ఉత్తేజపూరిత మోడీ ఎర్రకోట ప్రసంగం

ఉత్తేజపూరిత మోడీ ఎర్రకోట ప్రసంగం

ప్రధానమంత్రి మోడీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి ఎర్రకోటనుంచి ప్రసంగిస్తూ తన వచ్చే అయిదు సంవత్సరాల ప్రణాళికను ప్రజలముందు పెట్టాడు. ముందుగా చెప్పాల్సింది తన గంటన్నరకు పైగా సాగిన ప్రసంగం గురించి. అందరి ప్రధానమంత్రుల లాగా పేపర్ చూసి చదవటం కాకుండా అనర్గళంగా ప్రజల హృదయాలను తాకే పద్దతిలో మాట్లాడటం. ఈ విషయం లో తనకు ఎవరూ సాటిలేరని మరొక్కసారి నిరూపించాడు. ప్రసిద్ధ కాలమిస్ట్ , పూర్వ అధికారి బి ఎస్ రాఘవన్ దీనిపై స్పందిస్తూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మొదటి ఎర్రకోట ప్రసంగం నుంచి 2019 మోడీ ప్రసంగం వరకు ప్రత్యక్షంగా విన్న సాక్షిగా తనపాత్రను చెబుతూ ఈ 73 ప్రసంగాలలో అత్యంత గొప్ప ప్రసంగంగా ఈ సంవత్సరపు మోడీ ప్రసంగాన్ని అభివర్ణించాడు. నెహ్రూ కూడా మోడీ లాగే చూసి చదవటానికి ఇష్టపడేవాడుకాదని అయితే తన ప్రసంగం మోడీ లాగా నిర్దిష్టంగా కాకుండా జనరల్ గా ఉండేదని రాసాడు. అన్ని ప్రసంగాలను విన్న వ్యక్తి గా తన అభిప్రాయాలను కొట్టి పారేయలేము.

ఇక మోడీ ప్రసంగం విషయానికొస్తే ప్రతిసారి ఏదో కొత్తదనంతో తన ప్రసంగం నిండివుంటుందనే దాంట్లో సందేహం లేదు. ఈ సారి తను చేసిన ప్రసంగం లో హైలైట్ జనాభా విస్ఫోటనంపై మాట్లాడటం. వాస్తవానికి ఒకనాడు దీనిపై విస్తృత ప్రచారం జరిగినా గత కొన్ని దశాబ్దాలలో దీనిని పూర్తిగా విస్మరించటం జరిగింది. 1975 ఎమర్జెన్సీ లో సంజయ్ గాంధీ ఆధ్వర్యాన జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నేపథ్యంలో రాజకీయ నాయకులు దీనిపై మాట్లాడటం మానేసారు. ఓ విధంగా ఈ మౌనం దేశానికి చాలా చేటు చేసింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలయిన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఈరోజుకీ మిగతా రాష్ట్రాలకన్నా వెనకబడి ఉండటానికి ఇదో ప్రధాన కారణంగా చెప్పొచ్చు. నియంత్రణ లేని జనాభా పెరుగుదల తో దేశం అభివృద్ధి కి , సగటు మానవ జీవన ప్రమాణాల మెరుగుదలకు అడ్డంకిగా నిలిచిందనేది వాస్తవం. తిరిగి దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లటం ఎంతో అవసరం.ఈ చొరవ తీసుకున్నందుకు మోడీ అభినందనీయుడు.

రెండోది, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటంపై ప్రజల్లోకి తీసుకెళ్లటం. అక్టోబర్ 2 నుంచి దీన్ని ఓ ప్రజా ఉద్యమం గా తీసుకెళ్లాలని పిలుపివ్వటం ముదావహం. పర్యావరణానికి ప్లాస్టిక్ చేసే చేటు అనంతం. ప్రధానమంత్రిగా దీన్ని చేపట్టటం పర్యావరణ ప్రేమికులందరికి ఎంతో ఉత్సాహానిచ్చింది.

అలాగే జల్ జీవన్ మిషన్ కోసం 3. 5 లక్షలకోట్ల కేటాయించటం, మౌలిక వసతులపై 100 లక్షల కోట్ల ప్రణాళికను సిద్ధం చేయటం భారతదేశం అభివృద్ధి దశలో పెద్ద ముందడుగని చెప్పాలి. సామాన్య ప్రజలు దైనందిన జీవనంలో ప్రభుత్వం మీద ఆధారపడటం పూర్తిగా అడ్డుకట్ట వేయాలని అందుకోసం సాంకేతికను ఉపయోగించుకొని ప్రజల జీవనం సులువుగా , సరళంగా వుండాలని ఆదిశలో ప్రయత్నంచేస్తానని చెప్పటం హర్షించదగ్గ పరిణామం. ఎందుకంటే అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ దేశాల్లో ప్రజలు రోజు వారీ పనుల్లో ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకపోవటంతో వాళ్ళ దైనందిన జీవితం సాఫీగా జరిగిపోతుంది. ప్రభుత్వ జోక్యం ఉన్నప్పుడల్లా ప్రజలను ఇబ్బందులు పెట్టటం, అవినీతికి పాల్పడటం సర్వ సాధారణం. మోడీ ఈ ఆలోచనను చిత్తశుద్ధి తో అమలుచేస్తే ప్రజల ' ease of living ' సుఖవంతంగా ఉంటుంది. దానితోపాటు నగదు రహిత లావాదేవీలను గ్రామాల్లోకూడా విరివిగా ఉపయోగించే విధానాలను ప్రోత్సహించటం ఎంతయినా అవసరం.

చివరగా అవినీతిపై యుద్ధాన్ని వచ్చే ఐదుసంవత్సరాలలో కూడా కొనసాగిస్తానని చెప్పటం ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. అదే సమయం లో నిజాయితీగా వ్యాపారం చేసేవాళ్లను, సంపద సృష్టించే వాళ్ళను కొనియాడటం పారిశ్రామిక, వ్యాపారవర్గాల్లో కూడా మంచి అనుభూతిని మిగిల్చింది. అలాగే రక్షణ రంగం లో రక్షణ చీఫ్ ని నియమిస్తాననటం ఎప్పటినుంచో వున్న సమస్యకు పరిష్కారం కనుగొని రక్షణ రంగ నిపుణుల్లో స్ఫూర్తి ని నింపింది. మొత్తంగా చూస్తే ఈ సంవత్సరపు మోడీ ఎర్రకోట ప్రసంగం ప్రజల్లో ఉత్తేజాన్ని, ఆశలను, ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు.

more updates »