ఆంధ్ర రాష్ట్ర మేధావులకు ఏమయ్యింది?

ఆంధ్ర రాష్ట్ర మేధావులకు ఏమయ్యింది?

ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమయ్యింది? ఎందుకు రాష్ట్రాన్ని రావణా కాష్టం చేస్తున్నారు? రాజకీయ నాయకుల కపట నాటకాలకు ఎందుకు బలవుతున్నారు? దీనికి విముక్తి లేదా? విభజన సమయం లో ఆవేశానికి పోయి అనర్ధాలు కొని తెచ్చుకున్నారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత కూడా తెలివిగా వ్యవహిరించకుండా మూర్ఖంగా ఉండటంతో రావాల్సినవి రాకుండా పోయాయి. ఇప్పుడు మళ్ళీ అదే ధోరణిలో వెళుతున్నారు. రాజకీయనాయకుల ఆటలో పావులుగా మారుతున్నారు. ఇదంతా ఆవేదనతో రాస్తున్నది. ఒకే విషయాన్ని రాజకీయ నాయకులు అనుకూలంగా , వ్యతిరేకంగా ప్రేరేపించగలరు. ప్రత్యేక హోదా పై పిల్లి మొగ్గలు ప్రత్యక్షంగా చూసాం. ఆంధ్ర ప్రజలు ఆవేశపరులని దేశం అనుకునే స్థాయికి మనం రాష్ట్రాన్ని తీసుకెళ్లొద్దు. ఒక్కోసారి అర్ధ సత్యాలను సత్యాలుగా,అబద్ధాలుగా మార్చే సత్తా ఈ రాజకీయ నాయకులకు వుంది. మరి దీనికి మనమెందుకు బలి కావాలి?

ఈ మొత్తం రాజకీయ క్రీడలో మేధావుల పాత్ర ఎంత? మీడియా ఏ పాత్ర పోషించింది? ఓ విధంగా చెప్పాలంటే రాజకీయనాయకులు, మేధావులు,మీడియా కలిసికట్టుగా ఈ క్రీడని రంజుగా నడిపిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకు మేధావులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఒకటి భావజాలమనిపిస్తుంది. ఆంధ్రాలో మేధావులు ఉదారవాదులు,వామపక్షవాదులు అధికం. దానికి ఎన్నో చారిత్రిక కారణాలున్నాయి. అంతవరకూ ఓకే . ఒక్కో రాష్ట్రం లో ఒక్కో పద్దతి వుంది. సమస్యల్లా భావజాలం సమస్యను సమస్యగా చూడనివ్వదు. ఇది సాంప్రదాయ వాదులకు కూడా వర్తిస్తుంది. వాళ్ళు అధికంగా ఉండివుంటే ఇంకోరకమైన సమస్యలు వచ్చివుండేవి. ఇప్పుడు సమస్యల్లా మన రాష్ట్ర మేధావులకు మోడీ బద్ధ శత్రువు. ఆయన ఏమి చేసినా ముందు వ్యతిరేకించి తర్వాత దానికి కారణాలు వెతుకుతారు. ఏ భావజాలమైనా పరిణితి తో ఆలోచించక పొతే ఒక్కోసారి నిజాన్ని మానసికంగా ఆమోదించలేరు. మేధావుల్లో రెండు రకాలు.ఒకటి వాళ్ళు నమ్మిన భావజాలంతో సంబంధం లేకుండా సమస్యను సమస్యగా చూడటం, రెండోది అవతల నిజమున్నా అది వీరి వ్యతిరేక భావజాల మనుషుల్లోంచి వచ్చింది కాబట్టి రంధ్రాన్వేషణ చేయటం. ఈ రెండు రకాల మేధావులు ఉదారవాదుల్లోను,సంప్రదాయవాదుల్లోను వుంటారు. సమస్యల్లా రెండోరకం మేధావులతోనే. ఇక రెండో కారణం వీళ్ళు ఒకరి పై ఒకరు పోటీపడి సమస్యను జటిలం చేయటం, రెచ్చగొట్టటం . రాష్ట్ర ప్రజల ముందు ఛాంపియన్లుగా ఉండాలనే తాపత్రయం.

