సారూ.. చూడండి మన ఊరు తీరు..!

 సారూ.. చూడండి మన ఊరు తీరు..!

తాను పుట్టి పెరిగిన ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో కేంద్రమంత్రి హోదాలో వెంకయ్య నాయుడు జిల్లాకు సాధించుకొచ్చిన ప్రాజెక్టులు ఒక్కటంటే ఒక్కటీ పూర్తి కాలేదు. కొన్ని శిలాఫలకాలకే పరిమితం కాగా, మరికొన్ని మొండి గోడలు, ఇంకొన్ని పునాది రాళ్ల దశలోనే ఆగిపోయాయి. గూడూరు-విజయవాడ మధ్య ఇంటర్‌సిటీ రైలు ఆదివారం ప్రారంభించనుండగా, వెంకటాచలం- ఓబులవారిపల్లె నూతన రైల్వేలైన్‌ ప్రారంభమైంది. ఇంతకుమించి కేంద్ర ప్రాజెక్టులేవీ ముందడుగు వేయలేదు. ఈ బృహత్తర పథకాల రూపశిల్పి, సాధకుడు అయిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాకతోనైనా ప్రాజెక్టులకు మోక్షం కలగాలని నెల్లూరు జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు.

సొంత గడ్డపై ప్రేమతో కేంద్ర మంత్రి హోదాలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి జిల్లాకు సాధించుకొచ్చిన కేంద్ర ప్రాజెక్టులు దీనావస్థలో ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు మొండి గోడలకే పరిమితం కాగా ఇంకొన్ని పునాది రాళ్లతోనే ఆగిపోయాయి. ఐదు రాష్ట్రాల విద్యార్థులకు దిశానిర్దేశం చేసే గొప్ప పరిశోధన కేంద్రం... మరోవైపు సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న సందప, జీవరాశులపై అధ్యయనం చేసే పరిశోధన కేంద్రం, సాగర తీరం వెంబడి ఓడరేవులను, పారిశ్రామికవాడలను కలుపుతూ విశాలమైన సుందర రహదారులు.. జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించే సామర్థ్యం కలిగిన క్రీడా గ్రామం కలలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఈ బృహత్తర పథకాల రూపశిల్పి, సాధకులు అయిన వెంకయ్యనాయుడు శనివారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్న క్రమంలో ఈ కేంద్ర ప్రాజెక్టులకు మోక్షం కలగాలని, ప్రాణం పోయాలని నెల్లూరు జిల్లా ప్రజలు కోరుకొంటున్నారు.

క్రీడా గ్రామం నత్తనడక

అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఈ ఏడాది జాతీయ క్రీడాకారులతో నెల్లూరు జిల్లా కళకళలాడేది. దేశ క్రీడా పటంలో నెల్లూరుకు ఒక శాశ్వత స్థానం లభించి ఉండేది. నెల్లూరులో క్రీడా గ్రామం నిర్మించి 2019లో జాతీయస్థాయి క్రీడలను నెల్లూరులో నిర్వహించాలన్నది వెంకయ్య నాయుడు లక్ష్యం. ఇందుకోసం మొగళ్లపాళెం వద్ద 150 ఎకరాల స్థలం కేటాయించారు. అయితే, వెంకయ్య కోరిక మాత్రం నెరవేరలేదు. పనులు ఆగిపోయాయని చెప్పలేం కాని జరుగుతున్నాయి. అయితే జరుగుతున్న తీరు నత్తలతో పోటీ పడుతోంది. రూ.200 కోట్లతో అన్ని క్రీడా పోటీలను నిర్వహించే సామర్థ్యం కలిగిన క్రీడా గ్రామం నిర్వహించాలన్నది ఉద్దేశం. అయితే ప్రహరీ, రోడ్లు నిర్మాణాలు జరిగాయి. ఒక ఇన్‌డోర్‌ స్టేడియం పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని కేంద్ర ప్రభుత్వం, కేంద్రం నిధులు విడుదల చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండటంతో ఈ క్రీడా గ్రామం నిర్మాణాన్ని గాలికి వదిలేశారు.

పునాదికి పరిమితం ఎన్‌సీఈఆర్‌టీ

2016 డిసెంబరు 27న జాతీయ విద్యా పరిశోధనా సంస్థకు వెంకటాచలం మండల పరిధిలో పునాదిరాయి వేశారు. ఇందుకోసం 50 ఎకరాల స్థలం కేటాయించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు, అండమాన్‌ నికోబార్‌ దీవుల పరిధిలో విద్యాప్రమాణాలు పెంచడం ఈ సంస్థ లక్ష్యం. అకడమిక్‌ సిలబస్‌ తయారు చేయడం, ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం, విద్యాప్రమాణాలు పెంచడం కోసం అనుసరించాల్సిన విఽధానాలపై అధ్యయనం చేయడం ఈ సంస్థ లక్ష్యాలు. రెండేళ్ల కాలంలో నిర్మాణాలు పూర్తి చేసి 2018 నుంచి సేవలు అందించాలన్నది లక్ష్యం. అయితే నిధుల కేటాయింపు జరగని కారణంగా ఇప్పటి వరకు పునాది దశను దాటలేదు.

జాడ కనిపించని ఓషన్‌ టెక్నాలజీ

సముద్ర గర్భంలోని సంపదపై అధ్యయనం, సముద్ర జలాలు, జీవరాశులపై పరిశోధనలు జరపడం కోసం వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద 155 ఎకరాల్లో పరిశోధన కేంద్రం నిర్మించాల్సి ఉంది. 2015లో ఈ ప్రాజెక్టు ప్రారంభం అయ్యింది. 155 ఎకరాల స్థలంలో విస్తరించాల్సిన ఈ ప్రాజెక్ట్‌ కేవలం ఆఫీసు గదుల నిర్మాణాలకే పరిమితమైంది. గడచిన నాలుగేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుకు నామమాత్రపు నిధులు మాత్రమే కేటాయించడంతో ఈ పరిస్థితి దాపురించింది. ఈ ప్రాజెక్టు కోసం నిర్మించిన ఆఫీసు భవనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి.

సాగరమాల సాకారమయ్యేనా..!?

ఓడరేవును, పారిశ్రామిక వాడలను కలుపుతూ సముద్ర తీరం వెంబడి నాలుగు లైన్ల రహదారులు నిర్మించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సాగర తీరాల వెంబడి సాగరమాల పేరుతో రహదారులు నిర్మించాలని సంకల్పించింది. ఈ క్రమంలో జిల్లా పరిధిలో కృష్ణపట్నం పోర్టు, ఎస్‌ఈజెడ్‌, ఇతర పారిశ్రామిక వాడలను కలుపుతూ రూ.2వేల కోట్ల అంచనాతో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇప్పటికి సర్వే మాత్రమే పూర్తయ్యింది. సాగరమాల కల అంతటితో ఆగిపోయింది.

more updates »