ఓటు ఆయుధంతో జనసత్తా చాటండి

ఏప్రియల్,మే లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరుగుతున్నాయి. విశేషమేమంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జమిలి ఎన్నికలకు సానుకూలంగా స్పందించిన తెరాస అందుకు విరుద్ధంగా ముందస్తు ఎన్నికలకు సిఫారసు చెయ్యడం ఆశ్చర్యం. వాస్తవానికి లోక్ సభతో పాటు అన్ని అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్ జరిగితే అభివృద్ధికి ఆటంకం వుండదని, ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పిన మోడీ ప్రతిపాదనలకు ముందుగా తలూపింది కెసిఆర్. రాజకీయాలంటే ఇదేనేమో.

ముందస్తు ఎన్నికలకు తెరలేపి అందరిని ఆశ్చర్యంలో ముంచటంతో పాటు అసెంబ్లీని రద్దు చేసేరోజుకి అత్యంత ధీమాగా వున్నాడు కేసీఆర్. అంతే ఆశ్చర్యంగా 105మంది పాత సభ్యులనే ఒకేసారి తిరిగి అభ్యర్థులుగా ప్రకటించడం కూడా తెలిసిందే. ఈ రెండిటిలోనే కాదు గత నాల్గున్నర సంవత్సరాల ప్రభుత్వ పని విధానంలోను తనదైన ముద్రనే రుచిచూపించాడు. అందులో మంచీ వున్నాయి, చెడూ వున్నాయి. మొత్తంగా చూస్తే తను ఏమి అనుకుంటే అదే చట్టం, అదే అమలుగా వుంది. ఇది అన్ని సార్లూ రక్తికట్టించక పోవచ్చు. ఉద్యమంలో కొంతమేరకు అది వుపయోగపడితే ప్రభుత్వానికి వచ్చిన తర్వాత అది మిశ్రమ ఫలితాలనే ఇచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు వాటన్నిటినీ పరిశీలించే సమయంలేదు కాబట్టి చివరి రెండు చర్యలని పరిశీలిద్దాం. ముందస్తు ఎన్నికల విషయంలో గానీ, 105మంది పాత అభ్యర్దులను తిరిగి ప్రకటించటంపై గానీ పార్టీలో చర్చించింది లేదు. ఇతరుల్ని తనతో సమాన స్థాయిలో చూసినప్పుడే చర్చలు సాధ్యమవుతాయి లేకపోతే చర్చలకు ఆస్కారంలేదు. కెసిఆర్ మిగతా సహచరులకు అందనంత ఎత్తులో వుండటంతో ఆ ప్రశ్నే ఉదయించదు. ఈ నాల్గున్నర సంవత్సరాల్లో అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కూడా కెసిఆర్ దే. నిరంతర విద్యుత్, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు, రైతు బంధు పదకం లాంటి వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టాడు. అలాగే సంక్షేమ పదకాల్లో కూడా దేశంలోనే అగ్రస్థానంలో వుంది తెలంగాణా ప్రభుత్వం.

అదే సమయంలో కొన్ని అప్రజాస్వామిక, నిరంకుశ చర్యలతో చెడును కూడా మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా రైతులకు బేడీలు వేయించడం, ఇసుక లారీలతో దళితులను తొక్కించడం, తెలంగాణా ఉద్యమానికే గుండెకాయ లాంటి ఇందిరా పార్క్ నిరసన ప్రదర్శనల స్థలాన్ని మూసివేయించడం తెలంగాణా ఉద్యమానికి మాయని మచ్చగా చరిత్ర కెక్కింది. చివరకు నాల్గున్నర సంవత్సరాలూ సెక్రటేరియట్ మొఖం చూడక పోవటం ఓ వింత రికార్డు.

అంతటితో ఆగకుండా తన అహంకారధోరణితో తెలంగాణ ఉద్యమ సారధులను అవమానించడం కూడా జరిగింది. తనని వ్యతిరేకించిన వాళ్లపై కక్ష సాధించే మనస్తత్వం తెలంగాణా ఫ్యూడల్ దొరతనంకు చిహ్నం. కోదండరాం ఇంటిపై అర్ధరాత్రి దాడి చేసి నిర్బంధించడం, మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి ఇంటిపై అర్ధరాత్రి దాడి చేసి భయభ్రాంతులు సృష్టించడం ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక ప్రభావాన్ని తీసుకొచ్చాయి.

వాస్తవానికి ఉద్యమంలో చెప్పినదానికి భిన్నంగా కుటుంబసభ్యుల్ని కీలక మంత్రులుగా నియమించినా మొదట్లో సహజంగా రావలసినంత వ్యతిరేకత రాలేదు.ఉద్యమంలో తను నిర్వహించిన పాత్ర , న్యాయకత్వ లక్షణాలు, ప్రజల్లో తనకున్న ఇమేజ్ వలన ఈ సమస్యను పెద్దగా ప్రజలు పట్టించుకోలేదు. అదేసమయంలో కేటీఆర్, హరీష్ రావు పరిపాలనలో , న్యాయకత్వ లక్షణాల్లో తమదైన ముద్ర వేయటంతో ప్రజలు కొంతమేరకు కుటుంబాన్ని ఆమోదించారనేచెప్పాలి. అదేసమయంలో ప్రజలకు వినూత్న పథకాలతో దగ్గరవటానికి ప్రయత్నించాడు.