ఇకపోతే ఇందులో మీడియా పాత్ర ఎంత. నిజంచెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో మీడియా పాత్ర జుగుప్సాకరం. ఎక్కువభాగం చానళ్ళు ఒకే పార్టీ కి బాకా ఊదటం. వార్తలని ఆ పార్టీ కి అనుకూలంగా మలుచుకోవడంలో సిద్ధహస్తులు. ఇంకొన్ని చానళ్ళు పార్టీలకు అనుబంధంగా ఉండటం. వెరసి వార్తను వార్తగా ప్రచురించే చానళ్ళు బహు తక్కువ. ఒక విషయాన్ని అర్ధసత్యాలతో నిరంతరంగా ప్రచారం చేస్తూ అనుకూల మేధావులతో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటం ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఇదే ఆంధ్ర రాజకీయ చిత్రపఠం. విభజన సమయం నుంచి ఇప్పటిదాకా ఇదే పాటర్న్ కొనసాగుతుంది.

ఇప్పుడు వర్తమాన విషయాలు ప్రస్తావించుకుందాం. మొన్న అంటే 27 వ తేదీ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ప్రకటించాడు. వెంటనే ఆంధ్రా లో ఆనందాతిరేకాలు మిన్నుముట్టాయి. ఎప్పటినుంచో ఆశతో ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రజలు ఈ ఊహించని పరిణామాన్ని సంతోషంతో ఆస్వాదించారు. అయితే అది కొద్దిసేపటి తర్వాత రాజకీయనాయకుల ముఖ్యంగా తెలుగుదేశం నాయకుల సన్నాయినొక్కులతో అనుమానబీజాలు నాటారు. ఇంకొచెంసేపు అయ్యినతర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోగానే పూర్తి నిరసన గా మారింది. వచ్చిన సంతోషం ఆవిరి అయిపొయింది. ఆంధ్రకు అన్యాయం జరిగిందనే భావన కలిగించడంలో విజయవంతమయ్యారు. ఇది ఎప్పటిలాగే ఓ పద్ధతి ప్రకారం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉండివుంటే భావన వేరే విధంగా ఉండేది. అంటే ఒకే విషయాన్ని మంచిగా, చెడుగా కూడా వర్ణించే సత్తా మన మీడియా కి ,మేధావులకు, రాజకీయనాయకులకు వుంది. దురదృష్టవశాత్తు ప్రజలు అదె వరవడి లో కొట్టుకు పోతున్నారు. అందుకే ఓ రాష్ట్రమా, ప్రజలా ఎప్పటికి ఈ మేకపోతు రాజకీయనాయకుల నిజ స్వరూపాన్ని గ్రహిస్తారు? ఆ రోజు ఎంత దూరంలో వుంది?

రైల్వే జోన్ పై విశ్లేషణ

విశాఖ కేంద్రంగా ప్రకటించిన జోన్ 18వది. ఇంతకు ముందు 17 జోన్లు వున్నాయి. అందులో ఒకటి కలకత్తా మెట్రో జోన్. అది తీసేస్తే పదహారు కిందే లెక్క . ఇది మన విభజన చట్టంలో పొందుపరచ బడింది. కానీ ఖచ్చితంగా ఇవ్వాలని లేదు. పరిశీలించామని వుంది. ఆ తర్వాత జరిగిన పరిణామం లో ఇందుకోసం నియమించిన కమిటీ సానుకూల నివేదిక ఇవ్వలేదు. అయినా అన్ని పార్టీలు ఒత్తిడిచేయటం కేంద్ర ప్రభుత్వం కూడా నివేదికను ఆధారం చేసుకొని చేతులు దులుపుకోకుండా పెండింగ్ లో ఉంచటం ఓ విధంగా మనకు ఉపయోగపడింది. ఇన్నాళ్ల తర్వాతైనా జోన్ ని ఆమోదించినందుకు ముందుగా ప్రభుత్వానికి అభినందనలు తెలియజేద్దాం. కొంతమంది ఇది రాజకీయ కారణంగా చివరలో తీసుకున్న చర్యగా కొట్టిపారేస్తున్నారు. దీన్ని మనం రెండో కోణం నుంచి కూడా చూడొచ్చు. రాజకీయమే లేకపోతె నివేదిక ఆధారంగా ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థ లో రాజకీయం చేయని పార్టీ ఒక్కటీ లేదు. అయితే అంతిమంగా మనకు మేలు జరిగిందా అంటే జరిగిందనే చెప్పాలి. ఎప్పట్నుంచో కోరుకున్న రైల్వే జోన్ వచ్చినందుకు ముందుగా సంతోషిద్దాం. ఇకపోతే చంద్రబాబు నాయుడు ప్రధాన ఆరోపణలేమిటి? ఒకటి వాల్తేర్ డివిజన్ మొత్తం ఇందులో కలపలేదు. రెండు, మనకు చెందిన పలాస-ఇచ్చాపురం ఒరిస్సా లో కలిపారు. మూడు, మనకొచ్చే ఆదాయం ( అంటే మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం) కోల్పోయాము. ఇందులో నిజానిజాలు ఎంతో ఒక్కసారి పరిశీలిద్దాం:

