శివాజీ పాత్రధారి చంద్రబాబు సూత్రధారినా ?

Article

టీవీ 9 రవిప్రకాష్ వ్యవహారం కొలిక్కిరాకముందే ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక వైపు రవిప్రకాష్ పోలీసులకు అందకుండా అజ్ఞాతవాసం చేయటం అంతకు ఒక్కరోజు ముందే తాను టీవీ లో ప్రత్యక్షంగా చెప్పినదానికి ఆచరణకు వున్న అంతరాన్ని ఎత్తిచూపుతుంది. రవి ప్రకాష్ పూర్వ వాసం వాసనలు వదిలి పూర్తిగా వ్యాపారవేత్తగా మారాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తన ప్రస్తుత హోదానే వ్యాపారంగా మార్చుకున్నాడనేది జనం ఆనోటా ఈనోటా అనుకోవటం చాలా రోజుల్నుంచి వింటున్నా తన పూర్వ నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అవన్నీ గిట్టనివాళ్ళు ప్రచారం లో పెట్టారని అనుకునేవాళ్లం. ఇప్పుడు బయటపడుతున్న వార్తలు చూస్తుంటే నిప్పులేనిదే పొగరాదనే సామెత గుర్తుకొస్తుంది.

ఇదంతా ఒక ఎత్తయితే హీరో శివాజీ ఈదెబ్బతో హీరో నుంచి జీరోగా, విలన్ గా మారటం హైలైట్. ఇన్నాళ్లు తనో తురుఫుఖాన్ లాగా ఫోజ్ పెట్టటం, ఆంధ్ర ప్రజల హక్కుల ఏకైక ఛాంపియన్ లాగా టీవీ ల్లో ప్రచారం చేసుకోవటం చూసాం. టీవీ 9 ఇందులో ప్రముఖ పాత్ర పోషించిందని మనందరికీ తెలుసు. ఎందుకు టీవీ 9 ఇంతగా తనని పైకెత్తిందో ఇప్పుడు అందరికీ అర్ధమయింది. టీవీ 9 తో పాటు మిగతా 'పచ్చమీడియా' గా పిలవబడే అన్ని చానళ్ళు శివాజీ ని ఆకాశానికి ఎత్తాయి. అతని కాకమ్మ కధలకి విపరీత ప్రచారం కలిపించాయి.

ఇందులో హైలైట్ ' ఆపరేషన్ గరుడ'. చార్టులు,మ్యాపులతో ఆంధ్ర ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయటంలో మీడియా పాత్ర కీలకం. ఇంత సిగ్గుమాలిన, నీతిమాలిన మీడియా ప్రపంచం లో ఎక్కడా ఉండదని ఇప్పుడు బయటపడుతున్న వార్తల్ని బట్టి ఎవరికైనా అర్ధమవుతుంది. బిజెపి లో ఎవరో ఇతనికి ఉప్పందిస్తున్నట్లు, చంద్రబాబు నాయుడు కి వ్యతిరేకంగా ఆపరేషన్ గరుడ పేరుతొ పెద్ద కుట్ర జరుగుతున్నట్లు అందులో జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ లు బి,సి టీంలుగా పనిచేస్తున్నట్లు ఇదంతా మోడీ నాయకత్వం లో పధకం ప్రకారం జరుగుతున్నట్లు విస్తృత ప్రచారం లో పెట్టారు. విశేషమేమంటే ముఖ్యమంత్రి స్థాయిలో వున్న చంద్రబాబు నాయుడు కూడా దీనికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడటంతో ఇదంతా నిజమేనేమో నని ప్రజల్లో భ్రమలు కల్పించగలిగారు. ఇదికూడా ఎన్నికల్లో ప్రచారానికి చంద్రబాబు నాయుడు ఉపయోగించుకోవటం చూస్తుంటే అసలు ఈ 'ఆపరేషన్ గరుడ' సృష్టికర్త చంద్రబాబునాయుడు ఏమోనని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మే 23 తర్వాత చంద్రబాబు నాయుడు అధికారం లోకి రాకపోతే ఈ 'ఆపరేషన్ గరుడ' పై కూడా దర్యాప్తు చేసే అవకాశం వుంది. అదేజరిగితే చంద్రబాబు నాయుడు అధికారం లోకి రాకపోతే మొదలయ్యే కష్టాల్లో చంద్రబాబు నాయుడు-రవిప్రకాష్-శివాజీ త్రయం కుట్ర కోణం కూడా ఒకటి.

ఇప్పుడు బయటపడిన రవిప్రకాష్-శివాజీ కుట్ర భాగోతం చూస్తుంటే సినిమా కథల్లాగా వుంది. రవిప్రకాష్ శివాజీ కి షేర్లు అమ్మినట్లు వాటిని శివాజీ కి రవిప్రకాష్ బదిలీ చేయనట్లు అందుకే యెన్ సి ఎల్ టి ని ఈ వ్యవహారం తేలేవరకు బోర్డులో ఎటువంటి మార్పులు చేయొద్దని అభ్యర్ధించటం జరిగింది. అంటే వాళ్లిద్దరూ పోట్లాడుకున్నట్లు నటించి తొంభయ్ శాతం వాటాలు కొన్న వాళ్లకు మేనేజ్ మెంట్ హక్కులు బదిలీ కాకుండా చివరిదాకా ప్రయత్నం చేశారని స్పష్టమవుతుంది. ఇందుకోసం చివరకు ఫోర్జరీ కి కూడా పాల్పడ్డారని తెలుస్తుంది. ఇందులో ఇంకో కోణం కూడా ఉందని జనం చెప్పుకుంటున్నారు. టీవీ 9 యాజమాన్యం తెలంగాణ వ్యక్తులు అందునా ముఖ్యమంత్రి కి సన్నిహితంగా ఉండేవారికి దఖలుపడటం చంద్రబాబు నాయుడు కి ఇష్టం లేదని అందుకనే తాను ప్రత్యక్షం గా రాకుండా శివాజీ ద్వారా ఈ నాటకం ఆడించాడని చెప్పుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎంతో తెలియదుకాని ఈ లోపల ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి రావాల్సిన మైలేజ్ వచ్చిందని ఇప్పుడు రవి ప్రకాష్-శివాజీ లు బుక్ అయినా చంద్రబాబునాయుడు కి పోయేదేమీ లేదని అందరినీ వాడుకొని వదిలేసినట్లే వీళ్ళను వదిలేశాడని జనం నోట్లో నానుతుంది. వీళ్ళిద్దరూ అరెస్టయి వాళ్ళు చెప్పే సాక్ష్యాన్ని బట్టి చంద్రబాబు నాయుడు పాత్ర ఏమిటో తెలుస్తుందని ఆనోటా ఈనోటా వినబడుతుంది. ఇవన్నీ చూస్తుంటే శివాజీ కేవలం పాత్రధారని అసలు సూత్రధారి చంద్రబాబు నాయుడు అని అనుమానాలు బలపడుతున్నాయి.

Prev పార్టీ నేతలకు జగన్ ఆదేశం
Next కమలహాసన్ పై చెప్పులతో దాడి
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.