అందువలనే ధీమాతో ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చాడు. ఆ పిలుపునిచ్చేనాటికి అన్నీ సానుకూలంగానే ఉన్నాయి. సర్వేలు కూడా తనకు అడ్డులేదనే చెప్పాయి. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకలాగా ఉండవని మర్చిపోవద్దు. తన అహంకారం , కక్ష సాధింపు మనస్తత్వం తనకు ఎక్కువ మంది శత్రువుల్ని తయారుచేసింది. తన ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా అందరూ ఒకటయ్యారు. విడిగా పోటీచేస్తే అందరూ పుట్ట మునుగుతారనే భయంతో కావచ్చు, తనపై గూడు కట్టుకున్న వ్యతిరేకత కావచ్చు చివరకు పెద్దగా ఇబ్బందుల్లేకుండా సీట్ల ఒప్పందం కుదుర్చుకోగలిగారు. అలాగే తెలంగాణ ఉద్యమంతో ముడిపడివున్న గద్దర్ , మందకృష్ణ మాదిగ, చెరుకు సుధాకర్ లాంటివాళ్లు కూడా జతగలిపారు. పోలింగ్ తేదీ దగ్గరపడేటప్పటికీ పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. కేసీఆర్ పై వ్యతిరేకత పెరిగింది. చివరకు పోటీ తీవ్రంగా తయారైంది. కేసీఆర్ మొట్టమొదట సారి ఆత్మరక్షణలో పడ్డట్టు కనిపిస్తుంది.

ఆలాగే కాంగ్రెసు తన శక్తియుక్తులన్నీ ఒడ్డి ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లగలిగింది.ప్రచారసారధులుగా కొత్తవాళ్లను రంగంలోకి దించగలిగింది.అయితే కాంగ్రెసు కూడా ప్రచారంలో కొన్ని తప్పులు చేసినట్లు కనిపిస్తుంది.పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని మొదట్లో రెండురోజులు మాత్రమే ప్రచారానికి పిలిచారు. కానీ తరవాత దాదాపు పదిరోజులు పూర్తిగా ప్రచారంలో దించడం వ్యూహాత్మక తప్పిదమేననిపిస్తుంది.ముఖ్యంగా నగరంలోని ఆంధ్రామూలాలున్న ప్రజలందరూ చంద్రబాబునాయుడిని, తెలుగుదేశాన్ని తమ ప్రతినిధులుగా చూడటం గత చరిత్ర. ప్రస్తుతం ఆంధ్రాలో వేడి వేడిగా ఉన్న రాజకీయసమీకరణాలు వీళ్ళ మీద ప్రభావితం చేస్తాయనటంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో పరిమితంగా చంద్రబాబునాయుడి సేవలు వుపయోగించుకొనిఉంటే బాగుండేదనేది విశ్లేషకుల భావన. కేసీఆర్ రాజేస్తున్న ఆంధ్రా-తెలంగాణ భేదభావాలు, ఆంధ్రాలో జరుగుతున్న అంతర్గతపరిణామాల దృష్ట్యా కాంగ్రెసు వ్యూహం ఎంతవరకు సఫలీకృతమవుతుందో చూడాలి.

ఆలాగే ఆంధ్రా రాజకీయాల్లో కీలకంగా వున్న వైఎస్సార్సీపి , జనసేన పాత్రనుకూడా పరిగణలోనికి తీసుకోవలసి వుంది. మనకందిన సమాచారంమేరకు వైఎస్సార్సీపి ప్రజాఫ్రంట్ కి వ్యతిరేకంగానే చాపకింద నీరులాగా పనిచేస్తుందని తెలుస్తుంది. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ 5వ తేదీ వీడియో సందేశం హుందాగా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.

వీటన్నింటికీ ముక్తాయింపు లగడపాటి రాజగోపాల్ సర్వేఫలితాన్ని ముందస్తుగా ప్రకటించడం. ఇది కొంతమేరకు ప్రజాఫ్రంట్ కు నైతిక బలాన్ని, తటస్థ ఓటర్లపై ప్రభావాన్ని కలగజేస్తుందనటంలో సందేహంలేదు.

వీటన్నిటి నేపథ్యంలో పోలింగ్ జరుగుతుంది. ఎవరెన్ని వేషాలేసిన, అధికార,ప్రతిపక్షస్థానాన్ని నిర్ణయించేది ప్రజలే. అందరికళ్ళు ప్రజల తీర్పుపై వుంది. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణా సమాజ పునర్నిర్మాణంకోసం మంచివ్యక్తులను , సేవాపరులను ఎన్నుకుంటారని ఆశిద్దాం.

- రామ్

Prev వికారాబాద్‌ ఎస్పీ అన్నపూర్ణ పై బదిలీ వేటు
Next బీజేపీపై నిప్పులు చెరిగిన కేసీఆర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.