కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

Article

50 శాతం వీవీప్యాట్లను లెక్కించేందుకు అనుమతించాలంటూ 21 రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టుకు సాయం చేసేందుకు ఓ అధికారిని నియమించాలంటూ ఈసీకి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ప్రతిపక్షాలకు చెందిన పలు పార్టీలు ఈ పిటిషన్ దాఖలు చేశాయి. సుప్రీంకోర్టును ఆశ్రయించిన పార్టీల్లో కాంగ్రెస్, టీడీపీ, ఎన్సీపీ, ఆప్, వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఉన్నాయి. 2017లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. అయితే ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్ కారణంగానే ఇలా జరిగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. మళ్లీ పేపర్ బ్యాలెట్ ‌ద్వారా ఓటింగ్ నిర్వహించాలని బీఎస్పీ చీఫ్ మాయావతి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల విషయంలో మరింత భద్రతా ప్రమాణాలు పాటించాలని, ఈవీఎంలలో ఓట్లను సరిచూసేందుకు 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Prev పేటీఎం మొబైల్ బ్యాంకింగ్ యాప్ విడుదల
Next ఎగ్జిట్ పోల్స్‌తో మారిన జగన్ షెడ్యూల్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.