తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు బీజేపీ కి లాభమేనా?

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు బీజేపీ కి లాభమేనా?

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడటానికి స్వంత శక్తి మీదకన్నా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించటంపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. రాజకీయనాయకులు తిండిలేకపోయినా ఉండగలరేమోగానీ పదవిలేకుండా ఉండలేరు. ఆ బలహీనతను సొమ్ముచేసుకోవాలని బీజేపీ తహతహ లాడుతుంది. ఆంధ్రా లో, తెలంగాణాలో ఆ కేటగిరీలో చాలామంది వున్నారు. అంతవరకూ పెద్దగా సమస్యలేదు. వాళ్ళ పార్టీ మార్పిడి వాళ్ళ ఇష్టం. కానీ ప్రస్తుతం పదవుల్లో వుండి పార్టీ మారితేనే సమస్యల్లా. అలా మారేవాళ్ల సంఖ్య బాగానేవుందని అనుకుంటున్నారు. ఈ జాబితాలో చాలా పేర్లు వినబడుతున్నాయి. ఆంధ్రాలో సుజనా చౌదరి పార్టీ మారతాడని రూమర్ బాగా వుంది. దానికి నమ్మకం కలిగేలా నిన్న NTV కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను చెప్పిన సమాధానాలు ఊతమిస్తున్నాయి. అలాగే తెలంగాణాలో కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ఇచ్చిన పత్రికా ప్రకటన కూడా అదే దోవలో వుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఇదే దారిలో వున్నారని తెలుస్తుంది.

సమస్యల్లా పదవిలో వుండి పార్టీమారటంపైనే. ముఖ్యంగా ఒకపార్టీలో ఎంపీ గానో , ఎమ్యెల్యే గానో వుండి పార్టీ మారే వాళ్ళు ఆ పదవికి రాజీనామా చేయకుండా బీజేపీ లో చేరితే అది ప్రజలు హర్షించరు. బీజేపీ నాయకత్వం వాళ్ళను పదవికి రాజీనామా చేసి రమ్మనమని చెబితేనే ప్రజలు హర్షిస్తారని తెలుసుకోవాలి. ఇప్పటికిప్పుడు బీజేపీకి వచ్చే ప్రయోజనం కూడా ఏమీలేదు. ఐదుసంవత్సరాలతర్వాతగాని ఎన్నికలు జరగవు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే బీజేపీకి ఉపయోగముంటుంది కానీ ఇతరపార్టీలో ఎన్నికైన వాళ్ళను రాజీనామా చేయకుండా చేర్చుకుంటే వాళ్లకు దీర్ఘకాలంలో నష్టమేకానీ లాభముండదు. ఈ విషయాన్ని దృష్టిలోపెట్టుకుని రాజకీయనాయకుల్ని చేర్చుకుంటే మంచిది. అందునా ఒకవైపు జగన్ సభాముఖంగా ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత కూడా బీజేపీ దానిని పరిగణన లోకి తీసుకోపోతే నష్టం వాళ్ళకేనని గమనించాలి.

ఇంకో ముఖ్యవిషయం కూడా బీజేపీ నాయకత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్ధిక నేరాలు చేసి అవి కప్పిపుచ్చుకోవటానికి పార్టీ ఫిరాయించే రాజకీయనాయకుల విషయం లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతయినా వుంది. ఉదాహరణకు సుజనా చోదరిపై ఆర్ధిక అవకతవకలపై ఎన్నో ఆరోపణలున్నాయి. ప్రజల్లో కూడా తనపై వాటిని కప్పిపుచ్చుకోవటానికే పార్టీ మారబోతున్నాడనే అభిప్రాయముంది. అటువంటి పరిస్థితుల్లో తనలాంటి వ్యక్తిని చేర్చుకోవటంలో బీజేపీ కి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరగొచ్చు. అందుకనే తన రాజ్య సభ సభ్యత్వానికి ముందుగా రాజీనామా చేయమని షరతు పెడితే తన అసలు రంగు బయట పడుతుంది. మొత్తం మీద చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల అనంతరం బీజేపీ ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. ఈ సమయం లోనే బీజేపీ జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది.

more updates »