పీవీ సింధుకు ఉప రాష్ట్రపతి అభినందనలు

Article

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ ను తొలిసారి నెగ్గిన భారత బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లో వెంకయ్య నాయుడిని పీవీ సింధుతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా పీవీ సింధును వెంకయ్యనాయుడు అభినందిస్తూ.. సింధూ దేశానికి మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు. ఈ విజయంతో ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారని ప్రశంసలు కురిపించారు.

డిసెంబర్ 16న జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ ప్లేయర్ ఒకుహరపై 21-19, 21-17 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించింది పీవీ సింధు. ఈ మ్యాచ్ గంటా రెండు నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. సుదీర్ఘ ర్యాలీలతో అలరించింది. గతేడాది ఫైనల్ చేరినా సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్న సింధు.. ఈసారి మాత్రం టైటిల్ గెలవడం విశేషం. ఈ ఏడాది మొదటి నుంచీ సింధు టాప్ ఫామ్‌లో ఉంది. యమగుచి, తై జు యింగ్, రచనోక్‌లాంటి టాప్ ప్లేయర్స్‌పై వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన సింధు.. చివరి మ్యాచ్‌లోనూ అదే రేంజ్‌లో చెలరేగింది.

Prev తన క్లాస్ మేట్ చారులతను పెళ్లాడిన క్రికెటర్ సంజూ శాంసన్
Next అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ఇవ్వనున్న యువరాజ్‌సింగ్‌
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.