- సమర్పణ: కరాటే రాజు నిర్మాణ సంస్థలు: వాజ్ఞ్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్
- నటీనటులు: విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్, ఉత్తేజ్, సలోని మిశ్రా, హర్షిత గౌర్ తదితరులు
- సంగీతం: వివేక్ సాగర్
- ఛాయాగ్రహణం: విద్యాసాగర్ చింత
- కూర్పు: రవితేజ
- నిర్మాతలు: కరాటే రాజు, చర్లపల్లి సందీప్, మీడియా 9 మనోజ్ కుమార్
- కథనం, దర్శకత్వం: విశ్వక్ సేన్
`వెళ్లిపోమాకే`, `ఈనగరానికి ఏమైంది` చిత్రాల్లో నటించిన విశ్వక్ సేన్ ఈసారి తన హీరోగా నటిస్తూ, దర్శకత్వం చేసిన సినిమా ఫలక్‌నుమా దాస్. పక్కా హైదరాబాదీ మూవీ. అది కూడా ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కింది. సినిమా ట్రైలర్ చూడగానే ఆ విషయం ప్రేక్షకుడికి బోధపడుతుంది. ఈ మధ్య హీరోల బాడీ లాంగ్వేజ్‌లో కాస్త రఫ్ నెస్ జోడించి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. రస్టిక్ స్టైల్లో తెరకెక్కిన సినిమాలు కొన్ని ఈ మధ్య ఆదరణ పొందటంతో కుర్ర హీరోలు అలాంటి స్టైల్లోనే సినిమాలు చేయడానికి ప్రయత్నాలు బలంగా చేస్తున్నారు. విశ్వక్ సేన్ కూడా `ఫలక్‌నుమా దాస్` సినిమాలో అలాంటి ప్రయత్నమే చేశాడు. మరి సక్సెస్ అయ్యాడా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం.
కథ: దాస్(విశ్వక్ సేన్) అనే యువకుడు ఫలక్‌నామాలోనే ఉంటాడు. అతని చదువు, స్నేహితులు, పెరిగిన వాతావరణం అన్నీ ఫలక్‌నామాలోనే కావడంతో అందరూ అతన్ని ఫలక్‌నామా దాస్ అంటుంటారు. చిన్నప్పుడు శంకరన్న అనే రౌడీ చేసే పనులు వైపు దాస్ ఆకర్షితుడవుతాడు. కొంతమంది స్నేహితులతో కలిసి అతన్నే ఫాలో అవుతాడు. పెరిగి పెద్దయిన దాస్.. చదువుకంటే గొడవల్లో ముందుంటాడు. వీరికి ఓ పెద్ద మనిషి తరహాలో పాండు(ఉత్తేజ్) సపోర్ట్ చేస్తుంటాడు. పెద్దవాడు కావడంతో చెల్లెలి పెళ్లి చేయాలి. డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మటన్ బిజినెస్ చేయాలనుకుంటాడు దాస్ అతని స్నేహితులు. దాని కోసం పొట్టేలను హోల్ సేల్‌గా అమ్మి వ్యాపారం చేసే రవి, రాజు దగ్గరికి పోతారు. అప్పటికే రవి, రాజు పాత పగలతో శంకరన్న చంపేసి జైలుకెళ్లి వస్తారు. అలాంటి వారితో కలిసి వ్యాపారం చేయడం ఇష్టం లేకపోయినా మరో ఆప్షన్ లేక దాస్ వ్యాపారాన్ని మొదలు పెడతాడు. క్రమంగా దాస్ అతని స్నేహితులే పొట్టేలను దిగుమతి చేసే వ్యాపారం కూడా స్టార్ట్ చేస్తారు. ఓ బార్‌లో జరిగిన గొడవలో దాస్ స్నేహితులను కోసం రవిరాజు బావమరిది కొడతారు. ఆ గొడవ క్రమంగా పెద్దదైపోతుంది. ఓ సందర్భంలో దాస్ అనుకోకుండా చేసిన పొరపాటు వల్ల దాస్ అతని స్నేహితులు