ఐపీఎల్ టైటిల్ విజేతగా రోహిత్ సేన

ఐపీఎల్ టైటిల్ విజేతగా రోహిత్ సేన

హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై విజేతగా నిలిచి నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది. ఐపీఎల్‌లోని అసలైన మజాను పంచుతూ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి విజయం ముంబైనే వరించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఆ పనిచేయడం ఎంత తప్పో త్వరగానే అర్థమైంది. చెన్నై బౌలర్లు పోటీలు పడి వికెట్లు తీస్తుంటే ముంబై విలవిల్లాడింది. ఒకానొక దశలో 100 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. మెరుపులు మెరిపిస్తాడని ఆశలు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా 16 పరుగులకే వెనుదిరగడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

మరోవైపు క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ చేరుతుండడంతో ముంబై ఓటమి అప్పుడే ఖరారైనట్టు భావించారు. చివరికి కీరన్ పొలార్డ్ పుణ్యమా అని మొత్తానికి 149 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. 25 బంతులు ఎదుర్కొన్న పొలార్డ్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. జట్టులో ఈ స్కోరే అత్యధికం కావడం గమనార్హం. డికాక్ 29, రోహిత్ శర్మ 15, సూర్యకుమార్ యాదవ్ 15, ఇషాన్ కిషన్ 23 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు తీసుకోగా, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

150 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన చెన్నై చివరి బంతి వరకు పోరాడి ఓడింది. 148 పరుగులకు పరిమితమై ఒక్క పరుగు తేడాతో ఓడింది. షేన్ వాట్స్ మెరిసినప్పటికీ మిగతా వారు విఫలం కావడంతో ఓటమి పాలైంది. 59 బంతులు ఎదుర్కొన్న వాట్సన్ 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. ఫా డుప్లెసిస్ 26 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్రావో ఒక్కడే 15 పరుగులు చేశాడు. మిగతా వారెవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.

ఇక, ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు అభిమానులను మునివేళ్లపై నిలబడేలా చేసింది. నరాలు తెగే ఉత్కంఠకు దారితీసింది. చివరి రెండు ఓవర్లలో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం కాగా, చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. దీంతో ధోనీ సేన సునాయాసంగా గెలుస్తుందని అందరూ భావించారు. అయితే, ఒక్కో బంతీ పడుతున్న కొద్దీ అంచనాలు తారుమారయ్యాయి. వికెట్లు టపటపా పడిపోవడంతో చెన్నై అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

ఇక, చివరి ఓవర్లో విజయానికి కావాల్సింది 9 పరుగులే. క్రీజులో వాట్సన్ ఉండడంతో చెన్నై విజయం నల్లేరు మీద నడకేనని అనుకున్నారు. కానీ, మలింగ వేసిన ఆఖరి ఓవర్లో తొలి మూడు బంతుల్లో నాలుగు పరుగులే వచ్చాయి. ఐదో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో వాట్సాన్ రనౌట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరం కాగా, ఐదో బంతికి రెండు పరుగులే వచ్చాయి. ఆఖరి బంతికి విజయానికి రెండు పరుగులే అవసరం. కానీ శార్దూల్ వికెట్ల ముందు దొరికిపోవడంతో ముంబై అభిమానులు స్టేడియంలో హోరెత్తించారు. ఒకే ఒక్క పరుగు తేడాతో ముంబై జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోవడం ముంబైకి ఇది నాలుగోసారి. జస్ప్రిత్ బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

ఐపీఎల్ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై రూ.20 కోట్ల ప్రైజ్ మనీ అందుకోగా, రన్నరప్ చెన్నై రూ.12.5 కోట్లు అందుకుంది.

more updates »