మనం కర్మ భూమిలో వున్నాము. ఏది జరిగినా మన కర్మ అనుకునే భావన తో బతుకుతాం. చివరకు ప్రాణాలు పోయినా అది మన కర్మ అనుకోని బతుకులీడుస్తాం. లేకపోతే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే రాజకీయనాయకుల చర్యలవలన ఇన్ని లక్షలమంది విద్యార్థులు ఒక్కసారి మానసిక క్షోభకు గురయితే కమిటీల కాలయాపనతో కాలం వెళ్లబుచ్చుతున్నామంటే మనన్ని ఏమనుకోవాలి. అదేమంటే రీకౌంటింగ్, రివ్యూ చేసుకునే అవకాశం ఉందని (అదీ డబ్బులుకట్టి) చెబుతున్నారంటే ఎంత ధైర్యం కావాలి? మూడు లక్షల మంది విద్యార్థులు ఈ క్యాటగిరీలోకి నెట్టివేయబడిన అధికారులను ముందుగా సస్పెండ్ చేసి తర్వాతనే మిగతా చర్యలు చేపట్టాలి. అంతకన్నా ముఖ్యంగా దీనికి బాధ్యత వహిస్తూ విద్యామంత్రి రాజీనామా చేయాలి. ఇంత జరుగుతున్నా ధైర్యంగా కాలర్ ఎత్తుకుని విద్యామంత్రి ఎలా తిరుగుతాడు? అదేమంటే ఇదంతా ప్రతిపక్ష పార్టీలు కావాలని చేస్తున్న రాజకీయంగా విద్యామంత్రి మాట్లాడటం సిగ్గుచేటు. ఇంతవరకు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటంలేదు? మూడు లక్షల మంది విద్యార్థుల ఆవేదన స్పందించాల్సినంత సమస్యగా ముఖ్యమంత్రికి అనిపించటంలేదా? లేక మిగతా ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే పనిలో తీరికలేకుండా వున్నాడా?
ఇంతమంది ఆవేదన ఒక ఎత్తు అయితే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటి? రేపొద్దున ఈ చనిపోయిన విద్యార్థుల మార్కుల్లో అవకతవకలు జరిగినట్లు బయటపడితే వారి చావుకు ఎవరు బాధ్యులు? ఈ యంత్రాంగం, దాన్ని నిర్వహించే మంత్రి బాధ్యులు కాదా? అప్పుడు ఈ ప్రాణాలు గాలిలో కలవటానికి కారణమైన వీళ్ళను ఏ చట్టం కింద శిక్షించాలి? ఆత్మహత్యలు పరిష్కారం కాదని , వాటిని ఏవిధంగానూ ప్రోత్సహించకూడదని అందరం చెబుదాము. ఇప్పుడది కాదు . పోయిన ప్రాణాలు కేవలం అవకతవకలవలన అనితేలితే ఈ ఆత్మహత్యలను హత్యలుగా పరిగణించి బాధ్యులను శిక్షించాల్సిన అవసరం వుంది.
ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి దీనిపై స్పందించినట్లు తెలుస్తుంది. ముందు ముందు ఎలా మెరుగైన వ్యవస్థను తీసుకురావాలనే విషయం పై సలహాలు , సూచనలు చేశారు. కానీ బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. అంటే మసిపూసి మారేడుకాయ చేసినట్లుగా వుంది. సమస్యను తక్కువచేసి చూపటం దారుణం. అధికారంలోని పెద్దలకు ఎటువంటి ప్రమేయం లేదనుకోవాలంటే ముందుగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుంది. ముందు ముందు ఎవరూ ఇటువంటి తప్పులు చేయకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. అలా కానీ పక్షంలో ముఖ్యమాటలు కంటితుడుపు చర్యలుగానే భావించాల్సి ఉంటుంది.
Please submit your comments.