ఎన్నికల వాతావరణం ఎలా వుంది?

ఎన్నికల వేడి పుంజుకుంది. పూర్తి పీక్ లోకి వచ్చింది. ఇప్పటినుంచి దాదాపు రెండు నెలలు దేశం యావత్తు ఎన్నికల జ్వరం తో ఊగిపోతోంది. అంటే ఈ రెండు నెలలు అభివృద్ధి పనులు కుంటు పడతాయి. ఆధునిక ప్రపంచంలో ఆరవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ రెండు నెలలు ఎటువంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అంటే ఆమేరకు మనం వెనకపడినట్లే లెక్క. వచ్చే ఎన్నికలకైనా ఈ అంశం ఫై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అతి తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఎంత త్వరగా గుర్తిస్తే దేశానికి అంత మేలు చేసిన వారు అవుతారు. ఇక ఎన్నికల రాజకీయాల్ని ఒక్కసారి పరిశీలిద్దాం.

ఎన్నికల పొత్తులు దాదాపు ఒక కొలిక్కి వచ్చాయి. ఇందులో బిజెపి ప్రతిపక్షం కంటే ముందంజలో వుంది. త్వర త్వరగా పొత్తులు కుదుర్చుకోవటం, అవసరమైన చోట భేషిజాలకు పోకుండా తగ్గి మిగతా పక్షాలను ఇముడ్చుకోవటంలో చాకచక్యంగా వ్యవహరించింది. అదే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తనకే కావాలని పట్టుబట్టడంతో సంప్రదింపులు ఇప్పటిదాకా సాగదీసింది. ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించినట్లయ్యింది. అలాగే ముఖ్యమైన ఉత్తర్ ప్రదేశ్, బెంగాల్ లో మూడు ,నాలుగు ఫ్రంట్ లు గా విడిపోవటం ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా లేవని ప్రజల్లో భావం ఏర్పడినట్లయింది. అందుకే ఈ మొదటి ఘట్టంలో బిజెపి మిగతా పార్టీలకంటే మెరుగ్గావుంది.

ఇకపోతే రెండో ఘట్టం ఎన్నికల ప్రచారం, ఎత్తుగడలు. బిజెపి ప్రధానంగా జాతీయభావం, దేశ భద్రత , అయిదు సంవత్సరాల సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సౌకర్యాల కల్పనలో వేగం, స్థూల ఆర్థికాభివృద్ధిలో విజయాలు అస్త్రాలుగా ఉపయోగిస్తుంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా మోడీకున్న ఇమేజ్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని భావిస్తుంది. కాంగ్రెస్ ఈ అయిదు సంవత్సరాలు పెరిగిన నిరుద్యోగం, గ్రామీణ ఆర్ధిక భారంతో సతమవుతున్న ప్రజానీకం, సమాజంలో మైనారిటీ ల్లో పెరిగిన అభద్రతా భావం ప్రచార అస్త్రాలుగా ఎన్నుకుంది. వీటితోపాటు ప్రియాంకా గాంధీ చరిష్మా కొత్త ఆశాకిరణం గా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఇవి ఇప్పటికీ అత్యంత పాపులారిటీ లో వున్న మోడీ ని ఢీ కొట్టటానికి సరిపోవని , ముఖ్యంగా పుల్వామా, బాలాకోట్ సంఘటనల తర్వాత ప్రజల ఆలోచనలు మారిన నేపథ్యంలో మోడీ ప్రభావాన్ని అడ్డుకోవటం సాధ్యంకాదని అంచనా వేసింది. అందుకే ప్రజల ఆలోచనల్ని మార్చే బ్రహాస్త్రం ఏదయినా తీసుకొస్తే తప్పితే మోడీ విజయాన్ని ఆపలేమని నిర్ధారణకు వచ్చింది. ఆ బ్రహ్మాస్త్రమే న్యాయ్ గా పిలవబడే కనీస ఆదాయ గ్యారంటీ పధకం. న్యాయ్ తో తమ ఆశలు చిగురిస్తాయని రాహుల్ గాంధీ,కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇది ఎంతవరకు గేమ్ చేంజర్ గా ఉపయోగ పడుతుందో పరిశీలిద్దాం.

