తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆలోచనలకు ప్రతిబింబం

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆలోచనలకు ప్రతిబింబం
  • ప్రజల బలీయమైన శక్తి ముందు అవకాశవాద కూటమి రాజకీయాలు బలాదూర్

  • ఆంధ్రా రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నికల ఫలితాలు

తెలంగాణా ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారు. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితాలు రానే వచ్చాయి. ఎందరో తలరాతలను మార్చాయి. తెలంగాణా రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించాయి. హేమాహేమీల తలలు తెగిపడ్డాయి. వాళ్ళ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్మాయి. రాబోయే రోజుల్లో తెలంగాణా రాజకీయం కొత్త దారుల్లో పయనించే అవకాశాలు మెండుగా వున్నాయి. అవేంటో ఒక్కసారి పరిశీలిద్దాం

చరిత్ర సృష్టించిన కెసిఆర్

ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వఛ్చిన ఓట్ల శాతం అందరినీ అబ్బురపరిచింది. దాదాపుగా 47శాతం ఓట్లతో రికార్డు సృష్టించింది. 2014లో సాధించిన దానికి భిన్నంగా పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. ఈసారి ఉత్తర తెలంగాణాతో పాటు దక్షిణ తెలంగాణాను కూడా కైవసం చేసుకుంది (ఒక్క ఖమ్మం జిల్లా మాత్రమే ఇందుకు మినహాయింపు). దీనికి ప్రధానకారణం దాని నాలుగున్నర సంవత్సరాల పరిపాలనే. అన్నింటికన్నా ముందుగా చెప్పుకోవలిసింది నిరంతర విద్యుత్తు సరఫరా.ఆ తర్వత ఇంకా పూర్తి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు. దానిపై రైతాంగంలో సానుకూల ఆశలను ముందుంచటంలో కెసిఆర్ విజయవంతమయ్యాడు. అలాగే తను ప్రవేశపెట్టిన వినూత్న సంక్షేమ పథకాలు తనన్ని ప్రజలకు దగ్గర చేయటమేకాకుండా పటిష్టమైన ఓటు బ్యాంకును కూడా తయారు చేసిపెట్టింది. చివరి సంవత్సరంలో తీసుకొచ్చిన రైతు బంధు పథకం తన ఓటు బ్యాంకును పదిలం చేసింది.

