ఇక జరిగేవి హిందూ, హిందీ ప్రాంత ఎన్నికలు

ఏడు దఫాలు, 40 రోజుల పోలింగ్ ప్రక్రియలో మూడు దఫాలు, పక్షం రోజులు గడిచిపోయాయి. ఇప్పటికి 302 నియోజక వర్గాల్లో పూర్తిగా, ఒక నియోజక వర్గం(అనంతనాగ్) లో పాక్షికంగా పోలింగ్ పూర్తయ్యింది. మొత్తం దక్షిణ భారత దేశం, ఈశాన్య భారతదేశం లో పోలింగ్ పూర్తిగా అయిపోయింది. 29 రాష్ట్రాల్లో 17 రాష్ట్రాలు , ఏడు కేంద్ర పాలితప్రాంతాల్లో ఐదింటిలో పోలింగ్ ప్రక్రియ పూర్తిగా పూర్తయ్యింది. అలాగే ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ లకు కూడా పోలింగ్ ముగిసింది. వచ్చే ఏప్రిల్ 29 వ తేదీన జరిగే నాలుగో దఫా పోలింగ్ తో ఒడిశా అసెంబ్లీ పోలింగ్ కూడా ముగుస్తుంది. అలాగే వచ్చే నాలుగో దఫా తో మహారాష్ట్ర, ఒడిశా లోక్ సభ పోలింగ్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ ఒక్క పశ్చిమ బెంగాల్ తప్పిస్తే దాదాపు ప్రశాంతంగానే జరిగాయని చెప్పొచ్చు. ఒక్క జమ్మూ కాశ్మీర్లోని కాశ్మీర్ లోయ ప్రాంతం మినహాయించి మిగతా అన్ని చోట్ల ప్రజలు విరివిగానే ఎన్నికల్లో పాల్గొన్నారని చెప్పొచ్చు. పోలింగ్ శాతాలు చూస్తే ఎప్పటిలాగే అస్సాం, పశ్చిమ బెంగాల్ లో ప్రజలు ఎనభై శాతానికి మించి ఓట్లెయ్యటం ముదావహం. కాకపోతే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. చివరకు బాంబులు కూడా ప్రయోగించారు. ఈ హింస కు అధికారం లో వున్న తృణమూల్ కాంగ్రెస్ దే ప్రధాన బాధ్యత. సంవత్సరం క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ప్రత్యర్థులను నామినేషన్లు వేయకుండా నిరోధించిన సంగతి అందరికీ తెలుసు. ఈ సంస్కృతి ముందుగా సిపిఎం మొదలు పెడితే దాన్ని పరాకాష్ట కు తీసుకెళ్లింది మమతా దీదీ. అక్కడ పార్టీ దౌర్జన్యం ఏ స్థాయికి వెళ్లిందంటే పార్టీకి చెప్పకుండా ప్రజలు ఏ పని చెయ్యటానికి లేదు. చివరకు ఇంటికి రిపేర్లు చేయించుకున్నా వాళ్ళ కమీషన్ వాళ్లకు ముట్టాల్సిందే. నగరంలో ప్రతివీధి లో క్యారంబోర్డు క్లబ్బులు వెలిసాయి. వాళ్లే ఈ దందాలు చేస్తూ వుంటారు. వాళ్లకు అదే జీవనోపాధి. ఈ సంస్కృతి నుంచి బయటకు రావాలంటే చాలా ప్రతిఘటించాల్సి ఉంటుంది. అది ఒక్క రోజులో జరగదు. ప్రజలకు సిపిఎం మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ మమతని ఎదురించే స్థాయి లో లేదు. అందుకే ప్రజలు మెల్లి మెల్లిగా బిజెపి గొడుగు క్రింద కు చేరుతున్నారు. అయితే ఇది ఒక్క రోజులో జరగదు .