మొదటిగా ఈ పథకంపై వున్న అస్పష్టత, అనుమానాలపై చర్చించుకుందాం. రాహుల్ గాంధీ ఇచ్చిన మొదటి ప్రెస్ సమావేశం లో ఇది టాప్ -అప్ పథకంగా చెప్పాడు. తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇది ఖచ్చితమైన మొత్తంగా ప్రకటించాడు. అంటే వాళ్ళల్లో ఒకరికొకరికి పొంతనలేని ప్రకటనలతో సరిఅయిన గ్రౌండ్ వర్క్ చేయలేదనే భావం కలిగించారు. ఇది జరిగివుండాల్సింది కాదు. రెండోది ఈ రోజుకూ వనరుల సమీకరణ ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వలేదు.అంటే దీన్ని ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వున్న ఆతృతలో సగం కూడా ఈ పధకం ఆచరణ సాధ్యమని , దానికి కావాల్సిన భూమికను తయారుచేసి ప్రజలముందు పెట్టలేకపోయారు. నిజంగా ఈ పధకం అమలుచేయాలంటే ఒక్కటే మార్గం ఇప్పుడున్న సబ్సిడీలను క్రమబద్దీకరించటం . ఆ మాట చెప్పే ధైర్యం రాహుల్ గాంధీ చేయలేకపోతున్నాడు. వాస్తవానికి ఈ పధకం రూపొందించిన వ్యక్తి నెలకు రెండున్నర వేలు మాత్రమే సూచించినట్లు తెలిసింది. ఇవన్నీ చూస్తే పథకంపై ఆర్ధికవేత్తలకు, ప్రజలకు ఇప్పటికీ పూర్తి నమ్మకం కుదరటంలేదు.

రెండోది, ఒకవేళ నిజంగా ఈ పధకం ఆచరణ సాధ్యమేనని అనుకున్నా ఇది కాంగ్రెస్ ఆశలను ఎంతవరకు చిగురిస్తుందనేది పరిశీలిద్దాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాలకు పోటీ చేసే పరిస్థితి లేదు. కొన్ని రాష్ట్రాల్లో తన ఉనికిని కాపాడుకోవటానికే పోటీ చేస్తున్నట్లు కనబడుతుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లో పోటీ ప్రధానంగా బిజెపి , బీఎస్పీ-ఎస్పీ కూటమి మధ్యనే ఉంటుంది. అక్కడ 80 స్థానాల్లో ఈ పధకం ప్రభావం వలన గెలిచే పరిస్థితి ఉండదు. రెండు ప్రధాన కూటముల్లో ఏదోఒకటి గెలవటానికే ఉపయోగపడుతుంది. విశ్లేషకుల అంచనా ప్రకారం ఎస్పీ -బీఎస్పీ కూటమి కి నష్టం జరిగి బిజెపి లాభపడే అవకాశముంది. పశ్చిమ బెంగాల్ లో ఇప్పటి అంచనాల ప్రకారం కాంగ్రెస్ నాలుగో శక్తి గా వుంది. ఈ పధకం వలన పెద్దగా ప్రయోజం లేదు. ఇకపోతే తమిళనాడు,కేరళ , పంజాబుల్లో ఈ పథకంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు అధిక స్థానాలు గెలుచుకుంటాయని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్ , హర్యానా , ఝార్ఖండ్ లో దీని ప్రభావంపై ఓ అంచనాకు రావాల్సి వుంది. ఇప్పటివరకు వున్న అంచనాలప్రకారం ఈ రాష్ట్రాల్లో బిజెపికి , ముఖ్యంగా మోడీ కి అనుకూల పవనాలు వీస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ పధకం ఎంతవరకు గేమ్ చేంజర్ గా ఉపయోగపడుతుందో చెప్పలేము. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఈశాన్య భారతం లో నిర్మాణపరంగా బలహీనంగా వున్న దశలో ఇది ఈ రాష్ట్రాల్లో ఎటువంటి ప్రభావం చూపించదు.

