చంద్రబాబు నాయుడు దేశానికి క్షమాపణ చెప్పాలి

భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో checks and balances లేకపోతే ఆ వ్యవస్థే కుప్పకూలే ప్రమాదముంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జుగుప్స కలుగుతుంది. పుల్వామా సంఘటన జరిగి వారం కూడా కాలేదు అప్పుడే రాజకీయాల వికృత రూపం బయటకొచ్చింది. మన రాజకీయ నాయకులకు దేశం కన్నా వాళ్ళ రాజకీయ క్రీడ నే ప్రధానమైంది. ఒకవైపు పుల్వామా ఘటన పై సైన్యానికి, ప్రభుత్వానికి మద్దత్తు తెలుపుతున్నామని చెబుతూనే రెండో వైపు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుతూ వున్నారు. సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. కొద్ది రోజులైనా ఓపికపట్టలేని ఈ రాజకీయ నాయకులను చూస్తే ఏమనాలో అర్ధం కావటంలేదు. ఇంతకన్నా ప్రమాదకర ధోరణి అసలు ఈ సంఘటన పై అనుమానాలు వ్యక్తం చేయటం. మొదటగా మమతా బెనర్జీ బాధ్యతారాహిత్యంగా ఈసమయంలో ఈఘటన జరగటంపై అనుమానం వ్యక్తం చేసింది. దానికి చెప్పిన కారణాలు విశ్వసనీయంగా లేవు. స్థానిక బీజేపీ నాయకులు జాతీయ జెండాలు పట్టుకుని రాత్రిళ్ళు వీధుల్లో తిరుగుతూ రెచ్చగొడుతున్నారని. తాను మాట్లాడిందాంట్లో ఇదంతా ఎన్నికలకోసం మోడీ కుట్ర పన్నాడనే అర్ధం వచ్చేలా వుంది. అయితే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకం కారణంగా తర్వాత పార్టీ ద్వారా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మమతా మాట్లాడింది తీవ్రమైన అభియోగం. ఇది మోడీని దృష్టిలో పెట్టుకొని అన్నా అది సైన్యం పై అభియోగం మోపినట్లయ్యింది. సైన్యం 'ఈ కుట్ర ' లో భాగస్వామ్య మయినట్లు మన సైన్యాన్ని అనుమానించినట్లయ్యింది. ఇది చాలా తీవ్రమయిన ఆరోపణ. ఈ ఆరోపణ తీవ్రతను అర్ధం చేసుకున్న మమతా నష్ట నివారణ చర్యల్ని చేపట్టింది. ఇంతవరకు బాగానే ఉందనుకుంటే ఎంతో రాజకీయ అనుభవం ఉందనుకుంటున్న చంద్రబాబు నాయుడు ఈ ఆరోపణల్ని ఇంకొంచెం ముందుకు తీసుకుపోవాలనుకున్నాడు. పనిలో పనిగా దీనిని 2002 గుజరాత్ అల్లర్లతో కలిపి మోడీని బద్నామ్ చేసే పని మొదలుపెట్టాడు. కానీ ఇది తనకు self goal అవుతుందని గ్రహించలేకపోయాడు. తాను చేస్తుందని తప్పు అని , దేశ భద్రతకు హాని చేస్తుందనీ గ్రహించలేక పోయాడంటే నమ్మలేకపోతున్నాం. తనకు మోడీ మీదున్న వ్యతిరేకత చివరకు దేశ భద్రత నష్టపోయినా పర్వాలేదు, మోడీ ప్రతిష్ట మసకబారితే చాలు అనే ధోరణికి దారి తీసింది. ఇది క్షమించరాని తప్పు. తక్షణం చంద్రబాబు నాయుడు దేశానికి క్షమాపణ చెప్పాలి. ఆయన ఆరోపించింది మోడీని కాదు సైన్యాన్ని అని తెలుసుకోవాలి. మనిషి frustation లో వున్నప్పుడు వివేచన కోల్పోతాడు. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అదే. ఇంత దారుణంగా దేశాన్ని, సైన్యాన్ని అవమానిస్తుంటే మన ప్రచార మాధ్యమాలు ఎందుకు ఖండించలేదు? ఎందుకు సంపాదకీయాలు రాయలేదు? అంటే చంద్రబాబు కోసం దేశం, సైన్యం ప్రతిష్ట మసకబారినా పర్వాలేదని అనుకున్నాయా? ఏమో జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతయినా వుంది. ఇక నిఘా వైఫల్యం గురించి పదే పదే మాట్లాడటం మానుకోవాలి. ఉగ్రవాదుల ఘాతుకాలను, పధకాలను ఎన్నింటినో మన భద్రత సంస్థలు వమ్ము చేసిన సంగతి మరవొద్దు. అన్నిసార్లు గూఢచర్యం సఫలమవుతుందని చెప్పలేం. ప్రతిఅనుభవం నుంచి గుణపాఠం తీసుకుని ఇంకా పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం ఒక్కటే మార్గం. అంతేకాని ఇటువంటప్పుడు వేలెత్తి చూపించటం అంత బాధ్యత అనిపించుకోదు. ఇందులో ఏమైనా మన భద్రత సంస్థల వైఫల్యం ఉందా అనే కోణంలో ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. ఆ పని దానిని చేయనివ్వండి.ఇప్పుడు చేయాల్సింది అందరూ ఒకే త్రాటిపై ఉండి ప్రపంచానికి అందరం ఒక్కటేనని చాటి చెప్పటం. రంధ్రాన్వేషణ చేయటం తక్షణం మానుకోవాలి. అమెరికా ఇటువంటి సమయాల్లో ఎలా ప్రవర్తిస్తుందో చూస్తే మనకు వాళ్లకు వున్నా తేడా అర్ధమవుతుంది. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఒకరంటే ఒకరికి పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది.కానీ రక్షణ విషయాలకొచ్చేసరికి అందరూ ఒక్కటయ్యి ఒకే గొంతుతో మాట్లాడుతారు. కానీ మనకేమయ్యింది? అధికారంలో వున్నపార్టీ కి మరింత బాధ్యత ఉంది. బీజేపీ అధ్యక్షుడు ఈ సమయంలో రాజకీయంగా మాట్లాడివుండాల్సింది కాదు. ఇది కాంగ్రెస్ సర్కార్ కాదు మోడీ సర్కారని మాట్లాడటం బాధ్యతా రాహిత్యమే. అలాగే ప్రతిపక్ష పార్టీల్లోని నాయకులు పాకిస్థాన్ ని విమర్శించటాన్ని తప్పుపట్టటం, కాశ్మీరీ వేర్పాటువాదుల తరఫున వకాల్తా పుచ్చుకోవటం , కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ని లక్ష్యం చేసుకొని మాట్లాడిన పద్దతి ఏమాత్రం సమర్ధనీయం కాదు. ఇప్పటికైనా అన్ని రాజకీయపక్షాలు ఒకతాటిమీదకు వచ్చి దేశంకోసం నిలబడితే ప్రజలు హర్షిస్తారు. లేకపోతే వీళ్లందరినీ ఛీ కొట్టే రోజు దగ్గరలోనే ఉందని మరచిపోవద్దు. చివరిగా మీడియా కి విజ్ఞప్తి. దేశ భద్రత, రక్షణ విషయంలో పార్టీలకు,వ్యక్తులకు అతీతంగా వ్యవహరించండి.
Prev పదవి, డబ్బు మీద వ్యామోహం ఉన్న వ్యక్తి జగన్‌ : మంత్రి ఆనంద్ బాబు
Next రవిప్రకాశ్ కోసం మూడు రాష్ర్టాల్లో గాలింపు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.