అరెస్ట్ అవుతారు. చివరకు దాస్ ఆ హత్య కేసు నుండి ఎలా బయటపడతాడు? ఈ క్రమంలో దాస్ తన ప్రేమను సక్సెస్ చేసుకుంటాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ: విశ్వక్‌సేన్ పక్కా ఓల్డ్ సిటీ కుర్రాడిలా పాత్రకు సూటయ్యాడు. కేవలం నటనకే పరిమితం కావాలనుకోకుండా, దర్శకత్వం కూడా చేయడం అభినందించాల్సిన విషయమే. సినిమా అంతా హైదరాబాద్‌లోని ఓ ఏరియాకే పరిమితం అనేలా సినిమాను తెరకెక్కించాడు. పాతబస్తీలో ముఖ్యంగా ఫలక్‌నామాలో ఎలాంటి పరిస్థితులుంటాయి. అక్కడ ఉండేవాళ్లు ఎలా మాట్లాడుకుంటారు? ఎలా ఉంటారు? గొడవల సమయంలో వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇలాంటి విషయాలను విశ్వక్‌సేన్ చక్కగా ఎలివేట్ చేశాడు. ఈ సినిమా ద్వారా విశ్వక్‌సేన్ ఏం చెప్పాలనుకున్నాడు అనడానికి ఓ క్లారిటీ ఉంది. సినిమాలో బూతులు ఎక్కువయ్యాయి. సరే! లోకల్‌లో అలాగే మాట్లాడుకుంటూ ఉంటాం కదా! అని సర్ది చెప్పుకున్నా. బలమైన ఎమోషన్స్‌తో మంచి కథను చెప్పి ఉంటే ఇంకా బావుండేది అనిపించింది. వివేక్‌సాగర్ సంగీతం కొన్ని సీన్స్‌లో తన మ్యూజిక్‌తో డామినేట్ చేశాడు. దాస్ అనే కుర్రాడి జీవితాన్ని మాస్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాలనుకున్నాడు విశ్వక్‌సేన్. అయితే ఓ పరిమితమైన ప్రాంతానికే సినిమా సెట్ అవుతుందనిపించింది.
సినిమా కంటెంట్ మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుందా? అని ప్రశ్నిస్తే కష్టమే అనిపిస్తుంది. హీరో మందు తాగడం, ఫైట్స్ చేయడంతోనే సినిమా ముందుకు సాగదు. ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త క్యారీ కాలేకపోయింది. సెకండాఫ్ మరి బోర్‌గా అనిపిస్తుంది. సన్నివేశాల్లో ఎక్కడా ఎగ్జయిట్‌మెంట్ ఉండదు. అదేంటి సినిమా రస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేశాడుగా అనే ప్రశ్నకు .. రస్టిక్‌గా చూపించడానికి, బూతులు సినిమాలో పెట్టడాన్ని కొంత మంది కనెక్ట్ చేసుకున్నా.. అలాంటి నేపథ్యంలో మంచి కథను క్యారీ చేయవచ్చు. కోలీవుడ్‌లో ఇలాంటి ప్రయత్నాలు చాలా సక్సెస్ అయ్యాయి. కానీ విశ్వక్‌సేన్ సినిమా గ్రిప్పింగ్‌గా మలచడంలో విఫలమయ్యాడు. సినిమాలో తరుణ్ భాస్కర్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో కనపడతాడు. ఆయన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక హీరోయిన్స్ పెద్ద ప్రాముఖ్యత లేని పాత్రధారులుగా కనపడతారు. వివేక్ సాగర్ సంగీతం, నేపథ్య సంగీతం బాగా లేవు. విద్యాసాగర్ తన బడ్జెట్ పరిమితులకు లోబడి సినిమాటోగ్రఫీ అందించాడని సరిపెట్టుకోవాల్సిందే.
Please submit your comments.