మొత్తం మీద దేశవ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ బలహీనంగా ఉండటం బిజెపి కి కలిసివచ్చే అంశమని చెప్పాలి. అలాగే బాలాకోట్, మిషన్ శక్తి తర్వాత మోడీ బలమైన నాయకుడుగా ప్రజల్లోకి వెళ్లిందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ఈ రోజుకి లోక్ సభ ఎన్నికలు మోడీకి అనుకూలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా 55 రోజులు వున్నాయి కాబట్టి పరిణామాలు ఎలాఉంటాయో ఇప్పుడే అంచనా వేయటం కష్టం. ముఖ్యంగా ప్రియాంక గాంధీ కి ప్రజల్లో వున్న చరిష్మా ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. భారత దేశంలో ఇప్పటికీ ఇందిరా గాంధీ అత్యంత ఛరిష్మాకలిగిన నాయకురాలు. ఆవిడ పోలికల్లోవున్న ప్రియాంక గాంధీపై ప్రజల్లో క్రేజ్ ఉన్నమాట వాస్తవం. మనదేశంలో ఫ్యూడల్ భావాలు ఇంకా బలంగా వున్నాయి. కుటుంబ వారసత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిదికాదని తెలిసినా ప్రజల మనస్తత్వం ఇంకా వాటి వెనుకే తిరుగుతుందని మరచిపోవద్దు. అందునా నెహ్రూ కుటుంబంపై వున్న క్రేజ్ ఇంకా ఎక్కువ. అదేసమయంలో తన భర్త రాబర్ట్ వాద్రాపై వున్న అవినీతి ఆరోపణలు కొంతమేర ప్రభావం చూపొచ్చు. ప్రస్తుత ఎన్నికల్లో వున్న పరిమిత సమయంలో ప్రియాంకగాంధీ ప్రచారం తూర్పు ఉత్తరప్రదేశ్ కే పరిమితమై ఉండటం వలన ఈ ఎన్నికల్లో ఆమె ప్రభావం ఒకవేళవున్నా పరిమితప్రాంతానికే కుదించబడింది. ఈ నేపథ్యంలో మోడీ హవా నే వుండే అవకాశం వుంది.

ఇకపోతే ఆంధ్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు అన్నిసర్వే లు జగన్ పార్టీకి అనుకూలంగా వున్నాయి. సభలకు,సమావేశాలకు హాజరయ్యే జనాన్ని చూసినా ఆ భావనే కలుగుతుంది. పోలింగుకి ఇంకా పది రోజులు సమయముంది. పోయినసారికూడా ఎన్నికలకు ముందు వైఎస్సార్ పార్టీకే సర్వే లన్నీ ఆధిక్యతను ఇచ్చాయి. చివరి రెండు వారాల్లో పరిస్థితులు మారాయి. అందుకు మోడీ హవా , పవన్ కళ్యాణ్ మద్దత్తు కారణమని విశ్లేషకులు అభిప్రాయానికొచ్చారు. ఈ సారి ఆ రెండు కారణాలు లేవు. అయితే చంద్రబాబునాయుడు పోల్ నిర్వహణపై ఆ పార్టీ, ఆయన మద్దతుదారులు ఆశలు పెట్టుకున్నారు. దానికి తగట్టుగా ప్రణాళికలు రచించుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా కొద్దిరోజుల్నుంచి తెలుగు లోని ఎక్కువ చానళ్ళు 75 శాతం తెలుగుదేశం ఎన్నికల ప్రచారాన్ని , చంద్రబాబునాయుడు ప్రసంగాలనే చూపిస్తున్నాయి. ఇక తెలుగుదేశం ఎన్నికల ప్రకటనలు కూడా చాలా ప్రభావవంతంగా వున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ళు ఆశలు పెట్టుకుంది ఏప్రిల్ మొదటివారం లో సంక్షేమ పధకాల డబ్బుని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేయటం పోలింగ్ ముందు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని నమ్ముతున్నారు. చివరిగా పోలింగ్ రోజు తమ మద్దతుదారుల్ని పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో చంద్రబాబునాయుడు పకడ్బందీగా ప్లాన్ చేస్తాడని చివరకు ఈ అన్ని కారణాలవలన మాకే ఎక్కువ సీట్లు వస్తాయని విశ్వసిస్తున్నారు.

