వరల్డ్‌కప్‌ లో ఆ రెండు జట్లే ఫేవరెట్స్‌: మెక్‌గ్రాత్‌

వరల్డ్‌కప్‌ లో ఆ రెండు జట్లే ఫేవరెట్స్‌: మెక్‌గ్రాత్‌

మెల్‌బోర్న్‌: మరో రెండు నెలల్లో ఇంగ్లండ్‌ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు హాట్‌ ఫేవరెట్‌ అని ఆసీస్‌ దిగ్గజ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ పేర్కొన్నాడు. భారత్‌తో పాటు ఇంగ్లండ్‌ కూడా వరల్డ్‌కప్‌ ఫేవరెట్‌ జట్లలో ఒకటన్నాడు. భారత్‌, ఇంగ్లండ్‌లకు వరల్డ్‌కప్‌ గెలిచే సత్తా ఉందంటూ తన మనసులోని మాటను వెల్లడించాడు. ‘ భారత్‌, ఇంగ్లండ్‌లు వరల్డ్‌కప్‌ పోరులో టాప్‌ జట్లుగా బరిలో దిగుతున్నాయి. వీటికే వరల్డ్‌కప్‌ను సాధించే అవకాశాలు ఎక్కువ. ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఇంగ్లండ్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. మరొకవైపు స్వదేశంలో జరిగిన రెండు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భారత్‌కు పరాభవం ఎదురైంది.

అయినప్పటికీ ఈ రెండు జట్లే వరల్డ్‌కప్‌ హాట్‌ ఫేవరెట్స్‌. అన్ని విభాగాల్లోనూ భారత్‌-ఇంగ్లండ్‌లు చాలా పటిష్టంగా ఉన్నాయి. భారత్‌పై గెలిచిన సిరీస్‌లతో ఆసీస్‌ కూడా వరల్డ్‌కప్‌ రేసులోకి వచ్చిందనే చెప్పాలి’ అని మెక్‌గ్రాత్‌ పేర్కొన్నాడు. కాగా, భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మెక్‌గ్రాత్‌ ప్రశంసలు కురిపించాడు. అతనొక అసాధారణ ఆటగాడిగా అభివర్ణించిన మెక్‌గ్రాత్‌.. అతని కెరీర్‌ ముగిసే సమయానికి దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారా తరహాలో చరిత్రలో నిలిచిపోతాడన్నాడు. అదే సమయంలో భారత్‌ పేస్‌ బౌలర్లు బుమ్రా, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మలు వరల్డ్‌కప్‌లో కీలక పాత్ర పోషిస్తారన్నాడు.

more updates »