స్నానం చేస్తుండగా వీడియో తీసి.. తన స్నేహితుల కోరిక తీర్చాలని బలవంతం

స్నానం చేస్తుండగా వీడియో తీసి.. తన స్నేహితుల కోరిక తీర్చాలని బలవంతం

చంద్రగిరి: స్నానం చేస్తుండగా ఓ బాలిక (14)ను బాలుడు (16) వీడియోలు తీసి, లైంగిక దాడులకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలంటూ ఆ బాలుడు వేధించడంతో బాధిత బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరో బాలుడు పరారయ్యాడు. గ్రామస్తుల కథనం మేరకు.. చంద్రగిరి మండలం, పనపాకం హరిజనవాడకు చెందిన ఓ బాలిక చంద్రగిరి సంక్షేమ హాస్టల్‌లో చదువుకుంటోంది. చిన్నతనంలోనే తల్లి మృతిచెందడం, తండ్రి వికలాంగుడు కావడంతో బాలికను నానమ్మ పోషిస్తోంది.

వేసవి సెలవులు కావడంతో నెల రోజుల నుంచి బాలిక ఇంటివద్దే ఉంది. బాలిక తన ఇంటి వద్ద స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. ఆపై బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం వీడియోను తన స్నేహితులైన మరో ముగ్గురు మైనర్లు, జగపతి (23)లకు షేర్‌ చేసి వారి కోరిక కూడా తీర్చాలని, లేకుంటే వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించారు. యువకుల బెదిరింపులు తారస్థాయికి చేరడంతో బాలిక నాలుగు రోజుల క్రితం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన బాలిక నానమ్మ వారించి విషయం తెలుసుకుని స్థానికులకు వివరించింది.

దీంతో సోమవారం గ్రామస్తులు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు వీడియో తీసిన బాలుడుతో పాటు అతని ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. మరో మైనర్‌ పరారయ్యాడు. దళిత బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఆమెను బెదిరించిన యువకులపై నిర్భయ కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా, పనపాకం హరిజనవాడకు చెందిన ఆ యువకులు టీడీపీ కార్యకర్తలు కావడంతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కేసు నీరు గార్చేందుకు యత్నిస్తున్నారని తెలిసింది. దీనిపై సీఐ మాట్లాడుతూ.. బాలికపై లైంగిక దాడి విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

more updates »