ఇక జగన్ విషయానికి వస్తే ప్రజలు చంద్రబాబునాయుడు చిట్కాలకుఈ సారి మోసపోరని చెబుతున్నారు. ఒకవేళ కొంతశాతం ప్రభావానికి లోనైనా అది తెలుగుదేశం ఎక్కువసీట్లు గెలవటానికి ఉపయోగపడదని నమ్ముతున్నారు. దానికి కారణం రెండు పార్టీలమధ్య ఓట్లశాతం తేడా దాదాపు పది శాతం ఉందని దాన్ని అధిగమించి ఈ చమక్కులవలన ఓట్లు పడవని నమ్ముతున్నారు. ఒకవేళ మూడు,నాలుగు శాతం ఓట్లు మారినా అది ఫలితాన్ని తారుమారు చేయదని నమ్ముతున్నారు.ఇప్పటికే ఓటర్లు గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ సారి నూటికి నూరు శాతం విజయం సాధిస్తామని నమ్ముతున్నారు.

ఇక పవన్ పాత్ర ఆసక్తికరంగా మారింది. మొదట్లో జాతీయ చానళ్ళు జనసేన ఉనికిని గుర్తించకపోయినా రాను రానూ రెండు ప్రధాన పార్టీలు అంటే తెలుగు దేశం, వైఎస్సార్సీపీ జనసేనను టార్గెట్ చేయటం చూస్తుంటే జనసేన కూడా పోటీలో ప్రధాన పోటీదారు అని గుర్తించినట్లయ్యింది. ప్రచారం లో మిగతా రెండు పార్టీలతో పోలిస్తే పవన్ కొంత హుందా గా, విభిన్నంగా మాట్లాడుతున్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మొదట్లో జనసేనను గుర్తించక పోవటం, తర్వాతదశలో జనసేన రెండో పార్టీతో మిలాఖత్ అయ్యిందని ఇద్దరు ఆరోపించడం ,గత పది రోజుల్నుంచీ జగన్ పవన్ ని ఎక్కువగా టార్గెట్ చేయటం చూస్తుంటే జనసేన బరిలో గట్టి పోటీ ఇస్తుందని అర్ధమవుతుంది. ఒకనాడు విస్మరించిన ఛానళ్ళే ఇప్పుడు ఇంటర్వ్యూ లతో ప్రముఖంగా ప్రచురించటం పవన్ కి పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతున్నాయి. అదేసమయంలో రెండురోజులక్రితం టీవీ 5 లో పవన్ ఇంటర్వ్యూ చూసినవాళ్లకు కాలంతో పాటు మార్పు వచ్చిన పవన్ న్నిచూశారు. ఒకనాడు ఆవేశం పాలు ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఆలోచనతో పాటు స్థిరమైన, స్పష్టమైన అభిప్రాయాలతో నాయకుడుగా ఎదిగాడని ప్రజలు ఆలోచిస్తున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒంటరిగా అధికారంలోకి వచ్చే సత్తా ఈ ఎన్నికల్లో లేకపోయినా మూడో శక్తిగా గుర్తింపు వచ్చే దిశగా ప్రయాణం చేస్తుందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ సభలకు జగన్,చంద్రబాబునాయుడు సభలకు ధీటుగా జనం రావటం చూస్తుంటే ముక్కోణపు పోటీకి ఆంధ్ర రాష్ట్రం లో రంగం సిద్దమయిందనిపిస్తుంది.