ఈ సానుకూల వాతావరణాన్ని ఎదుర్కోవటానికి కాంగ్రెసు వేసిన ఎత్తుగడ మహాకూటమి అదే తర్వాత ప్రజాకూటమి. టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా బిజెపి మినహా అన్ని పార్టీలను ఒకటి చేసి కూటమి కట్టింది. పరస్పర విరుద్ద శక్తులను, పార్టీలను ఒకత్రాటి మీదకు తెచ్చింది. తెలంగాణా విభజనకు అడ్డుపడిన తెలుగుదేశాన్ని, తెలంగాణా ఉద్యమాన్ని నడిపిన కోదండరాంని ఈ కూటమిలో భాగస్వామిని చేసింది. అలానే తెలంగాణా ఉద్యమ రధసారధుల్లో ఒకరు తెలంగాణా సామాజిక గొంతుక అయిన గద్దర్ ని కూడా అక్కున చేర్చుకున్నారు. తెలంగాణా దళితుల్లో అధిక శాతమున్న మాదిగ సామాజిక వర్గ ప్రతినిథి మందకృష్ణ మాదిగను తమ కుటమిలోకి ఆహ్వానించారు. ఇంతటి విశాల కూటమిని ఏర్పరిచినా ప్రజలు మద్దతును కూడగట్టలేకపోయారు. అందుకు కారణాలనేకం.ముందుగా చెప్పాలంటే ప్రజల బలీయమైన శక్తి ముందు కూటమి రాజకీయాలు బలాదూర్ అనే చెప్పాలి. తెచ్చుకున్న తెలంగాణాను కాపాడుకోవాలంటే కెసిఆర్ వుండాలని ప్రజలు బలంగా కోరుకున్నారు. రెండోది కూటమిలో సీట్ల పంపకం చివరిదాకా తేలకపోవటం. తేలినా దానిలో తెలంగాణా ఉద్యమకారులతో ఏర్పడిన తెలంగాణా జనసమితికి సముచితస్థానం కల్పించకపోవటం, సీట్లను కేవలం ఓట్ల కోణంలోనే చూడటంతో కోదండరాం చేరటం వలన వచ్చిన ఏమాత్రం సానుభూతైనా తిరిగి పోగోట్టుకోవటం, అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణా విభజన సమయంలో అడ్డంకులు సృష్టించిన తెలుగుదేశంకు పెద్దపీటవేయటం. ఒక్క ఖమ్మం జిల్లాలో తప్పితే రాష్ట్రవ్యాప్తంగా ఈ కలయిక సామాన్య తెలంగాణా ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చింది. తెలుగుదేశం కలయికను తెలంగాణా ప్రయోజనాలకు విఘాతం కలిగించే విషయంగా తెలంగాణా ప్రజల మనసుల్లో నాటటంలో కెసిఆర్ తన చాణ్యక్యానంతటినీ వుపయోగించాడు.ఈ కలయికను తెలంగాణాఫై ఆంధ్రుల ఆధిపత్యానికి గుర్తింపుగా రాబోతున్న అతిపెద్ద భూతంలా చూపించటంలో కెసిఆర్ తన రాజకీయ అనుభవాన్ని రంగరించాడని చెప్పవచ్చు. ఓ విధంగా చెప్పాలంటే కాంగ్రెసును ప్రజల్లో విలన్ గా చూపించటానికి తెలుగుదేశం కలయిక కలిసి వచ్చిన అదృష్టంగా భావించి ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా వాడుకున్నాడు. ఆ సమయంలోనైనా కాంగ్రెసు తన తప్పును తెలుసుకుని చాకచక్యంగా వ్యవహరించివుండాల్సింది. కాకపోగా అగ్నికి ఆజ్యంపోసినట్లు, తనగోతిని తానే తవ్వుకున్నట్లు చివరిదశ ప్రచారంలో చంద్రబాబు నాయుడుకు నాయకత్వపాత్ర ఇచ్చి చేజేతులా తన భవిష్యత్తును నాశనం చేసుకుందని చెప్పాలి. వాస్తవానికి షెడ్యూలు ప్రకారం కేవలం రెండు రోజుల నామమాత్ర ప్రచారమే చంద్రబాబు నాయుడు చేయాల్సివుంది. మరి దానిని వారంపైగా పొడిగించటంలో, విస్తృతం చేయటంలో కాంగ్రెసు వ్యూహాత్మక తప్పిదం చేసింది. ఇది రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయమా లేక చంద్రబాబు చాణక్యంతో కేంద్ర నాయకత్వం ఒత్తిడి మేరకు తీసుకున్న నిర్ణయమా ముందుముందు తెలుస్తుంది. మొత్తం మీద కెసిఆర్ ట్రాప్ లో దీనితో కాంగ్రెసు ఇరుక్కుంది.

ఇంకో ముఖ్యమయిన విషయం హైదరాబాదులో నివాసముంటున్న ఆంధ్రులపై అంచనా. పాతరోజుల్లో లాగా సెటిలర్లందరూ తెలుగుదేశం ప్రతినిధులుగా భావించటం పెద్ద తప్పిదం. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఆంధ్రా రాజకీయాలను పరిగనలోనికి తీసుకోకుండా ఆంధ్రా సెటిలర్ల విషయంలో కాంగ్రెసు పప్పులో కాలేసింది. వీళ్ళ ఏరియాల్లో తెలుగుదేశానికి పెద్ద పీటవేయటం పుండుమీద కారం చల్లినట్లయింది. చంద్రబాబునాయుడు ఎంత విస్తృతంగా ప్రచారం చేస్తే అంత ఎక్కువగా ఆంధ్రా సెటిలర్లు తెలుగుదేశంతో పాటు కాంగ్రెసుకు వ్యతిరేకంగా ర్యాలీ అయ్యారు. ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రాలో జరగబోయే పరిణామాలకు నాందీగా చెప్పొచ్చు.