అసలు రైల్వే జోన్లు రాష్ట్రాలు బట్టి విభజించబడవు. అందుకే విభజన చట్టం లో వున్నా కమిటీ నివేదిక కీలకంగా మారింది. ఇప్పటికీ 16 రాష్ట్రాలకు రైల్వే జోన్లు లేవు. కొన్ని రాష్ట్రాల్లో ఒకటికి మించి వున్నాయి. దీనికి చారిత్రక కారణాలున్నాయి. పెద్ద రాష్ట్రమైన గుజరాత్ కి రైల్వే జోన్ లేదు.కేరళ రాష్ట్రానికి లేదు. మరి ఈ పదహారు రాష్ట్రాలు కేంద్రం పై దుమ్మెత్తిపోయాలా? రైల్వే సంస్థ చారిత్రకంగా పరిపాలనాయూనిట్లు గా పనిచేస్తుంది కానీ రాష్ట్రాలను బట్టి కాదు. ఇక జోన్ సరిహద్దులు రాష్ట్ర సరిహద్దులతో సరి తూగవు. పరిపాలనా సౌలభ్యం ప్రధానంగా సరిహద్దులేర్పడతాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ జోన్ లో మహారాష్ట్రకు చెందిన నాందేడ్ డివిజన్ వుంది. అలాగే మన గుంటూరు డివిజన్ లో తెలంగాణా ప్రాంతముంది . హైదరాబాద్ డివిజన్ లో కర్నూల్ తో సహా ఆంధ్ర ప్రాంతముంది. మన పుట్టపర్తి బెంగుళూరు డివిజన్ లో వుంది.ఈ విషయాలు తెలిసీ ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టటం లో ఔచిత్యమేంటి? రెండోది మన ఆదాయం ఒరిస్సా కు ధారాదత్తం చేసారని. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఏ జోన్ అయినా ఆదాయం మొత్తం రైల్వే కి సంబంధించింది, రాష్ట్రానికి కాదు. ఈ విషయం తెలిసీ చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొట్టటం దారుణం. ఇక మూడోది , వాల్తేర్ డివిజన్ చీల్చారని. ఇదికూడా కావాలనే రెచ్చగొడుతున్నారు. జోన్ రావాలంటే ఎక్కడో ఒకచోట రాజీ పడాల్సి ఉంటుంది. వాస్తవానికి నాలుగు సంవత్సరాలు బీజేపీ తో కలిసున్నప్పుడు ఇదే ఫార్ములా ను కొంచెం అటూ ఇటూ గా లాబీ చేసినసంగతి రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతదేశమంటే ఆంధ్ర ఒక్కటే కాదు. వాల్తేర్ కేంద్రం గా ఆంధ్ర కి జోన్ వస్తే చాలని నిన్నటి దాకా అందరూ భావించారు. ఇప్పుడు బీజేపీ తో కలిసి లేరు కాబట్టి ప్రజలను రెచ్చగొడుతున్నారు. అదే కలిసుంటే ఇదెంత అద్భుతమో ఇన్నాళ్లకు చిరకాల వాంఛ నెరవేరిందని సంబరాలు చేసుకునే వాళ్ళు.

ఇక మీడియా విషయానికొస్తే ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో చూద్దాం. ఆంధ్ర లో అన్యాయం జరిగిందని ఒకవైపు ప్రచారం చేస్తూ రెండోవైపు హైదరాబాద్ ఎడిషన్ లో ఒక ప్రముఖ దినపత్రిక ( చంద్రబాబు నాయుడు కి అతి సన్నిహితం గా వుండే ) తెలంగాణ కు తీరని అన్యాయం జరిగిందని రెచ్చగొడుతూ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. దక్షిణ మధ్య రైల్వే ఆదాయం లో సగానికి సగం ఈ ఆంధ్ర జోన్ కి బదలాయింపు జరిగిందని వాపోయింది. ఇది వీటి నైజం. అటు ఆంధ్ర ప్రజలను ఇటు తెలంగాణ ప్రజలను రాష్ట్రాలకు సంబంధం లేని ఆదాయం తో ముడిపెట్టి రెచ్చగొట్టటం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజలు ఈ విషప్రచారం నుండి బయటకు రావాలి. ఇంతకీ ఈ రైల్వే జోన్ వలన ఏమిటి ప్రయోజనం?

