గేల్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్నే మార్చేసింది: రసెల్‌

Article

కోల్‌కతా: ఇన్నింగ్స్‌ ఆఖర్లో వస్తాడు.. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తాడు. ఇది గత నెల రోజులుగా ఐపీఎల్‌లో మనం చూస్తున్న రసెల్‌ ఆటతీరు. ఈసారి రసెల్‌ విజృంభణ మనకు తెలిసిందే. ఈ 12వ సీజన్‌లో రసెల్‌ 217 స్ట్రైక్‌రేట్‌తో అందరి కంటే ముందున్నాడు. 65.33సగటుతో 392 పరుగులు చేశాడు. ఇప్పటికే 41 సిక్సర్లు బాదాడు. అయితే, తన భారీ సిక్సర్ల వెనకాల ఉన్న రహస్యాన్ని రసెల్‌ బయటపెట్టాడు. రసెల్‌ వీరబాదుడు వెనకాలున్న క్రికెటర్‌ మరెవరో కాదు.. యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌. అతను ఇచ్చిన సలహాతోనే సిక్సర్లు కొట్టగలుగుతున్నానని అంటున్నాడీ హార్డ్‌ హిట్టర్‌.

‘బంతిని బలంగా బాది బౌండరీకి పంపించడంలో క్రిస్‌ గేల్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్నే మార్చేసింది. సిక్సులు ఎలా కొట్టాలో గేల్‌ను చూసే నేర్చుకున్నా. ఇంతకు ముందు చాలా తేలికైన బ్యాట్లు వాడేవాడిని. గత టీ20 ప్రపంచకప్‌లో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న సమయంలో గేల్‌ నా దగ్గరికి వచ్చి ‘నువ్వు బరువైన బ్యాటు ఎందుకు వాడవు.. ఆ బ్యాటుతో సిక్సర్లు సులభంగా కొట్టవచ్చు’ అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను నేను అమలు చేసినప్పటి నుంచి నా బ్యాటింగ్‌ తీరే మారిపోయింది. అదే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో 48 పరుగులు చేశాను. అప్పటి నుంచి నేను చూస్తుండగానే నా దశ తిరిగింది. ప్రస్తుతం మిగితా బ్యాట్స్‌మెన్ బ్యాట్ల కంటే నా బ్యాట్‌ బరువెక్కువ. నా బ్యాటులో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఉపయోగించి నేను బ్యాటింగ్‌ చేస్తున్నాను’ అని రసెల్‌ తెలిపాడు.

Prev అంబటి రాయుడుకు దక్కని ప్రపంచకప్‌ బెర్త్‌
Next అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ఇవ్వనున్న యువరాజ్‌సింగ్‌
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.