జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుందా?

Article

నిన్న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుందా అని మన పిచ్చాపాటి చర్చలో మాట్లాడుకున్నాం. ఈరోజు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుందా అనే దానిపై చర్చించుకుందాం. నిన్ననే చెప్పినట్లు ఎవరు గెలుస్తారో మనం చెప్పటంలేదు. ఇప్పటికే వందలాది వీడియోలు బయటకు వచ్చాయి. మనంకూడా ఆ వార్తల్లో నిలవదలుచుకోలేదు. ఇది కేవలం అన్ని రకాల ఆప్షన్లు మీముందు పెట్టి ఒకవేళ గెలిస్తే ఎలావుంటుంది అని మాత్రం పిచ్చాపాటి చర్చ అని గుర్తుపెట్టుకోండి.ఇక విషయానికొద్దాం.

జగన్ మోహన రెడ్డి కి గెలిచే ఛాన్సెస్ ఎక్కువున్నాయని ఎన్నికలముందు ఎక్కువభాగం చానళ్ళు చెప్పాయి. అయితే చివరి వారంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వ సొమ్ముని ఇష్టానుసారం ప్రజల ఖాతాల్లోకి మళ్లించటం వలన ప్రజల ఆలోచనల్లో మార్పువచ్చిందని ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ముఖ్యంగా పసుపు-కుంకుమ ప్రభావం గట్టిగానే పనిచేసిందని తెలుగుదేశం విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. కానీ ఆ పధకాల సొమ్ము పంపిణి తర్వాత కొంత పేరున్న ఏ ఛానలు అభిప్రాయసేకరణ జరపలేదు. ఆ సమయంకూడా లేదు. వెంటనే పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రచురించకూడదని నిబంధన ఉండటం వలన ఆ ఫలితాలు తెలిసే అవకాశాలు లేవు. కాబట్టి మన చర్చ కేవలం 'ఒకవేళ అయితే' కె పరిమితం.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రమే ఇవ్వాళికాబట్టి కేంద్రం లో ఎవరు అధికారంలోకి వస్తారనేదాన్నిబట్టి ఆధారపడివుంటుంది. నిన్నే చర్చించుకున్నట్లు మోడీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. కాబట్టి మోడీ తిరిగివస్తే ప్రత్యేక హోదా రానట్లేననుకోవాలి. అయితే ఇక్కడో తిరకాసు వుంది. మోడీ స్వంతంగా అధికారంలోకి వస్తాడా లేక ఇతరులమద్దత్తుతో వస్తాడా అనేది కీలకం కాబోతుంది. ఒకవేళ ఎన్డీయే స్వంతంగా మెజారిటీ వస్తే పాతపంధానే కొనసాగుతుంది. అలాకాకుండా వైఎస్సార్ పార్టీ మీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థితి ఉంటే అప్పుడు ప్రత్యేకహోదాకు ఒప్పుకుంటుందా? మొదటగా ఈ ఛాన్స్ కి అవకాశాలు ఎక్కువగాలేవని అనిపిస్తుంది. ఒకవేళ అటువంటి పరిస్థితే వస్తే అధికారం నిలుపుకోవటంకోసం మోడీ ప్రత్యేక హోదాకు ఒప్పుకుంటాడా? లేకపోతే జగన్ మోహన్ రెడ్డి కేసుల్ని చూపించి లొంగదీసుకుంటాడా అనేది కొంతమంది అనుమానం వెలిబుచ్చుతున్నారు. అసలు జగన్ మోహన్ రెడ్డి గట్టిగా నిలబడతాడో లేదో అనేది అప్పుడు తేలుతుంది. ఏమాటకామాటచెప్పాలి ప్రత్యేకహోదా విషయంలో జగన్మోహనరెడ్డి మొదట్నుంచి ఒకే స్టాండ్ మీద వున్నాడు. చంద్రబాబునాయుడు లాగా యూ టర్న్ తీసుకోలేదు. అదంతా ఒకెత్తు. రేపు అటువంటి టైం లో నిలబడటం ఒకెత్తు. అది జగన్మోహన్ రెడ్డి కి పరీక్షా సమయమే. ఇక మూడోది మోడీ వ్యతిరేకకూటమి అధికారంలోకి వస్తే. ముందుగా చెప్పినట్లు ప్రస్తుతం ఆ అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయినా 'ఒకవేళ అయితే' సందర్భంలో ఏమవుతుంది. ప్రత్యేకహోదా వస్తుందా? చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయినా , జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కేంద్రంలో మోడీ వ్యతిరేక కూటమి అధికారంలోకి వస్తే పరిస్థితుల్లో మార్పు ఉండదు. ఎందుకంటే ఈ కలగూరగంపలో ఆంధ్ర పార్టీలు ఎంతముఖ్యమో బీహార్, జార్ఖండ్, ఒడిశా ప్రాంతీయపార్టీలు అంతే ముఖ్యం. కాబట్టి కేంద్రంలో మోడీ వ్యతిరేక కూటమి అధికారం లోకి వస్తే ప్రత్యేకహోదా ఎటువంటి పరిస్థితుల్లో రాదు. అంటే మూడు దారుల్లో రెండు దారులు పూర్తిగా మూసుకుపోయాయి. కేవలం మూడోదయిన మోడీ కూటమి కి పూర్తీ మెజారిటీ రానప్పుడు మాత్రమే కనీసం ఆలోచించటానికి ఆస్కారముంది. అదీ జగన్ గట్టిగా నిలబడితే. నూటికి పది శాతంమాత్రమే దీనిపై ఆశలు పెట్టుకోవాలి.

మొత్తం మీద చూస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే నూటికి నూరుపాళ్లు ప్రత్యేక హోదా రాదు. జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వస్తే నూటికి తొంభయ్ పాళ్ళు రాదు. వెరసి ఏ పువ్వయినా ఒకటే చెవులొపెట్టుకోవటానికి. రేపు మూడో ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే అవకాశాలు వుంటాయేమో చూద్దాం. అప్పటిదాకా సెలవు.

Prev ఫణి తుఫానుకు భయపడుతున్న తీర ప్రాంత ప్రజలు
Next పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ప్రత్యేకహోదా వస్తుందా?
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.