చివరగా, ప్రజల స్పందనను పసిగట్టటంలో జాతీయ మీడియా సఫలీకృతమయిందనే చెప్పాలి. అన్ని జాతీయ ఛానళ్లు తెరాస గెలుస్తుందనే చెప్పాయి . దీని నుంచి దృష్టి మరల్చడానికి పెద్ద కుట్రే జరిగినట్లు కనిపిస్తుంది. అప్పటిదాకా విశ్వసనీయత వున్న లగడపాటి ఫ్లాష్ టీం సర్వేని ఉద్దేశపూర్వకం గానే రంగంలోకి దించినట్లు అనిపిస్తుంది. వాస్తవానికి నవంబరు 20వ తేదీన ఫ్లాష్ టీంని వినియోగించి TV5 చేసిన సర్వేలో టిఆర్ఎస్ దాదాపు 90సీట్లతో విజయం సాదిస్తుందని తేల్చింది. ఆ తర్వాత సడెన్ గా రంగప్రవేశం చేసిన లగడపాటి కేవలం 15రోజుల్లోనే మొత్తం రాజకీయం మారిపోయిందని ప్రజాకూటమికి మొగ్గువుందని ఎన్నికల ముందు ప్రకటించటం ప్రకంపనాలు సృష్టించింది. తన సర్వేకున్న విశ్వసనీయతను ఫణంగా పెట్టి ప్రజల్లో అయోమయం సృష్టించటానికి పెద్ద కుట్రే జరిగినట్టు ఫలితాలు చూసిన తర్వాత భావించాల్సివస్తుంది. దీనికి తెరవెనుక పాత్రధారులెవరో తేలాల్సివుంది. అంతటి విశ్వసనీయత వున్న సర్వే ప్రజానాడిని పట్టలేకపోవటం, పోలింగ్ కు రెండు రోజుల ముందు ప్రజాకూటమికి అనుకూలంగా ఫలితాలు వెల్లడించటం వెనుక చంద్రబాబునాయుడు పాత్ర వుందని ప్రజలు నమ్ముతున్నారు. దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనావుంది. చివరిగా చెప్పాలంటే ఇది జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. కేవలం రాజకీయాధికారం కోసం సూత్ర రహిత పొత్తులకు తెరదీస్తే ప్రజలు ఆమోదించరని దీనినుంచి గుణపాఠంగా భావించాల్సివుంది. జాతీయ రాజకీయాలపై వేరే వ్యాసంలో విపులంగా చర్చించుకుందాం. ప్రస్తుతం ఈ ఎన్నికల ఫలితాలు ఆంధ్రారాజకీయాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో పరిశీలిద్దాం.

ఆంధ్రా రాజకీయాలపై ఈ ఎన్నికల ప్రభావమెంత?

ఓ విధంగా చెప్పాలంటే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే ఆంధ్రా ఎన్నికలపై విస్తృత ప్రభావాన్ని చూపబోతున్నాయి. చంద్రబాబునాయుడు రాజకీయ పరిణతితో వ్యవహరించివుంటే ఇంత రిస్కు తీసుకునివుండడు. ఇటీవలి తన నిర్ణయాలు పాత చంద్రబాబునాయుడులాగా సాహసోపేతంగా, ట్రెండ్ సెట్టరుగా వుండటంలేదనేది విశ్లేషకుల అంచనా. రాజకీయ పరిణతి వుంటే తెలంగాణాలో MLC సీటుకోసం తాపత్రయపడివుండకూడదు. కేవలం తను చేయించుకున్న సర్వేలో తన కన్నా జగన్ వైపే ఓటర్లు మొగ్గుచూపారని తెలియటంతో యుటర్న్ తీసుకుని మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెసుకు దగ్గరయ్యాడు. దీనివలన పోయిన పరపతి తిరిగి రాకపోగా ప్రతిష్ట కూడా మంటగలిసి ఉభయ భ్రష్టత్వం పట్టాడు. ఇప్పుడు తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తు కట్టటమేకాకుండా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేసాడు. చేసే ముందు ఒకవేళ ఓడిపోతే ఆంధ్రాలో వచ్చే రాజకీయ పరిణామాలను అంచనా వేయకపోవటం తన అనుభవం, రాజకీయ పరిణతి రివర్సు గేరులో వున్నాయని చెప్పక తప్పదు. ఈ ఎన్నికల ఫలితాలు చంద్రబాబునాయుడికి కోలుకోలేని షాక్ గానే చెప్పాలి. అలాగే ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన జగన్, పవన్ లకు నైతిక బలంగా భావించవచ్చు.

ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాలు పరివర్తనదశలో వున్నాయి. రానురాను జగన్ వర్సస్ పవన్ దిశగా పరివర్తన చెందుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం వరకూ ఇప్పటికే ఈ సమీకరణాలు మారాయి. ఈ ప్రాంతంలో తెలుగుదేశం రోజురోజుకీ కుచించుకుపోతుంది. మిగతా ప్రాంతంలో అంటే కృష్ణాజిల్లా నుంచి దిగువకు ప్రస్తుతానికి రాజకీయాలు జగన్ వర్సస్ చంద్రబాబునాయుడి మధ్యనే వున్నాయని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో ఇంకా విస్తృతంగా పర్యటించాల్సివుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీ ఆంధ్రా రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. మొదట్లో అందరూ తనను తేలికగా తీసుకున్నారు, తను సీరియస్ రాజకీయ నాయకుడు కాదనుకున్నారు. కానీ గత మూడు,నాలుగు నెలల పర్యటనలు ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించాయి. తనను అపరిపక్వ నాయకుడిగా భావించిన వాళ్లే ప్రస్తుతం అభిప్రాయాలు మార్చుకోవలసివచ్చింది. మాట్లాడేతీరులో, ప్రజలతో మమేకమవటంలో, సమస్యల పై అవగాహన పెంచుకోవటంలో అనుభవం సంపాదించాడు. ప్రస్తుతం ప్రజలు చంద్రబాబునాయుడు, జగన్ లతో పాటు పవన్ కళ్యాణ్ ను ఓ సీరియస్ రాజకీయ నాయకుడిగా చూడటం మొదలుపెట్టారు. అంటే ఆంధ్రా రాజకీయాలు ముక్కోణపు పోటీ వైపు దారి తీసాయని చెప్పొచ్చు. ఆ మేరకు పవన్ కళ్యాణ్ ఈ మూడునెలల్లో విజయం సాధించాడు. అయితే ఇది ప్రస్తుతం గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రకే పరిమితమయ్యింది. ఈ ముక్కోణపు పోటీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలంటే వచ్చే మూడు నెలల్లో మిగతా ప్రాంతంలో విస్తృతంగా పర్యటించాల్సివుంది. పరిమిత సమయం, పరిమిత వనరులు ఈ కార్యాన్ని ఎంత వరుకు సఫలీకృతం చేస్తాయో చూడాలి.

మొత్తం మీద చూస్తే ఈ ఎన్నికల ఫలితం తెలుగుదేశంకు, చంద్రబాబునాయుడుకి పెద్దదెబ్బనే చెప్పాలి. జాతీయ మీడియాలు నిర్వహించిన సర్వేల ప్రకారం ఇప్పటికే ఆంధ్రాలో జగన్ పార్టీ పూర్తి ఆధిక్యతలోవుంది. ఇక ఈ ఎన్నికల తర్వాత అది మరింత బలపడే అవకాశమే ఎక్కువగావుంది. అయితే మూడు నెలలు రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు . జనసేన పార్టీ అతితక్కువ సమయంలో అతివేగంగా విస్తరించిందని చెప్పాలి. ఆ మేరకు తెలుగుదేశం క్షీణించిదనేది వాస్తవం. ఒక్కటి మాత్రం ఖాయంగా కనిపిస్తుంది తెలుగుదేశం గ్రాఫ్ రోజురోజుకీ క్షీణించటం. చంద్రబాబునాయుడు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నాడు. అవినీతి పరులైన సుజనాచౌదరి, సి ఎమ్ రమేష్ లను వెనకేసుకు రావటం ప్రజలు హర్షించటంలేదు. సిబిఐ దాడులను రాజకీయ కక్ష సాధింపు చర్యగా తెలుగుదేశం విమర్శించినా అందుకు తెలుగు మీడియా సహకరించినా ప్రజలు మాత్రం వాళ్లపై ఏ మాత్రం సానుభూతి చూపటంలేదు. చూపకపోగా లోలోపల హర్షిస్తున్నారని తెలుగుదేశం గ్రహించలేకపొతే రాబోయే ఎన్నికలపై ఆశలొదొలుకోవల్సిందేనని చంద్రబాబునాయుడు గ్రహించాల్సివుంటుంది.

మొత్తం మీద తెలంగాణా ఎన్నికల ఫలితాలు ఆంధ్రా రాజకీయాల్లో తెలుగుదేశం రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీసాయనే చెప్పొచ్చు.

అలాగే ముగించేముందు ఇంకోవిషయం కూడా ప్రస్తావించాల్సి వుంది. ఎన్నికల తదుపరి రాజకీయాలు తెలంగాణాలో మార్పునకు గురవుతాయి. తక్షణమేకాకపోయినా దీర్ఘకాలంలో రాజకీయ సమీకరణలు మార్పుచెందే అవకాశాలున్నాయి. అవేంటో ముందు ముందు చర్చించుకుందాం.

--రామ్

more updates »