ఆంధ్ర విభజనని మరిచిపోలేని మోడీ

ఆంధ్ర విభజనని మరిచిపోలేని మోడీ

మోడీ ఆంధ్ర విభజనని మరిచిపోలేనట్లుంది. అవకాశం దొరికినప్పుడల్లా ఆ విషయం ప్రస్తావిస్తూనే వున్నాడు. ఈరోజు రాజ్య సభలో అధ్యక్ష ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ లోక్ సభ లో తలుపులు మూసేసి, లైట్లు ఆర్పేసి ఆంధ్ర విభజన ఎలా చేశారో మీ నిర్వాకం అందరికీ తెలుసునని చురకలంటించాడు. మోడీ ఎందుకని పదే పదే ప్రస్తావిస్తున్నాడో నని ఆలోచిస్తే ఎందుకనో అప్పటి లోక్ సభ పనితీరు ని మరిచిపోలేకపోతున్నాడని అర్ధమవుతుంది. ఇంతకుముందే ఈ విషయం అనేకసార్లు పార్లమెంటులో ప్రస్తావించటం జరిగింది. కాంగ్రెస్ ని ఎండగట్టే విషయం లో ఆంధ్ర విభజన ని ప్రధాన అంశంగా ఎంచుకుంటున్నాడు.

ఇందులో మొదటిగా కాంగ్రెస్ కి ప్రజాస్వామ్య ప్రక్రియపై నమ్మకం లేదని చెప్పటం. అంతవరకూ బాగానే వుంది. కానీ ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించటంతో అసలు మోడీకి ఆంధ్ర విభజన జరగటం ఇష్టంలేదా అనికూడా అభిప్రాయం ఏర్పడే అవకాశం వుంది. ఇప్పటికే తెరాస దీనిపై మోడీ పదే పదే ప్రస్తావించటాన్ని తప్పు పట్టింది. అసలు మోడీకి తెలంగాణ ఏర్పడటం ఇష్టంలేదని ఆరోపించింది. అయినా వెరవక అవకాశం దొరికినప్పుడల్లా మరలా మరలా అదే అంశాన్ని లేవనెత్తుతూనే వున్నాడు.

ఇప్పుడాలోచిస్తే ఒకవేళ నిజంగా మోడీ అప్పుడు పార్లమెంటులో వుండివుంటే పరిస్థితులు వేరుగా వుండేయని అనిపిస్తుంది. మొదట్నుంచి కొన్ని పుకారులు చక్కర్లు కొడుతున్నాయి. సోనియా గాంధీ ఓ పధకం ప్రకారం అప్పటి లోక్ సభ లో బీజేపీ నాయకురాలు, ప్రతిపక్ష పార్టీ నాయకురాలైన సుష్మ స్వరాజ్ తో ముందే మాట్లాడుకొని లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ద్వారా అనైతిక పద్దతిలో విభజన చట్టాన్ని ఆమోదింపచేసుకున్నారని చెబుతారు. అందుకే ఆ తర్వాత మీరా కుమార్ ని ఎన్నికల్లో ప్రత్యేకంగా తెలంగాణ ప్రచారానికి కాంగ్రెస్ తీసుకొచ్చుకుంది. అలాగే సుష్మ స్వరాజ్ తెలంగాణ కొచ్చి నేను మీ చిన్నమ్మ ననుకొని వోట్లెయ్యండని చెప్పింది. సరే తర్వాత కధ అందరికీ తెలిసిందే. కెసిఆర్ ని నమ్ముకున్న సోనియా గాంధీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దేశంలోనే ఎన్నికల్లో బోల్తా పడటం ఆ తర్వాత ఇప్పటిదాకా కోల్పోకపోవటం తెలిసిందే. రాజకీయాల్లో ఒక్కోసారి కొన్ని నిర్ణయాలు మొత్తం చరిత్రనే మారుస్తాయనటానికి ఇదో ఉదాహరణ. మోడీ అందుకనే ఈ విషయాన్ని ప్రస్తావించి కాంగ్రెస్ ని మానసికంగా దెబ్బతీస్తున్నాడు.

ఇప్పుడుచూస్తే కాంగ్రెస్ పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడి లాగా అయిపొయింది. ఆంధ్రాలో ఎటూ తిరిగి కోలుకోలేదు. ఇప్పుడు తెలంగాణ లో కూడా మూడో స్థానానికి పడిపోయే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. కాంగ్రెస్ చేసిన నిర్వాకాన్ని పదే పదే గుర్తుచేస్తూ మోడీ పరవశం చెందుతున్నట్లు అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇది తెలంగాణ లో బీజేపీ అవకాశాల్ని దెబ్బతీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వంపై ఎక్కువ పడినట్లు అనిపిస్తుంది.

more updates »