చెలరేగిన నబి...ఒకే ఓవర్లో మూడు వికెట్లు

Article

కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అఫ్గనిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ప్రదర్శన గురించి మనందరికీ తెలిసిందే. కీలక సమయాల్లో బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించే సత్తా అతనిలో ఉంది. తాజాగా ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో నబీ సంచలన ప్రదర్శన చేశాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి లంకను కష్టాల్లో పడేశాడు. 22వ ఓవర్లో ముగ్గురు ఆటగాళ్లను పెవిలియన్ పంపి అఫ్గాన్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఓవర్ రెండో బంతికి క్రీజులో కుదురుకున్న తిరుమానెను బౌల్డ్ చేశాడు.. తర్వాత క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్(2) రెండు రన్స్ చేసి.. మూడో బంతికి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రహ్మత్ చేతికి చిక్కాడు. ఈ దశలో మైదానంలోకి వచ్చిన సీనియర్ ఆల్‌రౌండర్ మాథ్యూస్(0) తాను ఎదుర్కొన్న తొలి బంతికి పరుగులేమీ చేయలేదు. ఐతే అనూహ్యంగా ఆడిన తర్వాతి బంతి మళ్లీ ఫస్ట్‌స్లిప్‌లోనే ఉన్న రహ్మత్ చేతికే చిక్క‌డంతో మాథ్యూస్ నిరాశ‌గా మైదానాన్ని వీడాడు.

ఆరంభంలో ఓపెనర్లు మంచి శుభారంభం అందించినప్పటికీ తర్వాత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో టెయిలెండర్లపై ఒత్తిడిపెరిగింది. దురదృష్టవశాత్తు హామీద్ వేసిన తర్వాతి ఓవర్లోనే ధనంజయ డిసిల్వా(0) కీపర్ మహ్మద్ షెజాద్ చేతికి చిక్కాడు. రెండు ఓవర్లలోనే లంక నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఒకానొక దశలో 144/2తో మంచి స్థితిలో ఉన్న లంకేయులు 149/5తో భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. ప్రస్తుతం 24 ఓవర్లకు 5 వికెట్లకు లంక 152 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా(72) ర‌న్స్‌తో మ‌రో ఎండ్‌లో ఒంట‌రి పోరాటం చేస్తున్నాడు.

Prev ఇంగ్లాండ్, పాకిస్థాన్ ఆటగాళ్లకు జరిమానా
Next ఆఫ్ఘనిస్థాన్‌పై శ్రీలంక అలవోక విజయం
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.