టీసీఎస్‌ టెకీ లావణ్య మర్డర్ మిస్టరీ.. ప్రియుడే హంతకుడు

Article

రామచంద్రాపురం : హైదరాబాద్‌లో సంచలనం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లావణ్య హత్య కేసు మిస్టరీ వీడింది. లావణ్య హత్య కేసులో ప్రియుడు సునీల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడ్ని ప్రశ్నించడంతో మొత్తం గుట్టు విప్పాడు. ఆమెను తానే దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కేశాడు. ఆ సూట్‌కేసును తీసుకెళ్లి సూరారం కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నాడట. . విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఇంటర్వ్యూ పేరుతో సదరు యువతిని విమానాశ్రయానికి తీసుకెళ్లి, అక్కడే హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని భారతీనగర్‌లో నివాసం ఉంటూ భెల్‌ పరిశ్రమలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రావుకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లావణ్య(25) నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో 2015లో బీటెక్‌(మెకానిక్‌) పూర్తిచేసి టీసీఎస్‌లో పనిచేస్తుంది. ఇంజినీరింగ్‌లో సహధ్యాయి, మోల్టెక్‌ కంపెనీలో పనిచేస్తున్న సునీల్‌ కొన్నాళ్లుగా లావణ్యను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. ఈ విషయమై ఆయన తరచూ యువతి ఇంటికి వచ్చిపోతుండేవాడు. మస్కట్‌లో ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉందని, లావణ్యను పంపాలని సునీల్‌ ఆమె తల్లిదండ్రులకు చెప్పగా వారు అంగీకరించారు. ఈ నెల 4న మస్కట్‌కు వెళ్తున్నామని సునీల్‌ లావణ్యతో చెప్పి శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆరోగ్యం సరిగా లేదని చెప్పి బాత్‌రూంకు వెళ్లి వారు ఎక్కాల్సిన విమానం వెళ్లాక తీరిగ్గా వచ్చి... ‘అయ్యో విమానం వెళ్లిపోయిందా!’ అంటూ లావణ్యతో నమ్మబలికి తదుపరి విమానంలో వెళ్దామని ఆ రాత్రికి అక్కడే లాడ్జిలో బసచేశారు. తెల్లవారి ఏప్రిల్‌ 5న వీరిద్దరు పెళ్లి విషయంలో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో సునీల్‌ లావణ్య గొంతు నులమడంతో ఆమె మృతిచెందింది. వీరివెంట తెచ్చుకున్న సూట్‌కేసులోని దుస్తులు తీసి అందులో మృతదేహాన్ని కుక్కి పెట్టాడు. అదేరోజు రాత్రి లాడ్జి నుంచి కిరాయి కారులో మృతదేహంతో ఉన్న సూట్‌కేసును తీసుకెళ్లి సూరారం కాలనీలో ఓ మురుగు కాలువలో పడేశాడు. కుమార్తె ఆరు రోజులైనా తిరిగి రాకపోవడంతో అనుమానంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తమదైన శైలిలో సునీల్‌ను విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సునీల్‌ను అరెస్టు చేయడంతోపాటు సూట్‌కేసును, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Prev ఆంధ్రప్రదేశ్ లో కుల పిచ్చి పరాకాష్టకు చేరుకుంది!: జేసీ దివాకర్ రెడ్డి
Next మద్యం మత్తులో అధికారులు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.