిసిందే. సహజంగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినతర్వాత ఎవరయినా దాన్ని అమలుచేయాల్సిందే. అందుకనే తీర్పు వచ్చినవెంటనే అన్ని రాజకీయపక్షాలు హర్షం వ్యక్తం చేయటం జరిగింది. అందరూ సమస్య పరిష్కారమయ్యిందని భావించారు. కానీ అసలు కథ తర్వాత మొదలయ్యింది.

శబరిమల ఆలయం దేశంలో అత్యంత భక్తితో, నిష్ఠతో భక్తులు దర్శిస్తారు. ఒక్క కేరళలోనే కాకుండా అన్ని ప్రాంతాలవారు నియమంతో దర్శించే ఏకైక ఆలయమని చెప్పొచ్చు. ఈ ఆలయంలో కొన్ని శతాబ్దాలనుంచి పదినుంచి యాభై సంవత్సరాల వయసువున్న మహిళలకు ప్రవేశం నిషిద్ధం. ఇటీవల ఈ సమస్యపై కొంతమంది మహిళలు, మహిళాసంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీనికి క్లైమాక్స్ గానే సుప్రీం కోర్టు తీర్పుని చూడాల్సి వుంది. తీర్పు వచ్చినతర్వాత మొత్తం సమాజం రెండుగా విడిపోయింది. కేరళ ఆచారాలను, సాంప్రదాయాలను మిగతా ప్రపంచం అర్ధం చేసుకోపోవటం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. చివరకు హిందుత్వ పార్టీ అయిన బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా తొలుత సుప్రీం కోర్టు తీర్పుని ఆహ్వానించింది. కానీ దీనిపై కేరళ హిందూ భక్త సమాజం ఒక్కటై నిరసన తెలపటం మొదలుపెట్టింది. కేరళలోని బీజేపీ, కాంగ్రెస్ కూడా అందులో భాగమయ్యాయి. మిగతా ప్రపంచం తేరుకొని తిరిగి పునరాలోచించటం మొదలుపెట్టింది.

ఒకవైపు లింగసమానత్వం రెండోవైపు ఆలయవిశ్వాసం. హేతుబద్దంగా ఆలోచిస్తే మహిళల ఆలయ ప్రవేశాన్ని సమర్ధించాల్సిందే. కానీ మతవిశ్వాసం హేతుబద్దంగా ఆలోచించే విషయం కాదని ఈ ఘటన రుజువు చేస్తుంది. కొంతమంది దీన్ని ఇంతకుముందే కేరళ చరిత్రలో జరిగిన రెండు సాంఘిక ఉద్యమాలతో పోలుస్తున్నారు. మొదటిది 1859 లో చన్నారు తిరుగుబాటు. నాడారు స్త్రీలు జాకెట్ ధరించి వక్షోజాలను కప్పిఉంచటం అప్పట్లో నిషిద్ధం. దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి తలొగ్గి మహారాజు నిషేధాన్ని ఎత్తివేయటం జరిగింది. . రెండవది 19 వ శతాబ్దం చివరలో జరిగిన ఎజవా కులస్తుల ఆలయ ప్రవేశ పోరాటం. ఈ రెండిటి విషయంలోనూ కేరళ సమాజం వివక్షతను నిర్ములించింది. ఇప్పుడు జరిగే మహిళల ఆలయ ప్రవేశం పోరాటం మూడో సాంఘిక ఉద్యమంగా అభివర్ణిస్తున్నారు. ఈ విషయంలో వామపక్షాలు ముందున్నాయి. అయితే ఈ పోరాటం సమాజంలోని అభ్యుదయ వాదులందరిని ఒకతాటిమీదకు తీసుకురాలేకపోయింది. ఇది అభ్యుదయ వాదులకు తిరోగమనవాదులకు మధ్య పోరాటంకన్నా భక్తులకు హేతువాదులకు మధ్య పోరాటంగా మారిందని చెప్పొచ్చు. అలాగే కేరళ సమాజంలోని హిందువులలో పెద్దవాళ్ళు సంప్రదాయంవైపు నిలబడితే నూతన తరం హేతువాదం వైపు నిలబడినట్లు కనిపిస్తుంది.

