సుజనా చౌదరి , చంద్రబాబు నాయుడు కి కుడిభుజం. ప్రస్తుతం జీఎస్టీ కేసులో దర్యాప్తునెదురుకుంటున్నాడు. ఇడి ఈ కేసులో వివరాలకోసం జీఎస్టీ డైరెక్టర్ జనరల్ గూఢచారి విభాగానికి లెటరు రాసింది. అలాగే జీఎస్టీ పన్ను ఎగవేత కమిషనరు హైద్రాబాదు కు కూడా . ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు పంపించాలని కోరింది. కృత్రిమ బిల్లులు సృష్టించి ప్రభుత్వం నుంచి వందల కోట్ల పన్ను మొత్తాన్ని జమచేసుకున్నాయనే ఆరోపణలు ఇంతకుముందే వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి బెంగళూరు సిబిఐ సుజనా చౌదరిని హాజరు కావాలని కోరగా హాజరు కాకుండా హైకోర్ట్ ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చివరకు అక్కడా ఉపశమనం దొరకలేదు. కోర్టు హాజరు కావాలని చెప్పింది. అయితే అరెస్ట్ చేయొద్దని, లాయర్ ని పెట్టుకోవచ్చని చెప్పింది.
అర్ధంకాని విషయమేమంటే సామాన్యుడు విషయంలో ఇదే న్యాయాన్ని కోర్టులు ప్రకటిస్తున్నాయా అంటే ప్రశ్నార్ధకమే. ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో చిదంబరం కు, కార్తీకి ఎన్నో సార్లు ముందస్తు బెయిలు లభించింది. న్యాయం సామాన్య ప్రజలకొకటి, రాజకీయ నాయకులకు వేరొకటిగా ఉందని జనం అనుకుంటున్నారు. తీర్పు అనుకూలంగా రాదని అనుమానముంటే కేసుని సంవత్సరాలపాటు వాయిదాలు వేసుకున్న సంగతి చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే ఆర్ధిక నేరగాళ్ల విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి నిర్దిష్ట కాలపరిమితి లోపల విచారణ పూర్తిచేయాలని జనం కోరుతున్నారు. అప్పుడే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఇనుమడిస్తుంది. ఆదిశలో న్యాయవ్యవస్థ లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఎంతయినా వుంది.
ఇక హైదరాబాద్ పన్ను ఎగవేత కేసుల విషయానికొద్దాం. హైదరాబాద్ జీఎస్టీ పన్నుఎగవేత విభాగం కమిషనరేట్ కి ఇటీవలే బొల్లినేని శ్రీనివాస గాంధీ ని పోస్ట్ చేశారు. ఈయన ఇంతకుముందు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులు పర్యవేక్షించారు. ప్రస్తుతం సుజనా చౌదరి కేసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు కృత్రిమ బిల్లుల కుంభకోణం కేసులో పన్ను సలహాదారు అయ్యంగార్ ని అరెస్ట్ చేయటం జరిగింది. భరణి కమోడిటీస్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి ని అరెస్ట్ చేయటంతో సుజనా గ్రూప్ లింక్ బయటపడిందని అనుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ సంస్థ దాదాపు 1300 కోట్ల రూపాయల కృత్రిమ బిల్లులను సృష్టించి 225 కోట్ల రూపాయల ముందస్తు పన్ను జమను పొందిందని ఆరోపిస్తున్నారు. ఈ ఉచ్చు సృజన గ్రూప్ డైరెక్టర్ల చుట్టూ బిగిస్తుందేమోనని భయపడుతున్నారు. ఇప్పటికి ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 3000 కోట్ల రూపాయలు ఈ పద్ధతుల్లో వ్యాపారస్తులు , పారిశ్రామిక వేత్తలూ ప్రభుత్వాన్ని మోసం చేశారని తెలుస్తుంది. ఈ లెక్కన దేశవ్యాప్తంగా ఎన్ని వేల కోట్లు స్వాహా చేసారో తేలాల్సివుంది. ఇటీవలే బంగారం వ్యాపారం కుంభకోణం లో శ్రీ కృష్ణ జ్యుయల్లర్స్ ప్రొప్రైటర్ ని అరెస్ట్ చేయటం జరిగింది. ఈ దోపిడీ పై కఠిన చర్యలు తీసుకోకపోతే వీళ్ళందరూ కలిసి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టటం ఖాయం.
మరి ఈ పరిణామాలన్నీ ఎలా చూడాలి? ఇంతకుముందు సుజనాచౌదరి పై సిబిఐ దాడులు చేస్తుందని సిబిఐ ఆంధ్ర రాష్ట్రం లోకి రాకుండా చంద్రబాబు నాయుడు పాత జీవోని ఉపసంహరించుకున్నాడు. అదేమంటే సిబిఐ ద్వారా కేంద్రం ఆంధ్ర నాయకుల్ని బ్లాక్ మెయిల్ చేస్తుందని అందుకనే కేంద్ర దర్యాప్తు సంస్థల్నిఆంధ్ర లోకి రాకుండా నిషేధించడాన్ని చెప్పుకొచ్చాడు. అనుకోకుండా సుజనా చౌదరి వ్యాపారాలు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ నిషేధమేమీ వర్తించదు. దీనికి చంద్రబాబు నాయుడు ఏమంటాడో చూడాలి. ఇదంతా కెసిఆర్ కుట్ర అంటాడేమో. సుజనా చౌదరి ని పబ్లిక్ గా సమర్ధించటం తో చంద్రబాబు నాయుడు ఒకింత ఇరకాటంలో పడ్డాడని చెప్పాలి. ముందు ముందు మరిన్ని ఇడి చర్యలతో చంద్రబాబు నాయుడు కి ఇబ్బందిగా మారుతుందని అనుకుంటున్నారు. ఢిల్లీ ఆశలపై ఈ పరిణామాలు ఎలా మారతాయో చూడాలి.
Please submit your comments.