ఉగ్రవాదుల అడ్డా పాకిస్తాన్ ని ప్రపంచం శిక్షించాలి

ఉగ్రవాదుల అడ్డా పాకిస్తాన్ ని ప్రపంచం శిక్షించాలి
పాకిస్తాన్ లో ఉన్నన్ని ఉగ్రవాద శిబిరాలు మిగతా అన్ని దేశాల్లో కలిపినా కూడా వుండవు. ఒకటికాదు రెండు కాదు ఎన్ని సంస్థలున్నాయో లెక్కపెట్టటం కష్టం. ఒక్క ఆక్రమిత కాశ్మీర్ లోనే షుమారు 55 దాకా వున్నాయి. అలాగే పెషావర్ కేంద్రం గా వున్నఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్ మొదట్నుంచి ఉగ్రవాదులకు అడ్డా నే . ఇస్లాం తీవ్రవాదానికి సంబందించిన ఏ సంస్థ పేరు చెప్పినా దాని మూలాలు ఈ ప్రావిన్స్ లోనే వున్నాయి. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆఫ్గనిస్తాన్ లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్ లో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టే ఉగ్రవాద సంస్థలను పెంచిపోషిస్తుంది పాకిస్తాన్ . ఆఫ్గనిస్తాన్ లోని తాలిబన్ మూలాలు మొత్తం పాకిస్తాన్ లోనేనని మనందరికీ తెలుసు. జియావుల్ హక్ వీటిని ప్రారంభించి పెంచిపోషించాడు. అప్పుడు వేసిన బీజాలు పెరిగి పెద్దవై ఈ రోజు పాకిస్తాన్ సమాజం లో భాగమైపోయాయి. తాలిబన్ పుట్టుక పాకిస్తాన్ లోనే. ఇక మన కాశ్మీర్ విషయం లో ఎన్నో ఉగ్ర సంస్థలకు మొదట్నుంచి ఆశ్రయం కల్పించి కావాల్సిన అన్ని రకాల సహకారం ఇస్తూవుంది. చైనా లోని జిన్జియాంగ్ ప్రావిన్స్ లోని ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ నుంచే ఉద్భవించాయి. ఇటీవల కాలంలో వాటిని నియంత్రించటానికి పాకిస్తాన్ తో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుందని భావిస్తున్నారు. చివరకు మధ్య ఆసియా దేశాల్లోని తూర్పు టర్కీ ఇస్లామిక్ సంస్థలాంటి ఉగ్రవాద సంస్థలు కూడా పాకిస్తాన్ నుంచే సహాయం పొందుతున్నాయి. అందుకే పాకిస్తాన్ ప్రపంచం మొత్తానికి ఉగ్రవాదులకు కేంద్రమని అన్ని దేశాలు భావిస్తున్నాయి. విశేషమేమంటే పాకిస్తాన్ కి వ్యతిరేకంగా పనిచేసే బలూచిస్తాన్ ఉగ్రవాద సంస్థలు కూడా పాకిస్తాన్ భూభాగం లోనే వున్నాయి. మరి ఇన్ని శిబిరాలకు మూలమైన పాకిస్తాన్ ని ఉగ్ర రాజ్యం గా ప్రకటించటానికి అవరోధాలు ఏంటో తెలియదు. ప్రపంచ రాజ్యాల అవకాశవాద వైఖరి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. చైనా తన జిన్జియాంగ్ ప్రావిన్స్ లో ఇటువంటి దాడులు జరిగితే సహిస్తుందా? అమెరికా తన భూభాగం ఫై దాడిచేసిన వారి మూలాలు ఆఫ్గనిస్తాన్ లో ఉంటే ఏమి చేసిందో చూసాం. అన్ని రాజ్యాలు మన దగ్గరొకొచ్చేసరికి శాంతి ప్రవచనాలు చెబుతున్నాయ్. ఇదే వాళ్లకు జరిగితే ముందు వాళ్ళ పని బట్టి తర్వాతే మాట్లాడేయి. పాకిస్తాన్ ని అన్నిరకాలుగా అష్టదిగ్బంధం చేస్తేనే గాని దిగిరాదు. ప్రస్తుతం పాకిస్తాన్ ఎన్నో అంతర్గత సమస్యలతో సతమమవుతుంది. ఒకవైపు ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రం గా ఉంటే ఆంతరంగిక భద్రతా కూడా ఏమి బాగాలేదు. బలూచిస్తాన్ లో స్వతంత్రం కోసం పోరాడుతున్నారు. వాళ్ళ వనరులు చైనా, పాకిస్తాన్ దోచుకుంటున్నాయని తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. అలాగే ఆఫ్ఘన్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం , ఫాతా (FATA ) లో ఫష్టున్లు దాదాపు పది లక్షల మంది పాకిస్తాన్ చేసిన ప్రక్షాళన బారినిపడి నిరాశ్రయులై ఆగ్రహంతో వున్నారు. జిల్జిత్-బాల్తిస్తాన్ లో స్థానిక షియా తెగలకు వ్యతిరేకంగా సున్నీలను తరలించటం ఫై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కరాచీ లోని భారత్ నుంచి విభజన సమయం లో వలసవచ్చిన ముజాహిర్లు తమని రెండో తరగతి పౌరులు గా చూస్తున్నారని ఆందోళనలో వున్నారు. ఈ రోజుకి ఆఫ్ఘన్-పాకిస్తాన్ సరిహద్దు డ్యూరాండ్ రేఖను సరిహద్దుగా ఆమోదించటానికి ఆఫ్ఘన్ దేశం సిద్ధంగా లేదు. ఎంతోమంది ఫష్టున్లు వాళ్ళ జాతిని అన్యాయంగా రెండుగా చీల్చారని వాపోతున్నారు.దేశం లో షియా లకు వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థలు దాడులు చేసి ఎంతో మందిని చంపటం చూస్తూనే వున్నాం. ఇప్పటికే అహమ్మదీయులను ముస్లింలుగా పరిగణించరాదని పాకిస్తాన్ నిర్ణయించింది. ఇస్లామిక్ రాజ్యం పేరుతొ మైనారిటీ మతస్థులైన క్రైస్తవులు వ్యాఖ్యానించారని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇలాచెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ ఎన్నో తీవ్ర సమస్యలతో సతమత మవుతుంది. కాబట్టి పాకిస్తాన్ ని ఇబ్బందిపెట్టటానికి ఎన్నో మార్గాలున్నాయి. అంతర్జాతీయ సమాజంలో ఇప్పటికే పాకిస్తాన్ ఏకాకి అయ్యింది. బాలాకోట్ ఉగ్రవాద శిబిరం ఫై దాడితో ప్రపంచం మొత్తానికి మనం సాక్ష్యం ఇచ్చినట్లయింది. ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రవాదులను అదుపులో పెట్టె చర్యలు తీసుకోకపోతే తక్షణం పాకిస్తాన్ ని ఐక్యరాజ్యసమితి ఉగ్ర దేశం గా ప్రకటించి ఆ దేశాన్ని బ్లాక్ లిస్టు లో పెట్టాలి. మసూద్ అజార్ ని శిక్షించాలి. అప్పటిదాకా పాకిస్తాన్ ఫై మనం ఒత్తిడి తీసుకువచ్చే చర్యలు చేపడుతూనే ఉండాలి. విశ్రాంతి ప్రకటించ కూడదు. అప్పుడే ప్రజలు శాంతిస్తారని గుర్తుంచుకోవాలి.
more updates »