రేపు ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే కీలకంగా మారే అవకాశమూ లేకపోలేదు. ఒకవేళ ఒక పార్టీ స్వంతంగా అధికారంలోకి వచ్చినా జనసేన ప్రతిపక్షంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. మొత్తం మీద ఆంధ్ర రాజకీయాలు ఇకనుంచి ద్విపక్ష పోరుగా కాకుండా త్రిపక్ష పోరుగా మారుతున్నాయి. ఇది సత్యం. భవిష్యత్తులో ఈ పరిణామం జనసేన ప్రధాన శక్తిగా ఎదిగే అవకాశాలు మెండుగా వున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే మిగతా రెండు పార్టీలు వడ్డించిన విస్తరలో భోజనం చేస్తున్నారు. తెలుగుదేశం స్థాపించిన ఎన్టీఆర్ ని వెన్నుపోటుపొడిచి నాయకత్వంలోకి చంద్రబాబునాయుడు వచ్చాడు. జగన్ తనతండ్రి ప్రజల్లో సంపాదించిన పేరుతో, అక్రమంగా సంపాదించిన డబ్బుతో తండ్రి మృతిని అవకాశంగా మలుచుకొని పార్టీని ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థాపించాడు. అదే పవన్ కళ్యాణ్ విషయంలో ఎటువంటి లెగసీలేదు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినా దానిద్వారా వచ్చిన వారసత్వ ప్రయోజనమేమి లేకుండా ఒంటరిగానే పార్టీని స్థాపించి ఎన్నో కష్టాలతో పార్టీని ఈ స్థాయికి తీసుకురావటం అభినందనీయం. పార్టీ పెట్టినప్పుడు దీన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. సంవత్సరం క్రితందాకా జనసేన ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే 2014 ఎన్నికల్లో పోటీలో పాల్గొనక పోయినా తెలుగుదేశం గెలవటం లో గణనీయమైన పాత్ర పోషించాడు. ఆ తర్వాతకూడా అందరూ జనసేన రాజకీయ పార్టీగా ఎదగదనే భావించారు. కేవలం ఆరు నెలల్లోనే ఓ పెద్ద రాజకీయశక్తిగా ఎదగటం కేవలం పవన్ స్వీయ కృషే. ఈ పట్టుదల చూస్తుంటే ముందు ముందు పవన్ కళ్యాణ్ కు మంచి భవిష్యత్తు ఉందని అనిపిస్తుంది.

ఇక తెలంగాణ రాజకీయాలు అంత శుభం గా లేవనే చెప్పాలి. కాంగ్రెస్ తరఫున గెలిచిన పందొమ్మిది మందిలో పది మంది ఎమ్మల్యేలను తెరాస lతమవైపు తిప్పుకోవటం చూస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లయింది. ఈ పరిణామాన్ని ప్రజలు హర్షిస్తారని అనుకోవటం పొరపాటు. మొన్నటికి మొన్న ఎమ్మల్సీ ఎన్నికల్లో ప్రజల అసమ్మతి బయటకొచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి గుణపాఠం చెబుతారని అనుకోవటం అతిశయోక్తి అవుతుంది. అదే సమయంలో కొంత అసమ్మతి సూచనలు స్పష్టంగా ఈ ఎన్నికల్లో కనబడతాయి. అవి కొన్ని సీట్లలోనైనా ఫలితాలను ప్రభావితం చేస్తాయని అనిపిస్తుంది. వేచి చూద్దాం.
Prev రాజకీయాల కోసం మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు: కేసీఆర్
Next లైవ్ లో ప్రియుడి చెంప చెల్లు మనిపించిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.