మరికొంతమంది దీన్ని ముమ్మూరు తలాక్ కి శబరిమల మహిళల ఆలయప్రవేశానికి పోల్చి చూడటం జరుగుతుంది. ఇది కూడా సరియిన పోలిక కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇస్లాం సంప్రదాయాన్ని పాటించే ఏ ఇస్లాం దేశమూ ముమ్మూరు తలాక్ ని పాటించటంలేదు. అంటే అది ఇస్లాం సంప్రదాయం కాదనే కదా. మన దేశం లోని ముల్లాలు, మౌల్విలు దీన్ని వదులుకోవటానికి ఇష్టపడటంలేదు. ఈ మూడాచారం వలన ఎంతోమంది మహిళలు రోడ్డున పడ్డ సంగతి చూసాము. కానీ శబరిమల సాంప్రదాయం ఆలయ విశ్వాసానికి సంబందించిందనేది గమనించాలి. ఇంతవరకు ఎన్నో హిందూ సంస్కరణలు చూసాం కానీ ఇంత వ్యతిరేకతని చూడలేదు. అందుకే దీన్ని భక్తుల విశ్వాసానికి హేతువాదానికి మధ్య జరుగుతున్న పోరాటంగా చూస్తున్నాము.

ఇదంతా ఒక ఎత్తయితే నిన్న జరిగింది మరోమెట్టు పైకి ఎక్కింది. సుప్రీం కోర్టు తీర్పు ఆధారం చేసుకొని కేరళ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసిందనే చెప్పాలి. రహస్యంగా ఓ పధకం ప్రకారం ఇద్దరు మహిళలను ఆలయానికి తరలించిన విధానం అందర్నీ ఆశ్చర్య పరిచింది. అంత రహస్యంగా పట్టుదలగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. ఒకవైపు కేరళ ప్రభుత్వాన్ని నడిపే సిపిఎం మతవిశ్వాసంలేని పార్టీ అనేది అందరికి తెలిసిన విషయమే. అంతవరకూ ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి విశ్వాసాలు, అభిప్రాయాలూ వారివి. కానీ సమస్య అల్లా శబరిమల ఆలయ ప్రవేశం మతవిశ్వాసాలకు, సంప్రదాయాలకు సంబందించినదయినప్పుడు మతవిశ్వాసం లేని నాయకత్వం చాలా జాగ్రత్తగా, సున్నితంగా సమస్యను హేండిల్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని పట్టుదలకు పోయి ఎలాగయినా మహిళలను లోపలికి పంపించాలని ప్రయత్నం చేయటం ఏమాత్రం సమర్ధనీయం కాదు. అదీ సంప్రదాయాలు పాటించకుండా అంటే ఆలయానికి వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే పద్దతిలో తీసుకెళ్లటం ఉదారవాదులు కూడా హర్షించటం లేదు. సిపిఎం అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి తన గోతిని తానే తవ్వుకుందేమో ననిపిస్తుంది.

ఈవిషయంలో సిపిఎం సున్నితంగా వ్యవహరించక పోవటంవలన వున్న ఒక్క రాష్ట్రం లోనూ తన ఉనికిని కోల్పోయే ప్రమాదముంది. తక్షణం ఈ సమస్యనుంచి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి లబ్ది పొందే అవకాశాలు మెండుగా వున్నాయ్. బీజేపీ సీట్లు గెలవక పోయినా తన ఉనికిని పెంచుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఇదంతా సిపిఎం స్వయం కృతాపరాధమనే చెప్పాలి.

Prev తెలంగాణలో రెండు కొత్త జిల్లాలు, నోటిఫికేషన్ జారీ
Next రవిప్రకాశ్ కోసం మూడు రాష్ర్టాల్లో గాలింపు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.