ఆఫ్ఘనిస్థాన్‌పై శ్రీలంక అలవోక విజయం

Article

ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం కార్డిఫ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక అలవోకగా విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 36.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌట్ అయింది. 144/2తో పటిష్టంగా ఉన్న శ్రీలంకను మొహమ్మద్ నబీ దారుణంగా దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి శ్రీలంక వెన్ను విరిచాడు.

శ్రీలంక ఆటగాళ్లలో కెప్టెన్ దిముత్ కరుణరత్నె 30, కుశాల్ పెరీరా 78, లహిరు తిరుమన్నె 25 పరుగులు చేశారు. ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ కాగా, మరో ముగ్గురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. దీంతో శ్రీలంక ఇన్నింగ్స్ 201 పరుగుల వద్ద ముగిసింది. శ్రీలంక ఇన్నింగ్స్ 33 ఓవర్ల వద్ద మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగలడంతో గంటకుపైగా ఆట నిలిచిపోయింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఆఫ్ఘనిస్థాన్ విజయ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 187 పరుగులకు కుదించారు.

ఓ మాదిరి విజయాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. శ్రీలంక బౌలర్లు నువాన్ ప్రదీప్, లసిత్ మలింగ ధాటికి కకావికలైంది. వరుసపెట్టి వికెట్లు కోల్పోతూ 152 పరుగులకు ఆలౌటై 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జజాయ్ 30, నజీబుల్లా జద్రాన్ 43, కెప్టెన్ గుల్బాదిన్ నైబ్ 23 పరుగులు చేశారు. మిగతా ఎవరూ పట్టుమని 20 పరుగులు కూడా చేయలేకపోయారు.

నాలుగు వికెట్లు తీసి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన నువాన్ ప్రదీప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంకకు ఇది తొలి విజయం కాగా, ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఆఫ్ఘాన్ ఓడింది. నేడు సౌతాంప్టన్‌లో భారత్-దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ జరగనుంది.

Prev చెలరేగిన నబి...ఒకే ఓవర్లో మూడు వికెట్లు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.