సుమలత రాజకీయాల్లోకి వస్తారా?

Article

మండ్య: తమ రాజకీయ ప్రవేశం మండ్య నుంచే కాంగ్రెస్‌ పార్టీ నుంచి జరుగుతుందని సుమలత అంబరీశ్‌ స్పష్టం చేశారు. సమయం వస్తే మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్‌ తరపున అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ఆమె తెలిపారు. ఆదివారం కుమారుడు అభిషేక్‌తో కలసి నాగమంగళ తాలూకా ఆదిచుంచనగిరిలోని శ్రీక్షేత్రాన్ని సందర్శించుకొని కాలభైరేశ్వర స్వామి కి పూజలు నిర్వహించిన అనంతరం సుమలత మీడియాతో మాట్లాడారు. అంబరీశ్‌ దూరమైన విషాదం నుంచి తాము ఇంకా పూర్తిగా కోలుకోకముందే తమ గురించి రాజకీయ చర్చలు జరుగుతాయని ఊహించలేదన్నారు. అయితే మండ్య జిల్లా ప్రజలు, అభిమానుల ఒత్తిడి మేరకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని, దీనిపై సన్నిహితులు, రాజకీయ సలహాదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాము ఎప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించినా మండ్య నుంచేనని ఆమె స్పష్టం చేశారు.

తల్లి నిర్ణయానికి అభిషేక్‌ మద్దతు
తాను నటించిన కొత్త చిత్రం అమర్‌ టీజర్‌ను ఈ నెల 14న విడుదల కానున్నట్లు సుమలత అంబరీశ్‌ కుమారుడు అభిషేక్‌ తెలిపారు. మొదటి చిత్రం అమర్‌తో పాటు మున్ముందు నటించే ప్రతీ చిత్రంలో కూడా తమ తండ్రి అంబరీశ్‌ తప్పకుండా ఉంటారన్నారు. రాజకీయాల్లో ప్రవేశించాలని తల్లి సుమలత తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామని రాజకీయాల్లో మాత్రమే కాకుండా తమ చిత్రాల విషయంలో కూడా తల్లి సుమలత నిర్ణయాలు,ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని చెప్పారు.

Prev ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
Next శ్రీలంక బాంబు పేలుళ్లలో ఐదుగురు భారతీయులు మృతి
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.