టీడీపీ వల్లే ప్రత్యేక హోదా రాలేదు.. అసెంబ్లీలో జగన్ ప్రకటన

టీడీపీ వల్లే ప్రత్యేక హోదా రాలేదు.. అసెంబ్లీలో జగన్ ప్రకటన

అమరావతి : తమకు ప్యాకేజీ వద్దని, రాష్ట్రాన్ని సంజీవని అయిన ప్రత్యేక హోదానే కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. చివరిరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ప్రత్యేక హోదా కోరుతూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ ఇదే అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసిందని, అయితే ఆ ప్యాకేజీ తమకు వద్దని హోదా కావాలనే ఉద్దేశంతోనే ఈ తీర్మానం ప్రవేశం పెడుతున్నట్లు వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఏపీకి జీవనాడి అయిన ప్రత్యేకహోదాను జాప్యం లేకుండా ఇవ్వాల్సిందిగా 5 కోట్ల ప్రజల తరఫున ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

‘ఉమ్మడి రాష్ట్రంలో మెజార్టీ ప్రజల అభిప్రాయానికి విరుద్దంగా రాష్ట్రాన్ని విడగొట్టారు. విభజనతో మనకు అన్నివిధాలుగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఆనాటి కేంద్రప్రభుత్వం మొండిగా ముందుకు నడిచింది. గతంలో ఈ అసెంబ్లీలోనే ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ.. గత ప్రభుత్వం తీర్మానం చేసింది. దీంతో ఆ ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలని తీర్మానం ప్రవేశపెడుతున్నాం. విభజన ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 59 శాతం మంది జనాభాను, అప్పులను వారసత్వంగా పొందాం. కానీ ఆదాయాన్ని 47 శాతం మాత్రమే పొందాం. ఆధాయాన్ని, ఉద్యోగాలను ఇచ్చే రాజధాన్ని కోల్పోయాం. విభజన నాటికి రూ.97 వేల కోట్లున్న రుణం ఐదేళ్లలో రూ.2,58,928 కోట్లకు ఎగబాకింది. 2013-14 ఏడాది ఏపీ నుంచి రూ.57 వేల కోట్లు సాప్ట్‌వేర్‌ ఎగుమతులు ఉండగా.. ఒక్క హైదరాబాద్‌ నుంచే రూ.56 వేల 500 కోట్లు ఎగుమతులు జరిగాయి. విభజన సమయంలో అధికార, పత్రిపక్ష పార్టీలు పార్లమెంట్‌లో చేసిన వాగ్ధానాలు నెరవేర్చలేదు. విభజన హామీలు నెరవేర్చకపోవడం వల్లే.. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సామాజిక, దుస్థితికి దారి తీసింది.

అందుకే ప్రత్యేక హోదా రాలేదు.. !
"విభజనతో ఏపీకి చాలా అన్యాయం జరిగింది. విభజన నష్టాలను హోదాతోనే పూడ్చగలం. గత ఐదేళ్లలో రెవెన్యూ లోటు రూ. 66,300 కోట్లకు పెరిగింది. ఉపాధి కల్పన సామర్థ్యం బాగా తగ్గిపోయింది. ఉద్యోగాల కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు పెట్టుబడికి ముందుకు వస్తాయి. ఐటీ, జీఎస్టీ మినహాయింపులు వస్తాయి. హోటళ్లు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులంటూ హోదా ఇవ్వడం లేదు. టీడీపీ ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్‌తో మాట్లాడకపోవడం వల్లే హోదా రాలేదు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి హోదాతో భర్తీ చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రం కాబట్టి న్యాయం చేయాలి. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి జీవనాడి.. 5 కోట్ల మంది తరఫున తీర్మానం ఇస్తున్నాను. గత చట్టసభలో ప్యాకేజీకి ఒప్పుకుని డ్రామాలు చేశారు" అని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా ప్రత్యేక హోదా అవసరాన్ని నిశితంగా వివరించారు.

ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనేది అవాస్తవం..
14వ ఆర్థిక సంఘం సిఫారసులు మేరకే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనేది అవాస్తవం. నిజం ఏమిటన్నది అందరి ముందు ఉంచుతున్నాను. 14వ ఆర్థిక సంఘం గౌరవ సభ్యులు ప్రొఫెసర్‌ అభిజిత్‌ సింగ్‌ లేఖను మీ ముందు ఉంచుతున్నాను. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక కేటగిరి హోదా రద్దుకు సిఫారసు చేయలేదని, ఫ్రొఫెసర్‌ అభిజిత్‌ సింగ్‌ స్పష్టంగా వివరించారు. పరిశీలించడానికి సభ సమక్షంలో నేను ప్రవేశపెడుతున్నాను. 2014 మార్చి 20న ప్రత్యేక హోదా మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేసిందని గుర్తు చేస్తున్నాను. కేంద్ర కేబినెట్‌ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని కూడా ఆ మంత్రి మండలి ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే హోదా అమలు కాలేదు.

more updates »