ప్రక్రియ ప్రారంభమైనా అది పూర్తిగా వేళ్లూనుకోవటానికి సమయం పడుతుంది. ఈ ఎన్నికల్లో కొంతమేర మమతను ఎదుర్కొని ఢీ కొట్టింది బిజెపి కాబట్టే ప్రత్యామ్నాయ పార్టీగా బెంగాల్ లో అవతరించింది. అయితే ఏ స్థాయిలో ఉందనేది ఫలితాలు వస్తేనేకాని తెలియదు. ఏది ఏమయినా ఈ ఎన్నికలు మమతా బెనర్జీ కి దెబ్బనే చెప్పాలి. అంటే ఫలితాలతో సంబంధం లేకుండా మమతా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు ఆమె వ్యక్తిత్వానికి మాయనిమచ్చగా మిగిలిపోతాయి. ఎన్నికల తర్వాత మహాకూటమికి నాయకత్వం వహించాలని తహ తహ లాడుతున్నా జరుగుతున్న పరిణామాలు మమతా నాయకత్వానికి ప్రతిబంధకం కావొచ్చు. ఢిల్లీ లో కావలించుకొనే ప్రతిపక్షాలు కలకత్తా లో కత్తులు దూసుకోవటం ప్రజలకు రుచించటంలేదు. ఏమైనా పశ్చిమ బెంగాల్ పరిణామాలు ప్రజాస్వామ్యానికి చేటు. ఇకపోతే మిగిలిన దఫాల్లో ఎన్నికలు స్థూలంగా చెప్పాలంటే హిందీ , హిందూ కేంద్రంగా జరుగుతాయని చెప్పొచ్చు. ఒక్క పశ్చిమ బెంగాల్, పంజాబ్ తప్పించి. అలాగే ముస్లిం జనాభా అధికంగా గల అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్ ల్లో చూస్తే ఇప్పటికే అస్సాం లో ఎన్నికలు ముగిసాయి. బీహార్, పశ్చిమ బెంగాల్ ల్లో ముస్లింలు అధికంగా గల ప్రాంతాల్లో చాలా వరకు ఎన్నికలు అయిపోయాయి. అందుకనే ఇక జరిగే ఎన్నికలు హిందూ కేంద్రబిందువుగా జరుగుతాయి కాబట్టి బిజెపి కి చాలా ముఖ్యమైన ఎన్నికలుగా చెప్పొచ్చు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ పశ్చిమ ప్రాంతం ఆదివాసీలు అధిక్యంగా వున్న ప్రాంతాలు. వీటికి ఈ విడతల్లోనే ఎన్నికలు జరుగుతాయి. అలాగే హిందీ కి ఆయువుపట్టయిన ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ , మధ్య ప్రదేశ్ , రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లు ఇక జరిగే ఎన్నికల్లోనే వున్నాయి. బిజెపి కి తాడో పేడో తేల్చే ఎన్నికలు ఇవేనని చెప్పొచ్చు. ఇక్కడే జాతీయ భద్రతా, జాతీయవాదం ప్రముఖంగా ముందుకొచ్చే అంశాలు. వీటితో పాటు ఈ 2019 ఎన్నికల గతిని మార్చే అంశాలు గా బాలాకోట్ వాయు దాడి, యూరి సర్జికల్ స్ట్రైక్, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల రేజర్వేషన్లు, ఆదాయపు పన్ను రిబేటు, కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్, ఉజ్జ్వల యోజన, స్వచ్చభారత్ అభియాన్ , ముమ్మూరు తలాక్, ఎస్సి ఎస్టీ సవరణ బిల్లు, బిసి కమీషన్ కి రాజ్యాంగ ప్రతిపత్తి లాంటి అంశాలను చెప్పొచ్చు. వీటిమీదే బిజెపి ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ ప్రధానంగా న్యాయ్ పధకం, నిరుద్యోగం, గ్రామీణ ఆర్ధిక దుస్థితి , రఫెల్ లో అవినీతి, బిజెపి మైనారిటీ వ్యతిరేకత అంశాలను ప్రచార అస్త్రాలుగా వాడుతుంది. ప్రజలు సగానికి పైగా నియోజక వర్గాలకు ఇప్పటికే గతిని నిర్ధారించారు. వచ్చే నెలరోజుల్లో ప్రజలు మిగతా వాటిల్లో కూడా దశ దిశకు రూపకల్పన చేస్తారు. ఆ రోజుకోసం ఎదురుచూద్దాం.
Prev శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు మా పనే: ఐసిస్ ప్రకటన
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.