1 . ముఖ్యంగా ప్రయాణీకుల రైళ్ల విషయం లో రాష్ట్ర అవసరాలను దృష్టి లో పెట్టుకొని కొన్ని రైళ్లు ప్రవేశ పెట్టె అవకాశముంది. ఇంతకు ముందు వాల్తేర్ భువనేశ్వర్ జోన్ లో ఉండటం వలన వైజాగ్ నుంచి మొదలయ్యే రైళ్లను భువనేశ్వర్ వరకు పొడిగించటం జరిగింది. ఇప్పుడు వైజాగ్ మన జోన్ లో ఉండటం వలన ఆ విషయం లో మనకు మేలు జరగొచ్చు.

2 . జోన్ కి సంబంధించి అభివృద్ధి పనుల్లో స్థానిక అవసరాలను బట్టి నిర్ణయాలు జరగొచ్చు.

3 . జోనల్ ముఖ్య కేంద్రం ఉండటం వలన కొన్ని అదనపు ఉద్యోగాలు రావొచ్చు.

4 . రాష్ట్రానికి సంబందించిన ప్రోజెక్టుల విషయం లో మరింత వివరంగా శ్రద్ధగా కేంద్రానికి నివేదించవచ్చు.

వాస్తవానికి జోన్ తో ఏదో అద్భుతాలు జరుగుతాయని భావించాల్సిన పనిలేదు. పైన చెప్పిన విషయాల్లో ముఖ్యంగా ప్రయాణికుల రైళ్ల విషయంలో మాత్రం మేలు జరుగుతుంది. అలాగే వైజాగ్ పోర్ట్ సిటీ కాబట్టి వాల్తేర్ కి ప్రాముఖ్యత ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి రాజకీయనాయకుల మాయమాటలకు మోసపోకండి. జోన్ వచ్చినందుకు అందరూ సంతోషంగా ఆహ్వానిద్దాం.

ఆంధ్ర లో రాజకీయాలు భ్రష్టు పట్టాయి

అవినీతి విషయం లో కూడా మనిషిని బట్టి వైఖరులు మారిపోతూవుంటాయి. అవినీతి వ్యాపారవేత్తలపై సిబిఐ దాడి చేస్తే అది రాజకీయ కక్షసాధింపు చర్య గా ప్రచారం చేస్తున్నారు. అదే ప్రత్యర్థులపై మాత్రం అవినీతి పరులు కాబట్టి కేసులెదుర్కుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. మనకొక నీతి ఇంకొకరికి వేరేనీతి. ఇందులో మన మీడియా పాత్ర అమోఘం! మరి మేధావులు ఏం చేస్తున్నారు? అందుకే ఆంధ్ర రాజకీయాలు బ్రష్టు పట్టినాయని చెప్పేది.

అలాగే చివరకు పుల్వామా దాడి విషయం లోనూ అదే జరిగింది. ఎన్నికల ముందే దాడి ఎందుకు జరిగిందని మమతా అంటే మోడీ ఎంతకైనా సమర్థుడని చంద్రబాబు నాయుడు అన్నాడు. వాళ్ళు మోడీ మీద వ్యతిరేకతతో సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడారని మరచిపోయారు. ఇది చాలా దారుణం. దీనిపై మేధావులు, మీడియా ఖండించి ప్రజలకు ఎంత తప్పు చేసారో చెప్పక పోవటం క్షమించరాని నేరం. అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న సంప్రదాయ పార్టీలకు భిన్నంగా మాట్లాడుతున్నాడని అనుకుంటున్నతరుణంలో రెండు సంవత్సరాల కిందనే ఈ యుద్ధానికి ప్లాన్ చేశారని చెప్పటం దారుణం. అలాగే "సాక్షి" ఆధారం లేని చంద్రబాబు నాయుడు -పవన్ కళ్యాణ్ రహస్య ఒప్పందం జరిగిందని చెప్పటం కూడా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో తెలుస్తుంది.

చివరగా చెప్పేదేంటంటే ఆంధ్ర రాజకీయాల్లో మేధావులు, మీడియా దారితప్పి ప్రయాణిస్తున్నాయని చెప్పకతప్పదు. ఇప్పటికైనా వీళ్ళు మేలుకొని ప్రజాపక్షం వహిస్తారని ఆశిద్దాం.

more updates »